అస్థిరతకూ అశాంతికి అసలు కారణమెవరు?

మాటిమాటికీ ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకమనీ, అస్థిరత్వమనీ ప్రధాని మోడీ ఆయన వత్తాసు దారులు అదే పనిగా చెబుతున్నారు. పార్లమెంటులో నిబంధనలకు విరుద్ధంగా జమిలి బిల్లు ప్రవేశపెట్టి బలం లేదని తెలుసు గనక వాయిదా వేసుకున్నారు.ఇందుకు సంబంధించిన భిన్న వాదోపవాదాలు ఒకటైతే అసలు ఈ హడావుడి చేసిన బీజేపీ వారి గతం ఎట్టిదనే ప్రశ్న చాలా ఆసక్తి కలిగిస్తుంది. గత ముప్పై ఏళ్లలో అత్యధికంగా అస్థిరత్వంతో అశాంతితో ఆటంకాలు కలిగించిన వారు ఎవరంటే వేలు బీజేపీవైపే చూపిస్తుంది.ఉంటే తాముండాలి లేకుంటే మరొకరిని ఉండనివ్వకూడదనేది వారి రాజకీయ తాత్వికత. ఇక అధికారం కోసం మతతత్వం ప్రకోపింప చేయడం వారి సైద్ధాంతిక తాత్వికత. ఇందుకు ఉదాహరణలు లెక్కలేనన్ని. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు 1959లో కేరళ నంబూద్రిపాద్‌ ప్రభుత్వంతో మొదలెట్టి ఇష్టం లేని సర్కార్లను వరుసగా కూలదోసిన మాట నిజమే. కానీ ఈ విషయంలో బీజేపీ రికార్డు మరో విధంగా హానికరమైందని గుర్తించవలసి వుంది.
స్వార్థం కోసం చిచ్చు
కాంగ్రెస్‌ను ఎదుర్కోవడమే తమ లక్ష్యమైనట్టు మాట్లాడే బీజేపీ దాని పూర్వరూపమైన జనసంఘం తాము లేనిచోట్ల మరెవరూ వుండకూడదనే స్వార్థపూరత వైఖరినే అనుసరించారు. ప్రతిపక్ష సంఘటన ప్రభుత్వాలు ఏర్పడిన చోట్ల కూడా తగవులతో మతకలహాలతో చిచ్చుపెట్టి పడగొట్టారు. 1967లో మొదటిసారి వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడగా బెంగాల్‌, కేరళలోనూ సీపీఐ(ఎం) నాయకత్వం వున్నచోట్ల తప్ప మిగిలిన చోట్ల ఇలాంటి సర్కార్లు ఏర్పడ్డాయి. అవేవీ పూర్తికాలం నిలిచింది లేదు.జనసంఘం నాయకులు రకరకాల పేచీలతో అస్థిరత్వం పాలుచేశారు. ఇక వామపక్ష సర్కార్లను కేంద్ర కాంగ్రెస్‌ రద్దు చేస్తూ వచ్చింది.ఈ నేపథ్యం చివరకు 1975లో ఇందిరాగాంధీ ఎమర్జన్సీ విధింపుతో పరాకాష్టకు చేరింది. దానికి తక్షణ ప్రత్యా మ్నాయంగా జనతా పార్టీ ఏర్పడి అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీలో జనసంఘం కూడా వున్నా ప్రజాస్వామ్య పరిరక్షణ కోణంలో సీపీఐ(ఎం) కూడా మద్దతునిచ్చింది.అయితే పూర్తి మెజార్టీతో జనతా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆరెస్సెస్‌ తరహా మతరాజకీయాలను పాఠ్యపుస్తకాల్లో జొప్పించడమనే అజెండాతో వివాదం ప్రారంభమైంది. ఈ క్రమంలో చివరకు ఆరెస్సెస్‌ ద్వంద్వ సభ్యత్వం వదులుకోవడానికి వాజ్‌పేయి, అద్వానీల నాయకత్వంలో జనసంఫ్‌ు వర్గం నిరాకరించడం వల్ల ఆ ప్రభుత్వం పడిపోయే స్థితి వచ్చింది.ఆ సమయంలో చరణ్‌సింగ్‌ను బలపర్చి జనతా పార్టీ చీలికకు కారకులయ్యారు. రాష్ట్రాల్లోనైతే అన్నిచోట్లా ఈ ఇద్దరి తరపు నాయకులే చీలికలు తెచ్చి సగం సగం చొప్పున ముఖ్యమంత్రి పదవులు చేజిక్కించుకున్నారు.తర్వాత ఆయన్నూ జనసంఘం వర్గం ఆయన్నూ వెన్నుపోటు పొడిచింది.
ఎన్టీఆర్‌, చంద్రబాబు తేడా
1980లో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి రాగలిగారు. వచ్చీ రాగానే ఆమె రాష్ట్రాల్లో జనతా ప్రభుత్వాలను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. 80వ దశకం పొడుగునా బీజేపీ లేకుండా కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమి ఏర్పడాలన్నదే వామపక్షాల విధానంగా వుండేది. టీడీపీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఏపీి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వంటివారు అందరూ కలసి వుండాలన్నా వామపక్షాలు విడిగానే వుంటూ వచ్చాయి. 1986లో రాజీవ్‌గాంధీపై వీపీసింగ్‌ తిరుగుబాటు తర్వాత మరోసారి జనతా తరహా ప్రయోగం జరగకుండా అడ్డుకోగలిగాయి. నేషనల్‌ ఫ్రంట్‌లోనూ బీజేపీకి చోటు లభించలేదు. వీపీసింగ్‌ వామపక్షాలు తన సహజ మిత్రులంటూ వారితో వేదిక పంచుకోవడానికి నిరాకరించారు గానీ స్థానికంగా సర్దుబాటుకు అంగీకరించారు. కాంగ్రెస్‌ ఓటమితో వీపీ సింగ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు తమకు స్థానం లభించకపోవడం బీజేపీకి మింగుడు పడలేదు. ఆయన మండల్‌ నివేదికను ఆమోదించడం అసలే నచ్చలేదు. దాంతో మండల్‌కు వ్యతిరేకంగా కమండల్‌ అంటూ అద్వానీ రథయాత్ర ప్రారంభించారు. ఆ అంశంపైనే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారు కూడా. వీపీసింగ్‌ తర్వాత కాలంలో వాజ్‌పేయి ఏ మాత్రం బలం లేకున్నా సర్కారు ఏర్పాటు సంకేతాలిచ్చారు, తలుపులు తెరుచుకుని కూచున్నామన్నారు. కానీ ఎవరూ కలవలేదు. అలా రెండోసారి కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని వారే అస్థిరత్వం పాలుచేశారు. పీవీ నరసింహారావు హయాంలో దాగుడు మూతలాడుతూ బాబరీ మసీదును కూలదోసి ప్రపంచవ్యాపితంగా నిరసనకు కారణయ్యారు. ఆ సమయంలో వారి ఆధ్వర్యంలోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం అనివార్యమైంది. మసీదు కూల్చివేత ఘటనల తర్వాత 1994లో బీజేపీతో పొత్తుకు ఎన్టీఆర్‌ నిరాకరించారు. ఎన్టీఆర్‌పై తిరుగుబాటుచేసిన చంద్రబాబు నాయుడు నిలదొక్కుకునే వరకూ, 1996 ఎన్నికలవరకూ వామపక్షాలు, లౌకిక పార్టీలతో వున్నారు. తర్వాత మాత్రం మారిపోయారు,
వాజ్‌పేయి ప్రహసనం
1996లో కాంగ్రెస్‌ బయటనుంచి ఇచ్చే మద్దతుతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థితి వున్నా.. అధికారం కోసం ఆరాటంలో వాజ్‌పేయి ఏమాత్రం మెజార్ట్టీ లేకుండా కేవలం 160 సీట్లతో 1996లో సర్కారు ఏర్పాటు చేసి 13 రోజుల్లో అవమానకరంగా దిగిపోయారు. తర్వాత ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని సహించలేక రెండేండ్ల లోనే కాంగ్రెస్‌తో కలసి కూలదోశారు.1998లో వచ్చిన వాజ్‌పేయి ప్రభుత్వం చంద్రబాబు మద్దతువల్ల ఏడాది నడిచినా బలం లేక కూలి పోయింది. ఇంత రాజకీయ అస్థిరత్వం, అశాంతి ఎవరిది మరి? కానీ ఆ కాలంలోనూ రాజ్యాంగాన్ని తిరగదోడేందుకు జస్టిస్‌ వెంకట్రామయ్య కమిషన్‌ వేసి విఫలయత్నం చేశారు. అధ్యక్ష తరహా పాలన మెరుగైందని అద్వానీ బాహాటంగా మాట్లాడారు. కార్గిల్‌ నేపథ్యంలో వాజ్‌పేయి 1999లో మూడోసారి కాస్త స్పష్టమైన ఆధిక్యతతో వచ్చినా ఆ కాలంలోనే గుజరాత్‌ మారణకాండతో సహా అనేక దారుణాలు జరిగాయి. తెహల్కా టేపుల వంటివి వచ్చాయి. తాముగా ఏడాది ముందే ఎన్నికలకు వెళ్లి భంగపడ్డారు.ఈ అస్థిరత్వమంతా ఎవరి పుణ్యం?
ముందస్తు నేత మోడీ
ఇక ఇప్పుడు జమిలి సామ్రాట్‌ నరేంద్రమోడీ కార్యభూమి గుజరాత్‌ కథ చూద్దాం. వాజ్‌పేయి హయాంలోనే అక్కడ 1995లో కేశూభారు పటేల్‌ ముఖ్యమంత్రికాగా మోడీ ఆరెస్సెస్‌ తరపున ప్రతినిధి. కేశూభారుతో శంకర్‌సింగ్‌ వాఘేలా విభేదించడంతో ఆ ప్రభుత్వం ప్రతిష్టంభనలో పడిన పరిస్థితిని తాను ఉపయోగించుకున్నారు. మధ్యలో రాజీ అభ్యర్థిగా సురేష్‌మెహతాను సీఎంను చేసినా పెద్దగా నడిచింది లేదు. వాఘేలా స్వంతంగా పార్టీ ఏర్పాటు చేసి చీలిపోవడమే అందుకు కారణమైంది.1998 ఎన్నికల నాటికి మళ్లీ కేశూభారు పటేల్‌ను తెచ్చినా నిలిచే పరిస్థితి లేకపోయింది. భూకంపం సహాయ కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడ్డారనే కారణంతో 2001లో ఆయన్ను తప్పించి మోడీని సీఎంగా చేశారు.ఇదంతా ఏపాటి స్థిరత్వమో చూడొచ్చు. మోడీ హయాంలో గుజరాత్‌ మారణకాండ దేశాన్ని కుదిపేసింది. ప్రపంచం నివ్వెరపోయింది.ఆయన్ను దింపేయాలని వాజ్‌పేయి, ఆయన్ను చూసి చంద్రబాబు అన్నారు గానీ తర్వాత తగ్గారు.ఇదిగో అలాంటి భయానక సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు మోడీ. 2002 జులై19న శాసనసభ తీర్మానం ఆమోదించిన గవర్నర్‌ భండారీ శాసనసభను రద్దు చేశారు. ఇప్పుడు ‘ఒకేదేశం ఒకే ఎన్నిక’ అంటున్న ఈ అధినేత అప్పుడు తొందరగా ఎన్నికలు జరిపించాలని ఎన్నికల సంఘంపై ఒత్తిడి తేవడమే గాక రాజకీయ లీగల్‌ పోరాటం కూడా చేశారు. కేసులు వేశారు, మారణ కాండ శరణార్థులు ఇంకా శిబిరాల్లో వుండగానే ఎన్నికలు పూర్తి చేసి గెలిచామనిపించుకున్నారు.అదో భయానక రాజకీయ క్రీడ. ఈ విజయం తర్వాత 2004 ఎన్నికల నాటికి జాతీయతారగా బీజేపీ ఆయన్ను ఊరేగించింది. అగ్రనేతలైన వాజ్‌పేయి,అద్వానీలు ఇద్దరినీ వెనక్కు నెట్టి నెమ్మదిగా తాను కేంద్రస్థానంలోకి వచ్చారు,
రాజకీయ ముసుగు
మధ్యంతర ఎన్నికల ద్వారా వచ్చిన ఒక నేత ఒకే తేదీన అన్ని ఎన్నికలు జరపాలని పట్టుపట్టడంలో రాజకీయమేమిటో ఎవరికైనా అర్థమవుతుంది.ఈ కాలంలో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారాయో ఎన్ని ఫిరాయింపులు జరిగాయో దేశమంతటికీ తెలుసు.ఈ మధ్యలో మెజార్టీ మతతత్వాన్ని మసీదుల తగాదాలను రగిలించడం ఒకవైపు, కార్పొరేట్‌ దోస్తి మరో వైపు. కాంగ్రెస్‌ తరహాలో రాష్ట్ర ప్రభుత్వాల రద్దుకాగా దొడ్డిదోవన ఫిరాయింపులతో ఈడి, సిబిఐ, ఐటి త్రిశూల వ్యూహంతో ప్రభుత్వాలను కైవసంచేసుకోవడం మోడీ రాజకీయం. ఈ పూర్వ రంగంలో ఒకేదేశం ఒకే ఎన్నిక అనే జమిలి మంత్రం ప్రయోగం అనైతిక అప్రజాస్వామిక రాజకీయాలకు ముసుగు మాత్రమేనన్నది స్పష్టం.
తెలకపల్లి రవి