నాపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం

False campaign against me on social media– బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై నో కామెంట్‌
– పేదల ఇండ్లను కూలిస్తే ఊరుకోబోం.. కొట్లాటకు సిద్ధం : ఎంపీ ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ పార్టీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నవారే తనపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అంశంపై తాను ఎలాంటి కామెంట్‌ చేయబోనని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పేదల ఇండ్లను కూలుస్తుంటే చూస్తూ ఊరుకోబోమనీ, కొట్లాటాకు తాము కూడా సిద్ధమేనని ప్రకటించారు. అత్యంత అవినీతి, అసమర్ధ, మంత్రుల మధ్య సమన్వయం లేని ప్రభుత్వం రేవంత్‌రెడ్డి సర్కారేనని విమర్శించారు. ప్రతి బిల్లు చెల్లింపులోనూ 7 నుంచి 10 శాతం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని రోజులు హైడ్రా పేరిట, మరికొన్ని రోజులు మూసీ పేరిట పేదల ఇండ్లను కూల్చిందని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద, అతిపురాతనమైన స్లమ్‌ బాలాజీనగర్‌, జవహర్‌నగర్‌ ప్రాంతమనీ, ఆ ప్రాంతంలో రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా వలస వచ్చిన ఎంతోమంది కూలీలు, పేదలు నివసిస్తున్నారని తెలిపారు.
ప్రజలు కబ్జా చేసుకుని ఇండ్లు కట్టుకోలేదనీ, డబ్బులు పెట్టి కొని కట్టుకున్నారని చెప్పారు. బ్రిటీష్‌ కాలంలో ఈ భూమిని సైనికులకు కేటాయించారన్నారు. ఆ భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదనీ, కేర్‌ టేకింగ్‌ మాత్రమే చేపట్టాలని 1951లోనే స్పష్టంచేశారని తెలిపారు. సైనికులు కొందరు ఆ భూమిని అమ్ముకుంటే వారి నుంచి పేదలు కొనుక్కున్నారని చెప్పారు. గతంలోనూ కాంగ్రెస్‌ మంత్రి కమఠం రాంరెడ్డి ఆ ప్రాంతంలో ఇండ్లను కూల్చాలని మిషన్లను పంపారనీ, ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూల్చివేతలు చేయిస్తున్నారని విమర్శించారు. బాలాజీ నగర్‌లో పేదల ఇండ్లను కబ్జా చేసేవాళ్లు,అమ్మకాలు, కొనుగోలు చేసే బ్రోకర్లు ఎక్కువైపోయారనీ, రెవెన్యూ అధికారుల ఆగడాలు శృతిమించిపోతున్నాయని ఆరోపించారు. రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లిస్తే తప్ప రేకుల షెడ్లు వేసుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. డబ్బులివ్వకపోతే ఇండ్లను కూల్చివేయిస్తున్నారని ఆరోపించారు. మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన సీఎం రేవంత్‌ కు ఈ ప్రాంత ప్రజల బాధలు తెలియవా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం విచారణకు సహకరిస్తారా? అన్న అంశంపై ఈటల స్పందిస్తూ..మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాళ్లు, అవగాహన లేనివాళ్లు, ప్రభుత్వ పనివిధానం తెలియనివాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారనీ, అన్ని డిపార్ట్‌ మెంట్లు బిల్లులు చేసి పంపిస్తే డబ్బులు రిలీజ్‌ చేసిది ఆర్థికశాఖ అని తెలిపారు. బిల్లులు రిలీజ్‌ అవ్వాలంటే 7 నుంచి 10 శాతం కమీషన్‌ లేనిదే రిలీజ్‌ చేయడం లేదని విమర్శించారు.