‘రోడ్లే లేని రోజుల్లో నాన్న (ఏఎన్నార్) హైదరాబాద్‌కి వచ్చి ఇంతపెద్ద అన్నపూర్ణ స్టూడియోస్ ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో మంది టెక్నిషీయన్లు, కొత్త ఆర్టిస్ట్‌లను, కొత్త డైరెక్టర్స్‌కు ఉపాధి కల్పించింది. ఎంతో మందికి ఏయన్నార్ స్ఫూర్తి’ అని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు అయిన సందర్భంగా నాగార్జున ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో నాగార్జున మాట్లాడుతూ, ‘అన్నపూర్ణ స్టూడియోస్కి 50వ ఏడు మొదలైంది. ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనుక ఒక విమెన్ ఉంటుందని నాన్న నమ్మేవారు. ఆయన సక్సెస్ వెనుక మా అమ్మ ఉన్నారని ఆయన నమ్మకం. అందుకే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు. స్టూడియోస్కి వచ్చినప్పుడల్లా అమ్మ, నాన్న ఇక్కడే ఉన్నారనిపిస్తుంది. స్టాఫ్‌ని మేము ఫ్యామిలీగా భావిస్తాం. ఇవాళ స్టూడియో కళకళలాడుతుందంటే అది అన్నపూర్ణ ఫ్యామిలీ మూలంగానే. వాళ్ళు అన్నపూర్ణ వారియర్స్. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మ, నాన్న అన్నపూర్ణ ఫ్యామిలీతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఆ ట్రెడిషన్ ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతోంది. లైఫ్‌లో నాకు, మా పిల్లలకు నాన్న పెద్ద ఇన్స్పిరేషన్. మా ఫ్యామిలీ ఒక్కరికే కాదు బయట చాలా మంది కూడా ఆయన వాళ్ళకి పెద్ద ఇన్స్పిరేషన్ అని చెబుతుంటారు’ అని తెలిపారు.