సోషల్‌ మీడియా’ లాభ‌మూ న‌ష్ట‌మూ

Social Media' Profit and Loss‘సోషల్‌ మీడియా’ అనగానే చాలా మందికి కలిగేది నెగిటివ్‌ ఆలోచనే. ప్రతి రోజూ మనం చూసే వార్తల్లో సోషల్‌ మీడియా ప్రభావంతో జరుగుతున్న మోసాలు, నేరాలు, హింస, అసాంఘిక చర్యలు ఎక్కువగా చోటుచేసుకోవటమే దీనికి ప్రధాన కారణం. దాంతో పెద్ద వయసు వారిలో ఒక తెలీని భయం ఏర్పడుతోంది. ఈ రోజు ఎక్కడ చూసినా సోషల్‌ మీడియా అనేది ఒక ప్రధాన చర్చనీయాంశంగా వుంటోంది అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి సోషల్‌ మీడియాపై కొంత వరకైనా అవగాహన పెంచుకుందాం…
నిజానికి ఊహ తెలిసిన పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు సోషల్‌ మీడియాకి ఆకర్షితులౌతున్నవారే. దాని ప్రభావాలు కూడా వారిపై ఒకే రకంగా ఉండవు. వాళ్ళ వయసు, మానసిక ఎదుగుదల, వ్యక్తిత్వ లక్షణాలు, పరిసరాలు, పెరిగిన వాతావరణం, స్వీయ అనుభవాలు వంటి అనేక అంశాల ఆధారంగా కూడా తీవ్రత స్థాయి ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా చిన్నపిల్లలు, టీన్స్‌పై దీని ప్రభావం తీవ్రస్థాయిలో వుంటోంది. అందుకు కారణం వారి వ్యక్తిత్వం రూపుదిద్దుకునే దశ అది. దేనినైనా త్వరగా గ్రహించటం, అడాప్ట్‌ చేసుకోవటం ఈ దశ లక్షణం. కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత కూడా ఆ దశలోనే ఎక్కువగా వుంటుంది. మంచికన్నా చెడుకి ఎక్కువగా ఆకర్షితులయ్యే వయసు కూడా ఇదే. అందుకే సోషల్‌ మీడియా ప్రభావం వాళ్ళపై ఎక్కువగా వుంటుంది.
సోషల్‌ మీడియాలో వుండేదంతా నెగిటివిటీ యేనా? అంటే – కాదనే చెప్పాలి. వాస్తవానికి సోషల్‌ మీడియా ఈ తరం వారికి ఒక గొప్ప వరం లాంటిది. వయసులో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి సోషల్‌ మీడియా ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే వుంది. అయితే దాన్ని సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకోవాలి.
ప్రయోజనాలు
ప్రతిఒక్కరూ తమ భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించటానికి సోషల్‌ మీడియా ఒక చక్కని ఫ్లాట్‌ఫాంగా పనిచేస్తుంది. వేల సంఖ్యలో పాఠకులు వారికి లభ్యం అవుతున్నారు. వారితో ఇంటరాక్ట్‌ అవటం వల్ల మనల్ని మనం అభివృద్ధి పరుచుకునే అవకాశం వుంటుంది. అన్ని రంగాల వారికి సంబంధించిన విస్తృత సమాచారం అందుబాటులో వుండటమే కాకుండా కొత్త కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి.
– క్విజ్‌లెట్‌, క్విక్‌మాథ్‌, నియర్‌పాడ్‌ వంటి యాప్స్‌ విద్యార్థుల మేధస్సుని పదునుపెట్టటంతో పాటు వారిలో సృజనాత్మకతని పెంపొందిస్తున్నాయి.
– క్రియేటివిటీ వున్న యువత ప్రయోగాలు చేయటానికి సోషల్‌ మీడియా ఒక చక్కటి ఫ్లాట్‌ఫాం అవుతోంది. వారు తమ ప్రతిభని ప్రపంచానికి చాటటమే కాకుండా మెరుగులు దిద్దుకోవటానికి కూడా సోషల్‌ మీడియా మంచి అవకాశం కల్పిస్తుంది.
– సోషల్‌ మీడియాని ఉపయోగించుకోవటం వలన పిల్లల్లో కొత్త కొత్త పదాలు నేర్చుకోవటం, స్వతంత్రంగా ఆలోచించగలగటం, సెల్ఫ్‌ ఎవేర్‌నెస్‌, డెసిషన్‌ మేకింగ్‌ వంటి నైపుణ్యాలు ఎక్కువగా వుంటున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే – మన నిత్య జీవితానికి అవసరమైన ఆహారం, ఆరోగ్యం, విద్య, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం మొదలుకుని అంతరిక్షం దాకా ఎటువంటి సమాచారాన్నైనా క్షణాల్లో అందించగల శక్తివంతమైన సాధనం ‘సోషల్‌ మీడియా’ అని చెప్పాలి. ఇదంతా నాణేనికి ఒక వైపు. కానీ వీటి గురించి విస్తృత చర్చలు మాత్రం జరగటం లేదు. నాణేనికి మరో వైపు వున్న అంశాలే ఎక్కువ చర్చలకి దారి తీస్తున్నాయి. సోషల్‌ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు వున్నాయో అన్ని ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.
నాణేనికి రెండో వైపు
సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టులతో అశ్లీలత, హింస, అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌, మోతాదుని మించి వుంటున్నాయి. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్‌ వాడకం, నేరాలు, స్త్రీల మీద ఆడపిల్లల మీద వేసే చౌకబారు జోకులు… వీటన్నింటినీ హీరోయిజంలా చూపించటం వల్ల చిన్నపిల్లలు, యువత వాటికి బాగా ఆకర్షితులు అవుతున్నారు. వాళ్ళకి దానిలో వాస్తవం ఏదో, ఫిక్షన్‌ ఏదో గుర్తించేంత వయసు గానీ, విజ్ఞత గానీ వుండటం లేదు. అవన్నీ వ్యసనాలనీ, నేర ప్రవృత్తిని ప్రేరేపించే అంశాలనే విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే హీరోయిజం అనుకుని వ్యసనాలకి బానిసలౌతున్నారు.
బలహీన పడుతున్న కుటుంబ వ్యవస్థ
కొన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపైన ఎటువంటి నిబంధనలు లేకపోవటంతో విచ్చలవిడి శృంగారానికి అవి పూర్తిగా ద్వారాలు తెరిచేశాయి. ఒకప్పుడు సినిమా చూడటం అంటే స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో కలిసి థియేటర్‌కి వెళ్ళి మాత్రమే చూడగలిగే వాళ్ళం. కానీ ఈ రోజు ఆ అవసరమే లేకపోతోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు, సమయంతో కూడా సంబంధం లేకుండా గాడ్జెట్స్‌లో చూడగలుగుతున్నారు. దానికోసమే వాళ్ళు తల్లిదండ్రుల నుంచి ప్రైవసీ కోరుకునేది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో… ఈ విషయంలో చిన్నపిల్లలు కూడా మినహాయింపు కాదు. ఈ కారణాల వల్ల కుటుంబ వ్యవస్థ బలహీన పడిపోతోంది. ఒకే ఇంట్లో అందరూ కలిసి వుంటున్నా కూడా వారి మధ్య డైరెక్ట్‌ కమ్యూనికేషన్‌, బాండింగ్‌ అనేది వుండటం లేదు.
హింసను పెంచేలా…
సోషల్‌ మీడియాలో హింస కూడా అధికస్థాయిలోనే వుంటున్నదని అనేక సర్వేలు వెల్లడి చేస్తున్నాయి. హాస్యం, థ్రిల్లర్‌, హరర్‌, రివేంజ్‌ అంటూ ప్రక్రియ స్వరూపం మారుతోంది కానీ హింస మాత్రం ఒకే స్థాయిలో వుంటోంది. ఈ మధ్య కాలంలో ‘ది అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పిడియాట్రిక్స్‌’ అనే సంస్థ జరిపిన సర్వే ప్రకారం చిన్నపిల్లలు చూసే కార్టూన్స్‌లో 60 నుంచి 70 శాతం పాపులర్‌ కార్టూన్స్‌. అన్నింటిలో హింస చాలా ఎక్కువగా వుంటోందన్న విషయం వెల్లడి అవుతోంది. చిన్నపిల్లలు వాటిని రిపీటెడ్‌గా చూడటం వల్ల వాటి చెడు ప్రభావం పిల్లల మెదడుపై, ప్రవర్తన పై తీవ్రస్థాయిలో వుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సూపర్‌ హిట్‌ సాధిస్తున్న సినిమాల్లో కూడా కథ, వినోదం అనేవి పూర్తిగా లోపిస్తున్నాయని, 70 నుంచి 80 శాతం దాకా నడిచే సన్నివేశాలన్నీ హింసతో కూడుకున్నవే అని విశ్లేషకులు చెపుతున్నారు. హింసని చూపించటంలో చిత్ర పరిశ్రమలో పోటీతత్వం పెరిగిపోతున్న విషయాన్ని ప్రేక్షకులు గమనిస్తూనే వున్నారు. ఇదంతా హీరోల ఇమేజ్‌ని పెంచటం కోసమే అన్న విషయం మనందరికీ తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజపు వేరుకి పట్టిన చీడలా తయారయింది మన చిత్ర పరిశ్రమ.
వాస్తవం నుంచి దూరంగా
సోషల్‌ మీడియాలో ఎక్కువశాతం ప్రేక్షకుల్ని ఆకర్షించేవి టిక్‌టాక్‌, రియాల్టీషోస్‌, గాసిప్స్‌ వంటివే. ఇవన్నీ ప్రేక్షకుల్ని వాస్తవం నుంచి దూరంగా తీసుకెళుతున్నాయి. దాన్నే చాలా మంది వినోదంగా భావిస్తున్నారు.
ఒకప్పుడు సినిమా అనేది సమాజానికి ఒక మెసేజ్‌ని అందించే శక్తివంతమైన సాధానంగా ఉపయోగపడింది. ఇప్పటికీ సినిమాలకి ఆ శక్తి వుంది. దాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఎలా ఉపయోగించాలి అన్న విషయం మాత్రం చిత్ర పరిశ్రమ చేతిలోనే వుంది. ప్రభుత్వం కూడా తన పరిధిలో వున్నంత వరకైనా సోషల్‌ మీడియాలో, సినిమాల్లో చూపిస్తున్న శృతిమించిన శృంగారం, హింస, మద్యపానం, ధూమపానం వంటి అసాంఘిక అంశాల మీద దృష్టి సారించి, నిరోధించాల్సిన అవసరం ఎంతో వుంది. ఈ అంశాల్ని ప్రభుత్వాలు తీవ్రమైనవిగా పరిగణించి సత్వరం చర్యలు తీసుకోవాలి. లేకపోతే సమాజంలో హింస మరింత విస్తృత రూపం దాల్చి, మరెందరో జీవితాల్ని బలి తీసుకోవటం మాత్రం కాదనలేని సత్యం.
యువతని ఆకర్షించే అంశాలు
– క్రీడలు, క్రీడలకి సంబంధిత సమాచారం
– సినిమాలు
– వీడియో గేమ్స్‌
– రియాలిటీ షోస్‌
– పాప్స్‌
– గాసిప్స్‌
– వివిధ భాషల్లో వస్తున్న సిరీస్‌
– టిక్‌టాక్‌
– గ్లోబల్‌ ఇష్యూస్‌
– ఎడ్యుకేషన్‌ రిలేటెడ్‌ ఇన్‌ఫర్మేషన్‌…
వీటన్నింటినీ యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
సమాజంపై సోషల్‌ మీడియా ప్రభావం
– సోషల్‌ మీడియా ఉపయోగించుకొని ప్రజల్ని మోసం చేసే నేరస్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
– యువత హీరోలని ఆదర్శంగా తీసుకుని మద్యపానం, ధూమపానం, డ్రగ్స్‌ వంటి వ్యసనాలకి బానిసలవుతున్నారు. తమ వ్యసనాలకి అవసరమయ్యే డబ్బు కోసం నేరస్తులుగా మారుతున్నారు. అంతేకాదు, వ్యసనాల కారణంగా విచక్షణ కూడా కోల్పోయి డబ్బు కోసం తల్లిదండ్రులనే హతమారుస్తున్న వార్తలు అనేకం వింటున్నాం.
– సోషల్‌ మీడియాలో చూపించే శృతిమించిన శృంగార చేష్టలకు ప్రభావితులై వయసుతో నిమిత్తం లేకుండా ఎనిమిదేండ్ల పిల్లాడి నుంచి ఎనభై ఏండ్ల ముసలి వాళ్ల వరకు రెచ్చిపోతున్నారు. పసికందులు, అమ్మాయిలు, స్త్రీలపైన లైంగికదాడులు చేసి వారిని హతమారుస్తున్న సంఘటనలు మన చుట్టూ కోకొల్లలుగా జరుగుతున్నాయి.
– సోషల్‌ మీడియాలో అయ్యే పరిచయాలు కూడా చాలా ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఆడపిల్లలు, మగ పిల్లలు కూడా ఆ పరిచయాల్ని దుర్వినియోగం చేసుకుంటు న్నారు. దాని వల్ల వాళ్ళు చిక్కుల్లో పడటమే కాకుండా ఒక్కో సారి జీవితాల్నే కోల్పో తున్నారు. ఈ మధ్యకాలంలోనే 30 ఏండ్ల జైలు శిక్ష పడిన ఒక యూట్యూబర్‌ యువకుడిని ఉదాహరణగా చెప్పవచ్చు. ఇలాంటి అనేక సంఘటనలు వార్తల్లో మనం చూస్తున్నవే.
– చిన్నపిల్లలు సైతం సోషల్‌ మీడియాకి ఎంతగా బానిసలు అవుతున్నారంటే తల్లిదండ్రులు స్క్రీన్‌టైం మీద పరిమితులు విధిస్తుంటే వారిని శత్రువుల్లా చూస్తున్నారు. అంతేకాదు, తల్లిదండ్రులు పిల్లల నుంచి రకరకాల బెదిరింపులని కూడా ఎదుర్కొవల్సి వస్తోంది.
– సోషల్‌ మీడియా వ్యసనంలో పడిపోతున్న పిల్లలు, యువత అన్ని విషయాల్లోనూ వెనుకబడిపోతున్నారు. దాని ఫలితంగా తీవ్రమైన ఒత్తిడికి గురౌతున్నారు. కొందరు తమ ప్రాణాల్ని కూడా బలి చేసుకుంటున్నారు.
ఈ కారణం వల్లే సోషల్‌ మీడియా అనగానే చాలా మందికి నెగిటివ్‌ థాట్స్‌ వస్తున్నాయి. సోషల్‌ మీడియా వల్ల కలిగే ప్రయోజనాల గురించి కన్నా, ప్రమాదాల గురించే విస్తృత చర్చలు జరగటానికి కారణాలు ఇవే.
పరిష్కారం ఏంటి?
– సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి యూట్యూబర్‌ కొన్ని నైతిక విలువల్ని పాటించాలి. తమ క్రియేటివిటీ ద్వారా ప్రేక్షకులకి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాలి. వాటి వల్ల సమాజానికి కొంతైనా ప్రయోజనం వుండేలా చూడాలి.
– సోషల్‌ మీడియా వ్యూవర్స్‌ కూడా అశ్లీలతని, హింసని ప్రోత్సహిస్తూ లైక్స్‌ కొట్టడం, కామెంట్స్‌ పెట్టటం చేయకూడదు. సాధ్యమైనంత వరకు వాటిని ఖండించాలి.
– పిల్లలు, యువత కంటెంట్‌లోని వాస్తవానికి, ఫాంటసీకి తేడా తెలుసుకోవాలి.
– చిత్ర పరిశ్రమ కూడా సినిమాలు తీసేప్పుడు తమ సామాజిక బాధ్యతని మరచిపోకూడదు. సినిమా ముఖ్య వుద్దేశం ప్రేక్షకులకి వినోదం, విజ్ఞానం అందించటం. అది ఎంతవరకు చేయగలుగుతున్నారో ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రేక్షకుల్లో అన్ని వర్గాల వారు వుంటారు. సినిమాల్లో హింసని చిత్రీకరిస్తున్నప్పుడు అది ఏ వర్గం వారిని దృష్టిలో వుంచుకుని చిత్రిస్తున్నారో, సమాజంపైన దాని ప్రభావం ఎంత తీవ్రంగా వుంటుందో పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకోవాలి. హీరోలు ధూమపానం, మద్యపానం చేయటాన్ని ఒక ఆకర్షణగా చూపిం చాల్సిన అవసరం ఎందుకు వస్తోంది అన్న ప్రశ్న ప్రతి సామాన్య ప్రేక్షకుడి మనసులో మెదులుతూనే వుంది.
ముగింపుగా ఒక్క మాట…
మంచు గడ్డల మధ్య పిల్లల్ని, యువతని కూర్చోపెట్టి వణకొద్దు అనటం ఎంత అవివేకమో, సోషల్‌ మీడియా అంతా చెడుతో నింపేసి దాన్ని చూడద్దు, ప్రభావితం కావద్దు అనటం కూడా అంతే అవివేకం. పేరెంట్స్‌ మానిటరింగ్‌ అనేది జస్ట్‌ రగ్గు కప్పటం లాంటిది. కానీ అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అందుకే మూలాలని తొలగించాలి. అప్పుడే సమస్య పరిష్కారం దొరికేది.
సోషల్‌ మీడియా వల్ల కలుగుతున్న అతి ముఖ్యమైన ప్రయోజనం దేశ రాజకీయాల వెనుక ఉండే కొన్ని వాస్తవాల్ని ఇటు ప్రింట్‌ మీడియా, అటు శాటిలైట్‌ చానల్స్‌ బయటపెట్టక పోయినా యూట్యూబ్‌ జర్నలిస్ట్‌ లు ఆ విషయాలన్నింటినీ ఏంతో నిర్భయంగా ప్రజల దష్టికి తీసుకువస్తున్నారు.
గోపాలుని అమ్మాజీ 7989695883
హ్యుమన్‌ సైకాలజిస్ట్‌