విద్యార్థి సంఘాల ఎన్నికలు – ఆవశ్యకత

విద్యార్థి సంఘాల ఎన్నికలు - ఆవశ్యకతవిశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల రాజకీయాలు చారిత్రక అవసరమని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఓ సభలో మాట్లాడారు.ప్రస్తుత రాజకీయాల్లో సైద్ధాంతిక భావజాలం ఉన్నవారు లేకపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని,విద్యార్థి రాజకీయాల్లో సిద్ధాంతపరంగా రాణించిన వారుంటే ప్రజాప్రతినిధులుగా అధికారంలో ఉన్నా, లేకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాలపాటు జీవితాలను త్యాగం చేస్తారని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై విద్యార్థి సంఘాలు పోరాటాలు చేయడం వల్లనే చైతన్యం వస్తుందని, దాని ద్వారానే ఆయా సమస్యలు పరిష్కారమవుతాయంటూ మాట్లాడారు.ఇదొక ఆహ్వానించదగ్గ పరిణామమే.అయితే ఇవి కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆశిద్దాం.
అంతకన్నా ముందు ఓ విషయాన్ని కూడా గుర్తుచేయాల్సివుంది. సుప్రీంకోర్టు 2005 డిసెంబర్‌ 2న ఇచ్చిన ఆదేశాల ప్రకారం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర మాజీ ముఖ్య ఎన్నికల అధికారి జేఎం లింగ్డో అధ్యక్షతన విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో విద్యార్థుల యూనియన్‌ ఎలక్షన్లను సమీక్షించి తగిన సూచనలు చేయాలని కమిటీని నియమించింది. కమిటీ 2006 మే 26న రిపోర్ట్‌ను అందజేసింది. అదే ఏడాది సెప్టెంబర్‌ 22న సుప్రీంకోర్టు కమిటీ ప్రతిపాదించిన రిపోర్టును అమలు చేయాలని యూనివర్సిటీలకు, కాలేజీలకు సూచించింది. విద్యార్థి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కమిటీ చాలా సూచనలు చేసింది. విద్యాసంవత్సరం మొదలైన ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్యలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, ఈ ప్రక్రియ మొత్తం పది రోజుల వ్యవధి మించకుండా పూర్తి చేయాలని, దేశంలో ఉన్న యూనివర్సిటీల్లో విద్యార్థి ఎన్నికలు నిర్వహించడానికి శాంతి,స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఏర్పాటు చేయాలని, పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ఆయా వర్సిటీల్లో నామినేషన్‌ పద్ధతిలో విద్యార్థి ప్రతినిధులను ఎన్నుకోవాలని పేర్కొంది. ఐదేండ్ల తర్వాత నామినేషన్‌ పద్ధతి నుంచి నిర్మాణాత్మకమైన ఎన్నికల విధానానికి రావాలని, అంటే పార్లమెంటరీ తరహాలో పరోక్షంగా లేదా అధ్యక్ష తరహాలో ప్రత్యక్షంగా లేదా రెండు కలిపిన ఎన్నికల విధానం అనుసరించాలని, విద్యార్థి సంఘాల్లో ప్రతినిధులుగా రెగ్యులర్‌ విద్యార్థులు మాత్రమే ఉండాలని, విద్యార్థి సంఘాల ప్రతినిధులు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా పనిచేయాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జేఎం లింగ్డో కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం ఐదేండ్లు నామినేషన్‌ పద్ధతిలో విద్యార్థి నాయకులను ఎన్నుకుని,ఆ తర్వాత విద్యార్థి యూనియన్‌ ఎలక్షన్స్‌ నిర్వహించాలి.
కానీ, కోర్టు ఆదేశించి పదిహేడేండ్లు గడిచినా అంటే ఉమ్మడి ఏపీ, ప్రస్తుత తెలంగాణతో సహా చాలా రాష్ట్రాల్లో అది ఆచరణలోకి రాలేదు. కేంద్ర విశ్వవిద్యాల యాలైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ,జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, రాష్ట్రస్థాయిలో కేరళ, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, రాజస్థాన్‌, పంజాబ్‌ తదితర వర్సిటీల్లో కొన్నిచోట్ల మాత్రమే విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎన్నికలకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనివల్ల విద్యార్ధుల్లో ఆర్థిక, సామాజిక,రాజకీయ చైతన్యం లేకుండా పోతోంది. విద్యలో కాషాయికరణ,ప్రయివేటీకరణ, ఫీజుల దోపిడీ, ప్రయివేటు యూనివర్సిటీల ఏర్పాటు, నిరుద్యోగం, కులం, మతం,ప్రాంతాల పేరుతో విద్వేషాలు సష్టించడం ఇలా విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసే అనేక వైపరీత్యాలు జరుగుతున్నా విద్యార్థులు కనీసం వారి హక్కుల కోసం గళమెత్తలేని అచేతన స్థితిలో ఉంటున్నారు.దీనివల్ల ప్రశ్నిం చేతత్వం తగ్గిపోతోంది.ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సామాజిక,ఆర్థిక,రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకొని సంఘ విద్రోహ శక్తులపై చదువుతూ పోరాటం – చదువుకై పోరాటం చేసేవాడే విద్యార్థి.అలాంటి విద్యార్థుల నిస్వార్థపు ఆలోచనలు,చర్యలు దేశ నిర్మాణానికి,ప్రగతికి దోహదం చేస్తాయి.ఇలా యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల నేతలుగా ఎదిగిన అనేకమంది నేడు దేశం కోసం,ప్రజల కోసం నిర్విరామంగా అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తున్నారు.ఇలా నిస్వార్థంగా పనిచేసేందుకు ఒక్క వామపక్షాలు తప్ప మిగతా రాజకీయాల్లోకి వచ్చే నాయకులు తగ్గిపోతున్నారు. విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగిన కాలంలో విద్యావ్యవస్థను పరిశీలిస్తే నాయకులు, విద్యార్థులందరూ సామాజిక సహతో చైతన్యంగా ఉండేవారు. అందువల్లనే ప్రాథమిక పాఠశాల నుండి యూనివర్సిటీల దాకా విద్యార్థి,టీచర్‌ నిష్పత్తి ప్రకారం నిరంతరం అధ్యాపకుల నియామకాలు జరిగాయి. నాణ్యమైన విద్యాబోధన డిమాండ్‌ చేయడంతో పాటు కాలేజీ, హాస్టల్‌ ఫీజులు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వంతో పోరాడేవారు. అంతేకాకుండా ప్రశ్నించేతత్వం ప్రతి విద్యార్థిలో ఉండటంతో విద్యాసంస్థలు కూడా బాధ్యతా యుతంగా, జవాబుదారీతనంతో పనిచేసేవి. ఒక్క విద్యాసంస్థలకే పరిమితం కాకుండా సామాజిక ఉద్యమాల్లో కూడా విద్యార్థులు కీలకపాత్ర పోషించారు.ఉదాహరణకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం రాజకీయ పార్టీల పోరాటంకంటే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి వీరోచితంగా ఉద్యమించడం వల్లనే రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది. ఈ పోరాటాలు సమాజం పట్ల విద్యార్థి నాయకులకు, విద్యార్థులకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తాయి.
దేశంలో ప్రస్తుతం విద్య,ఉపాధి రంగాల్లో రాజకీయ ప్రభావం లేని వ్యవస్థ అంటూ లేదు. 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆరెస్సెస్‌ సంస్థలు హిందూత్వ రాజకీయాల కోణంలో చరిత్రను రాయాలని పట్టుబట్టాయి. ఇప్పటికే మూఢ నమ్మకాలను జొప్పించే అలహాబాద్‌ లేదా గోరఖ్‌పూర్‌ విశ్వ విద్యాలయం కావచ్చు,అనేక కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో జ్యోతిష్యం, వాస్తు, ఆచారాలు మొదలైన విభాగాలు ప్రారంభించ బడ్డాయి. వాల్యూ ప్రమోషన్‌ ప్రోగ్రాం పేరుతో యూనివర్శిటీల్లో మూఢ నమ్మకాలకు పెంచి పోషిస్తున్నారు. హాస్యాస్పదమైన విషయమేమిటంటే, యువతకు ఇది ఉపాధి అవకా శంగా కూడా ప్రచారం చేస్తున్నారు.ఈ పదేండ్ల విద్యా రంగాన్ని కాషాయీకరణ చేయడం వల్ల ఇప్పటివరకు జరిగిన నష్టం ఊహించలేనిది. దీన్ని తిప్పికొట్టడం ప్రధాన సవాల్‌. కేవలం ఆరెస్సెస్‌- బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించడం ద్వారా దీనిని సరిదిద్దలేము. అది కాంగ్రెస్‌ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ప్రజారాజకీయ జీవితంలో మతపరమైన ఆచారాలను ఉపయోగించడం, మెజారిటీ మతపరమైన గుర్తింపును ప్రసన్నం చేసుకునే ధోరణి సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో, మతతత్వానికి వ్యతిరేకంగా చేతన పోరాటం, ప్రజా చైతన్యాన్ని విస్తరించడం శాస్త్రీయ, విమర్శనాత్మక ఆలోచనను అందించడానికి ఏకైక మార్గం.
నాదెండ్ల శ్రీనివాస్‌
9676407140