ఏరా బంగారు తల్లి, ఏం చేస్తున్నావు? ఏమిటో ఇవ్వాళ నా మనసంతా బాధతో, ఆవేదనతో నిండిపోయి ఉంది. అందుకే నీకు ఉత్తరం రాస్తున్నా. దీంతో నాకు కొంచెం ఉపశమనం. ఈరోజు పేపర్‌లో ఒక వార్త చదివాను. ఎంతో బాధనిపించింది. తరచూ ఇటువంటి వార్తలు చదువుతున్నప్పటి ఈ వార్త మాత్రం మనసుని కలచి వేసింది.
అసలు విషయం ఏమిటంటే 65, 60 ఏండ్ల వయసు గల దంపతులు కొడుకు తమను చూడటం లేదని ఆత్మ హత్య చేసుకున్నారు. ఇది నేను చదివిన వార్త. ఇటువంటివి ఎన్నో చదువుతున్నాం, కొన్ని సంఘటనలు చూస్తున్నాం. పిల్లలు రెక్కలు రాగానే ఎగిరి పోవడం, కన్న తల్లిదండ్రులను పట్టించుకొక పోవడం లేదా తమ అవసరాలకు వాడుకోవడం వంటివి చేస్తున్నారు. వృద్ధాప్యం వచ్చిన తల్లి తండ్రుల పట్ల ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం?
ఈ రోజు బిడ్డలు అభివృద్ధిలోకి వచ్చారంటే అందుకు తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేసుంటారో. వాళ్లే మరో విధంగా ఆలోచించి ఉంటే ఈ పిల్లలు ఎక్కడ ఉండే వారు, ఎలా ఉండే వారు? చదువు కున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం అని చెప్పుకునే పిల్లలు, తల్లిదండ్రులను చూసుకుంటున్నాం, చూసుకోవాలి అది మా బాధ్యత అని ఎందుకు అనుకోవడం లేదు. పెండ్లికాగానే తల్లి తండ్రులను మర్చి పోవడం, వాళ్ళతో మాట్లాడటానికి సమయం లేదనడం చూస్తున్నాం. సినిమాలు, హోటళ్లు, బైట తిరగడానికి సమయం ఉన్నప్పుడు కనిపెంచిన తల్లిదండ్రుల కోసం సమయం ఎందుకు ఉండదు. ఇది చాలా తప్పు నాన్న.
చరిత్ర పునరావృతం అవుతుంది అంటారు. రేపు మీరుకూడా వృద్దులు అవుతారు. మీ పట్ల కూడా మీ పిల్లల వ్యవహార శైలి ఇలాగే ఉంటే? తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే మిమ్మల్ని చూసే కదా వాళ్ళు నేర్చుకునేది. అంతే కదా నాన్న.. అమ్మా నాన్నలను చూసే కదా పిల్లలు నేర్చుకుంటారు. ఇటీవల తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేయడం ఓ ఆనవాయితీగా మారింది. వాళ్ళు ఆ వయసులో కోరుకునేది ప్రేమతో ఓ పలకరింపు. పిల్లలు తమ దగ్గర కూర్చుని కాసేపు కబుర్లు చెప్పాలని కోరుకుంటారు. తమను పట్టించుకుంటే చాలు అనుకుంటారు.
కన్నా.. ఒక్కొక్క సారి తల్లిదండ్రుల మీద పిల్లలకు, పిల్లల మీద తల్లిదండ్రులకు కోపం రావడం సహజం. అయినా కూడా అవి మనసులో పెట్టుకోకుండా కలిసి పోవాలి. నేటి పిల్లలకు చెప్పేది ఒక్కటే.. వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకున్నా, మీరు ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నారంటే వాళ్లే కారణం. ఎవరి రుణం అయినా తీర్చు కోవచ్చు, జన్మ నిచ్చిన వారి రుణం తీర్చుకోలేనిది. బిడ్డలు ఎలాంటి వారైనా వారు బాగుండాలని మనసారా ఆశీర్వదించేది, కోరుకునేది తల్లిదండ్రులు మాత్రమే..
ఇక నైనా మారండి జీవితపు చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోండి. వారికి సంతోషం కలిగించండి. నాన్న.. రేపు నీకూ కుటుంబం ఏర్పడ్డాక తల్లిదండ్రులను, అత్త మామలను చూసుకోవాలి. వారికి ప్రేమను పంచాలి. పెద్ద వాళ్ళు ఏదైనా అన్నా పట్టించుకోకూడదు. కొందరికి అభద్రతా భావం ఏర్పడుతుంది. అటువంటప్పుడు వారికి ధైర్యం చెప్పాలి. నువ్వు ఎంత ప్రేమను పంచితే వారికి అంత నిశ్చింత. వారు నీపై అంతే ప్రేమను కురిపిస్తారు.
‘మా పిల్లలు బంగారం, వాళ్ళు మాకు కొండంత అండ, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు’ అని వాళ్ళు చెప్పుకునే లాగా ఉండాలి.
ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి