నవతెలంగాణ తిరువనంతపురం: కేరళలోని ఆలయ పూజారి గోపన్ స్వామి.. ఇటీవల సజీవ సమాధి అయ్యారు. అయితే ఆ పూజారి మృతదేహాన్ని ఇవాళ సమాధి నుంచి పోలీసులు వెలికితీశారు. తిరువనంతపురం జిల్లాలోని నెయ్యటింకర గ్రామంలో ఆ పూజారి సమాధి అయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. పూజారి సజీవ సమాధి అయినట్లు జనవరి 10వ తేదీన పోస్టర్లు వెలిశాయి. దీంతో గ్రామస్థులు ఆ సమాధిపై అనుమానాలు వ్యక్తం చేశారు. గోపన్ స్వామి కోరిక మేరకు సమాధి కట్టినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కానీ గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు. ఇవాళ భారీ సంఖ్యలో పోలీసులు ఆ సమాధి వద్దకు వచ్చి .. దాంట్లో నుంచి శవాన్ని బయటకు తీశారు. కూర్చుని ఉన్న పూజారి దేహాన్ని.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని వెలికి తీయరాదు అని కుటుంబం వేడుకున్నా.. కేరళ హైకోర్టు ఆదేశాల ప్రకారం సమాధి నుంచి పూజారి శవాన్ని బయటకు తీశారు. ఫోరెన్సిక్, వేలిముద్ర నిపుణులు సమాధి సైట్ వద్దకు చేరుకున్నారు. అనుమానిత మృతి, వ్యక్తుల అదృశ్యం అఆంటి కేసుల్లో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టవచ్చు అని జస్టిస్ సీఎస్ డయాస్ తెలిపారు. జనవరి 9వ తేదీన రాత్రి తన తండ్రి సజీవ సమాధి అయినట్లు రాజసేనన్ తెలిపారు. ప్రైవేటుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని, పబ్లిక్‌గా చేయవద్దు అని ఆదేశించినట్లు చెప్పారు.