మెరిసిన మయాంక్‌, తిలక్‌

– సౌత్‌ జోన్‌ 195 ఆలౌట్‌
– దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్‌
బెంగళూర్‌ : భారత సీనియర్‌ జట్టుకు ఎంపికైన ఉత్సాహంలో ఉన్న హైదరాబాదీ కుర్రాడు తిలక్‌ వర్మ.. దులీప్‌ ట్రోఫీలో కదం తొక్కాడు. బుధవారం ప్రకటించిన భారత టీ20 జట్టులో తిలక్‌ వర్మ చోటు సాధించాడు. మిడిల్‌ లోయర్‌ ఆర్డర్‌లో ఫినీషర్‌ స్థానం కోసం రింకూ సింగ్‌తో గట్టి పోటీ చవిచూసిన తిలక్‌ వర్మ.. తొలిసారి జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. ఇక బెంగళూర్‌లో నార్త్‌జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ (46, 101 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. మయాంక్‌ అగర్వాల్‌ (76, 115 బంతుల్లో 10 ఫోర్లు) అర్థ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్‌ హనుమ విహారి (0) సున్నా పరుగులకే నిష్క్రమించాడు. మయాంక్‌ అగర్వాల్‌, తిలక్‌ వర్మ రాణించటంతో సౌత్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది. నార్త్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కించుకుంది. నార్త్‌ జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 51/2తో ఆడుతుంది. ప్రస్తుతం నార్త్‌ జోన్‌ 54 పరుగుల ముందంజలో నిలిచింది. మరో సెమీఫైనల్లో సెంట్రల్‌ జోన్‌ 128 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 149/3తో ఆడుతోంది. వెస్ట్‌ జోన్‌ 241 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది.