– సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఆరాధనా స్థలాల చట్టం, 1991కి ఎదురవుతున్న సవాళ్ల విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జాతీయవాదం, స్వాతంత్య్రోద్యమంలో భాగంగానే భారతదేశంలో లౌకికవాదం అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా పార్టీ వ్యాఖ్యానించింది. భారత ప్రజల ఆదేశాన్ని ఈ చట్టం ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ అన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం లభించినపుడు 1947 ఆగస్టు 15నాటికి నెలకొని వున్న ఆరాధనా స్థలాల స్వభావాన్ని ఈ చట్టం పరిరక్షిస్తోంది. 10వ లోక్‌సభలో ఈ చట్టాన్ని ఆమోదించారు. దేశంలో లౌకికవాదాన్ని పరిరక్షించేందుకు ఈ చట్టం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్ళను చూస్తుంటే ఇప్పటికే వేళ్లూనుకుపోయిన లౌకికవాద సిద్ధాంతాలను దెబ్బతీసేలా దురుద్దేశపూరితమైన ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని పార్టీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ చట్టం యొక్క రాజ్యాంగబద్ధమైన, సామాజికపరమైన ప్రాధాన్యతను నొక్కి చెప్పడానికి గానూ ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని పార్టీ కోరుతోందని వేణుగోపాల్ పేర్కొన్నారు.