పోతంగల్ లో రెండు ఆవుల సజీవ దహనం..

– షార్ట్ సర్క్యూట్ తో పశువుల కొట్టం దగ్ధం..
– ఆరు ఆవులకు గాయాలు 
నవతెలంగాణ – నవీపేట్: మండలంలోని పోతంగల్ గ్రామంలో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా పశువుల కొట్టం దగ్ధమవడంతో రెండు ఆవులు సజీవ దహనం కాగా ఆరు ఆవులకు మంటలు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు చిలుక సాయిబాబా గత కొన్ని రోజుల క్రితం ఆవులను కొనుగోలు చేసి పెంచుతున్నాడు. ప్రమాదవశాత్తు శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా పశువుల కొట్టానికి నిప్పంటింది. స్థానికులు ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయగా వచ్చేసరికి పశువుల కొట్టంతో పాటు అందులో ఉన్న రెండు ఆవులు సజీవ దహనమయ్యాయి. కొట్టం బయట కట్టిన ఆరు ఆవులకు మంటలు తగలడంతో తీవ్రగాయాల పాలయ్యాయి. సుమారు మూడు నుండి నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు సాయిబాబా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రభుత్వం స్పందించి నష్టపరిహారాన్ని అందించాలని కోరుతున్నాడు.