గురుకుల ,పాఠశాలల్లో విద్యార్థులు చేరాలి..

Students should join gurukula and schools.– రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధారణ గురుకుల – పాఠశాలల్లో విద్యార్థులు చేరాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సూచించారు. శనివారం తన రూరల్ క్యాంప్ కార్యాలయంలో గురుకుల ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం ఆసక్తి, అర్హత గల విద్యార్థులు టీజీసెట్ – 2025 కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాలలో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో లక్షా యాబై వేల లోపు ఉండాలన్నారు. ఆసక్తి అర్హత కలిగిన విద్యార్థులు www.tswreis.ac.in లేదా http://tgcet.cgg.gov.in వెబ్సైట్ ద్వారా రూ.100లు మాత్రమే రుసుము చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రోస్టర్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో పాటు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించబడుతాయన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులను జనవరి 31లోగా సమర్పించాలని, ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23న నిర్వహించబడుతుందని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాధవీలత తెలిపారు.