గ్రాంసీని అధ్యయనం చేద్దాం

Let's study Grancyమార్క్సిస్టు మహోపాధ్యాయుల్లో మార్క్స్‌, లెనిన్‌, మావోల సరసన చేర్చదగిన సిద్ధాంతవేత్త, ఆచరణవాది ఇటలీ కమ్యూనిస్టు పార్టీ నిర్మాత గ్రాంసీ. మార్క్స్‌, ఎంగెల్స్‌, రచనల తర్వాత ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాంసీ రచనల మీద విస్తారమైన చర్చ జరుగుతుంది. మేధావుల అనేకులు పరిశోధనలు చేసి ఆసక్తికర మైన పలు అంశాలు వెల్లడిస్తున్నారు. గ్రాంసీ రచనలన్నీ మార్క్సిజాన్ని సుసంపన్నం చేసేవే. మార్క్స్‌-ఎంగెల్స్‌ రచనలను పునాది చేసుకున్న గ్రాంసీ ఆలోచనలు సమకాలీన ప్రపంచంలో విప్లవాలనెలా ముందుకు తీసుకపోవాలో దారి చూపుతాయి. గ్రాంసీని అధ్యయనం చేయకుండా మార్క్సిజాన్ని అన్ని కోణాల్లో అర్థం చేసుకోలేమంటే అతిశయోక్తి కాదేమో.
పెట్టుబడిదారీ వ్యవస్థ ఇరవయ్యవ శతాబ్దంలోకి ప్రవేశించేనాటికి మార్క్స్‌కాలం కంటే ఎన్నో వైవిధ్యాలు, నైపుణ్యాలు, సామర్ధ్యాలు పెంపొందించుకుంది. సమాజంలోని కొత్తగా ఆవిర్భవించిన వర్గాలు, తరగతులతో ఎలా వ్యవహరించాలో, ఎవరిని ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలనే అంశాల్లో పలురకాల అనుభవాలు నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించుకుంది. పాలకవర్గాలు తమ దోపిడీని, ఆధిపత్యాన్ని కొనసాగించడానికి రాజ్యాంగ యంత్రాన్ని క్రూర అణచివేత సాధనంగా ఉపయోగించుకునేది. మారిన పరిస్థితుల్లో రాజ్యాంగ యంత్రం క్రూర అణచివేత సాధనం పైననే ఆధారపడకుండా నాజూకుతనంతో కూడిన లాలన, పాలన జత చేసుకుంది. సంక్షేమ పథకాలు, పౌరహక్కులు అత్యధిక ప్రజలంతా భాగస్తులయ్యే కులం, మతం, దేవుడు, దెయ్యం, మూఢనమ్మకాలు, సనా తనం తదితరాలను వాడుకుంటుంది. 21వ శతాబ్దపు పెట్టుబడిదారీ వ్యవస్థ, రాజ్యాంగ యంత్రం, పౌరసమాజాలు, సంస్కతి భావజాల రంగంలో వస్తున్న మార్పులు, వ్యవస్థలో సంభవిస్తున్న అనేక వైవిధ్యాలు బహురూపత్వాన్ని అర్థం చేసుకోవాలంటే గ్రాంసీని అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి.
గ్రాంసీ పూర్తి పేరు ఆంటోనియో గ్రాంసీ. ఆయన 1891 జనవరి 22న దక్షిణ ఇటలీలోని సార్డిని యాలోని ”ఆలెస్‌”లో జన్మించారు. వారిది చాలా పేద కుటుంబం. పేద పిల్లలకిచ్చే స్కాలర్‌షిప్‌ పొంది యూనివర్సిటీ చదువులు పూర్తిచేశాడు. 1931లో ఇటలీ సోషలిస్టు పార్టీలో చేరాడు. 1922లో సోషలిస్టు పార్టీ నుండి బయటికి వచ్చి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. ఆ పార్టీ నాయకత్వ బృందంలో ప్రముఖుడిగా గుర్తింపు పొందాడు.1922 ఇటలీ కమ్యూనిస్టు పార్టీ తరపున ప్రతినిధిగా మాస్కోలో జరిగిన కమ్యూనిస్టు ఇంటర్‌నేషనల్‌కు హాజరయ్యాడు. 1923లో కొమింటర్న్‌ ఆదేశాల మేరకు ఆస్ట్రియా రాజధాని వియన్నా వెళ్లాడు. అక్కడి నుండి ఇటలీ యూరప్‌ దేశాల కమ్యూనిస్టు పార్టీల సమన్వయం బాధ్యతలు నిర్వహించాడు.1924లో ఇటలీ పార్లమెంటుకు ఎన్నికయ్యాడు.ఇటలీ కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శి అయ్యాడు. 1926 నవంబర్‌లో పాసిస్టు పార్టీ తరపున ప్రధానిగా ఉన్న ముస్సోలిని గ్రాంసీని అరెస్టు చేయించారు. జైలులో గ్రాంసీని అనేక విధాలుగా వేధించారు. గ్రాంసీ పూర్తిగా అనారోగ్యానికి గురయ్యాడు. అయినా పట్టుదల వీడక జైలులో వుండే ఓపికతో అనేక రచనలు చేశాడు. ప్రిజన్‌లో వుండి రాసిన నోట్స్‌ కాబట్టి ఆ రచనలకు ప్రిజన్‌ నోట్స్‌ అని చరిత్రలో చోటుదక్కింది. ఆ ప్రిజన్‌ నోట్స్‌ చారిత్రత్మకమైనవి కావడానికి కారణం సమకాలిన సమాజంలో ఎదురవుతున్న అనేక సమస్యలకి పరిష్కారం చూపెేలా వుండటమే.
గ్రాంసీపై ముస్సోలినికి అంత కోపమెందుకు?
గ్రాంసీ ఇటలీలో కార్మిక ఉద్యమాలు నిర్మించాడు. ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలేస్తున్నాడు. ఫాసిస్టు ముస్సోలినికి ప్రధాన ప్రత్యర్థిగా ఎదుగుతున్నాడని అక్రమ కేసులు, హత్యాయత్నం లాంటి కేసులు సైతం బనాయించి జైల్లో పెట్టారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ముస్సోలిని పార్టీ అత్యధిక సీట్లు సంపాదించి పాలన చేయడం ఏమిటి? తాను, తన కమ్యూనిస్టు పార్టీ నిత్యం శ్రామిక వర్గాలు అభ్యున్నతికై కషిచేస్తుంటే ప్రజలు తమ పార్టీని ఓడించడానికి కారణాలు ఏమిటని గ్రాంసీ శోధించడం ప్రారంభించాడు. వాటి లోతుల్లోకి వెళ్లాడు. దేశభక్తి అని, జాతీయత అని, సంస్కతి అని, ఆర్థికేతర అంశాల ద్వారా కూడా ప్రజలు ముస్సోలిని వెంట వెళ్లడానికి కారణాలు వెతికాడు. వేతనాలని ఉపాధి అని, ఆవాసమని, విద్యని, వైద్యమని, ప్రజల దైనందిన అవసరాల గురించి నిరం తరం పోరాడే కమ్యూనిస్టులకు ప్రజలు మద్దతు ఎందుకు లేదని తర్కించుకోసాగాడు. తర్జన భర్జన తర్వాత కొన్ని అభిప్రాయాలకొచ్చాడు. ఎప్పటికప్పుడు తనకందుబాటులో ఉన్న నోట్‌బుక్స్‌లోకి తన దష్టికి వచ్చిన అంశాలన్ని ఎక్కించాడు. అవన్ని వరుస క్రమంలో లేకున్నా, ఒక పుస్తక రూపంలో రాకున్నా వాటి సారాంశం ప్రపంచానికి తెలియవచ్చింది. అవే ప్రిజన్‌ నోట్స్‌గా ప్రసిద్ధికెక్కాయి. ఆయన ఆ రచనలు 1926-37 మధ్యకాలంలో ఇటలీ భాషలో చేసినా, వెలుగు చూసింది మాత్రం 1945, ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతనే, ఆంగ్లంలో తర్జుమా అయింది మాత్రం 1970 దశకంలోనే. వాటిని అధ్యయనం చేసి, అర్థం చేసుకున్నవారు చాలా పరిమితం. గ్రాంసీ ఆలోచనలకు పునాది మార్క్సిజమే. ప్రపంచమంతా గ్రాంసీ రచనల మీద చర్చోపచర్చలు జరుగుతున్నా, మన దేశంలో గ్రాంసీ పేరు పెద్దగా ప్రచారంలో లేదు. ఉన్నా అది మేధోపరమైన చర్చకే పరిమితమవుతున్నది. గ్రాంసీ రచనలు మార్క్సిజానికి కొనసాగింపే. మార్క్సిస్టు భావజాల పరిధిని గ్రాంసీ విస్తరింపజేశాడు. మార్క్స్‌-ఎంగెల్స్‌ రచనలను పునాది చేసుకుని గ్రాంసీ మార్క్సిజాన్ని అనేక కొత్త కోణాలు ఆవిష్కరించి ”ప్రిజన్‌ నోట్స్‌” ద్వారా కొత్త చూపునిచ్చాడు.
ఆర్థిక వాదాన్ని ఖండించిన గ్రాంసీ
మార్క్స్‌, ఎంగెల్స్‌ కాలంలోనే, వారి రచనల్లోని పునాది, ఉపరితలం విశ్లేషణల మీద అనేక వక్రీకరణలు జరిగాయి. ఆర్థికం పునాది కాబట్టి ఆర్థికరంగంలో వర్గపోరాటం చేస్తే ఉపరితల అంశాలన్ని ఆటోమెటిక్‌గా పరిష్కారమవుతాయని మార్క్స్‌ చెప్పినట్లు కొందరు ప్రచారం చేసేవారు. మార్క్సిజాన్ని కేవలం ఆర్థిక నియతి వాదంగా కుదించి ఇదే మార్క్సిజం అని ప్రచారం చేసే వారిని స్వయంగా మార్క్స్‌ ఖండించాడు. ఆ కుహానా మార్క్సిస్టులను ఎద్దేవా చేస్తూ, ”మీరే నిజమైన మార్క్సిస్టులైతే నేను మార్క్సిస్టును కాను” అని ప్రకటించుకోవాల్సి వచ్చింది. మార్క్స్‌ చనిపోయిన తర్వాత 1890లో ఎంగెల్స్‌ జె.బ్లోకి ఒకలేఖ రాశాడు. అందులో ఆర్థిక వాదానికి పరిమితం చేసి తమ సిద్ధాంతాలను కుదించడాన్ని తీవ్రంగా ఖండించాడు. ”యువకులు ఒక్కొక్కసారి ఆర్థిక పార్శ్వానికే యోగ్యమైన దానికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే, ఈదోషంలో స్వయంగా మార్క్స్‌కు, మార్క్స్‌తోపాటు నాకు కూడా పాక్షికంగా కొంత బాధ్యత ఉంది. ఆర్థిక అంశాన్ని అసలే తిరస్కరించిన మా ప్రత్యర్ధులకు వ్యతిరేకంగా, ఆ ప్రధాన సూత్రాన్ని మేము నొక్కి చెప్పాల్సి వచ్చింది. ఇతర అంశాలకు సముచితమైన స్థానాన్ని ఇచ్చే వ్యవధి కాని, స్థలంగాని, అవకాశం గాని మాకు అప్పుడు లభ్యం కాలేదు” అని రాశాడు. ఎంగెల్స్‌ రాసిన దాన్ని దష్టిలో పెట్టుకొని, తన స్వానుభావాన్ని జోడించి మార్క్సిజాన్ని 21వ శతాబ్దపు పరిస్థితులకు వర్తింప చేస్తూ రచనలు చేశాడు. 20వ శతాబ్దపు పరిస్థితులకు 21వ శతాబ్దపు పరిస్థితుల్లో వచ్చిన మార్పులు గ్రాంసీ పరిగణలోకి తీసుకున్నాడు.రాజ్యసాధనకు హింసాయుత సాయుధ పోరాటం స్థానే, ప్రజల సమ్మతితో పార్లమెంటును ఉపయోగించే అవకాశాన్ని పరిగణలోకి తీసుకున్నాడు. వర్గ పోరాటమంటే కేవలం ఆర్థిక రంగంలో జరిగే పోరాటమే కాదు. ఆర్థికంతోపాటు రాజకీయ, సామాజిక, సాంస్కతిక, భావజాల రంగాల్లో జరగాల్సిన వర్గ పోరాటాల ప్రాధాన్యతను గుర్తింప చేశాడు. ఆర్థిక రంగంలో జరిగే పోరాటాలు దండలో దారం లాంటివి. ఆర్థికం సాధారణమైనా, అది ఒక్కటే విప్లవాన్ని ముందుకు తీసుకు పోలేదంటాడు. ఏ విప్లవానికైనా సంస్కరణలకైనా, ఉద్యమానికైనా సాంస్కతిక రంగం పౖౖెలెట్‌ లాంటిదన్నాడు. పాలకవర్గాల సంస్కతే ప్రజాసంస్కతిగా, ధర్మంగా చలామణి కావడం సహజం. పెట్టుబడిదారి సమాజంలోని దోపిడీ సంస్కతికి ”ప్రజల సమ్మతి” లేదా ”పౌరసమ్మతి” ఉంది. బూర్జువా వర్గం తనకు జాతీయ ప్రజాసమ్మతి సష్టించి పెట్టగల సైద్ధాంతిక పునాది శతాబ్ధాల నాడే పురుడు పోసుకుంది. నిజానికి అదే దాని ప్రధాన బలంగా వుంది. పాలకులు తమ పాలన కొనసాగించడంలో, ఎన్నికల్లో సహితం గెలవడంలో ఈ పౌరసమ్మతి ఉంటుందని భావించాలి. ప్రజలు తమ బాధలకు కష్టాలకు కర్మ ఫలితమేనని, దేవుడి అనుజ్ఞలేదని, సరిపెట్టుకోవడమే ”ప్రజల సమ్మతి”/ ”పౌరసమ్మతి”. ఈ అవగావన శతాబ్దాల తరబడి కొనసాగుతుంది. నరనరాన ఈ సంస్కతి జీర్ణించుకొని పౌరసమ్మతిగా మారింది. దోపిడీ పాలకులు కేవలం బల ప్రయోగంతోనే తమ దోపిడీ కొనసాగిస్తున్నారనుకోవడం ఎంత పొరపాటో గ్రాంసీ తన రచనల ద్వారా విశదపర్చాడు. గ్రాంసీ దష్టిలో ఫాసిజం రూపంలో కొనసాగే పెట్టుబడిదారి రాజ్యాన్ని కేవలం సాయుధ తిరుగుబాటుతో కూల్చడం అసాధ్యమైన పని అంటాడు. ఎందుకంటే దోపిడీ పాలకులు పౌర సమాజాన్ని వివిధ సంస్థల ద్వారా మభ్యపెట్టి, మాయచేసి మెజార్టీ ప్రజలను తమ ఆధీనంలో ఉంచుకోగలుగుతున్నారన్నాడు. దాని మూలంగా ఒకసారి తిరుగుబాటుతో శ్రామిక రాజ్యం స్థాపించడం సాధ్యమయ్యే పని కాదంటాడు. గ్రాంసీ ముందు దోపిడీ రాజ్యంపై పౌర సమాజానికున్న భ్రమలు తొలగించాలంటాడు. అది జరగాలంటే విద్య, సాంస్కతిక రంగాల్లో ఇంతకాలమున్న అధిపత్య భావజాలాన్ని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ ప్రతి వ్యూహాలను నిర్మించాలంటాడు. ఆర్థిక రంగంలో వర్గ పోరాటం, సాంస్కతిక రంగంలో వర్గ పోరాటం జమిలిగా జరగాలంటాడు. ఆర్థిక సాంస్కతిక రంగంలో జరిగే వర్గ పోరాటాలు ఏకకాలంలో ఒకదానికొకటి సహ కరించుకుంటూ ముందుకు సాగాలంటాడు.
నాటి ఇటలీ పాలకులు ”జాతీయవాదం”, ”అభివద్ధి” అనే పేరిట ప్రజల సమస్యలను పూర్వపక్షం చేశారు. అల్లరి మూకలను సష్టించి అభ్యుదయవాదులను, ప్రజాస్వామ్యవాదులను అణిచివేశారు. సనాతన దోపిడీ సంస్కతిని ఆసరా చేసుకొని పౌరసమాజాన్ని సైతం తమ వెంట తిప్పుకోగలిగారు. ఎన్నికల్లోనూ విజయాలు సాధించారు.నేటి భారతదేశంలో అటువంటి పరిస్థితులను అభివృద్ధి చేస్తున్నారు. జాతీయత అభివద్ధి నినాదాలతో పాటు మతం, దేవుడు, గుడులు, సనాతన ఆచారాలను తమ ఎజెండాలో చేర్చుకొని పాలక బీజేపీ, సంఫ్‌ు పరివార్‌ శక్తులు, అనేక సంఘ వ్యతిరేక శక్తులను, అరాచకవాదులను రెచ్చగొట్టి భావజాల రంగంతోపాటు బలప్రయోగం తోడు చేసుకుంటున్నది. తమ లక్ష్యమైన మనువాద రాజ్యస్థాపనలో తాము శత్రువులుగా ప్రకటించుకున్న అన్ని రాజకీయ, సామాజిక సమూహాల మీద దాడి చేస్తున్నది. ఆ దాడుల్ని సమర్ధించుకోవడానికి చరిత్రను సైతం వక్రీకరిస్తున్నది. ఇవన్నీ సజావుగా జరగాలని ప్రశ్నించే మేధావులపై సంఫ్‌ుపరివార్‌ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నది. భయోత్పతాన్ని సష్టిస్తున్నది.
భావజాల రంగంలో సంస్కతి, జీవన విధానం పేరిట ప్రజల మెదళ్లను ఆక్రమించిన మనువాద, అగ్రకుల సంపన్న వర్గాల భావజాలాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చాల్సిన అవసరం వుంది. ప్రస్తుత పాలక ఫాసిస్టు పార్టీ అయిన బీజేపీకి ఎన్నికల్లో సీట్లు తగ్గవచ్చు. కానీ సంస్కతి ముసుగులో అనేక సంస్థలు, వ్యక్తులు తిరిగి ఆ ఫాసిస్టు శక్తుల పునరావిర్భావానికి కషిచేస్తూనే ఉంటాయి. వీరికి రెండు వేల ఏండ్లకు పైగా పోగుబడ్డ విషసంస్కృతి గుట్టలుగుట్టలుగా పడివుంది. అది తిరిగి ఎప్పుడైనా విజృభించవచ్చు. ఫాసిజం ప్రమాదాన్ని ఓడించడానికి దీనికోసం దీర్ఘకాలిక మహత్తర సాంస్కతిక పోరాటం జరగాల్సి ఉంది.
(నేడు గ్రాంసీ 134వ జయంతి)
జి. రాములు
9490098006