గాజాలో కాల్పుల విరమణ, పశ్చిమగట్టులో దాడులు!

Cease fire in Gaza Attacks in the West Bank!గాజాపై ఇజ్రాయిల్‌ జరిపిన పదిహేను నెలల మారణకాండ తర్వాత జరిగిన ఒప్పందంతో ప్రస్తుతానికి అది ఆగిపోయింది. దీంతో అటు పాలస్తీనియన్లు, ఇటు ఇజ్రాయిలీలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉపశమనం ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కాపురం చేసే కళ కాళ్ల గోళ్ల దగ్గరే తెలుస్తుందంటారు.ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత గాజాలో రాఫా ప్రాంతంలో ఒక బాలుడితో సహా ముగ్గుర్ని ఇజ్రాయిలీ దళాలు కాల్చిచంపాయి. పాలస్తీనాలోని మరో ప్రాంతమైన పశ్చిమ గట్టు జెరూసలెం నగర పరిసరాల్లోని గ్రామాల్లో దురాక్రమణదారులుగా ఉన్న ఇజ్రాయిలీలు తమ మిలిటరీ కనుసన్నల్లో పాలస్తీనియన్ల మీద దాడులకు తెగబడ్డారు. మారణకాండతో పోలిస్తే చూసేవారికి ఇవి చిన్న ఉదంతాలుగానే కనిపించవచ్చు గానీ చిత్తశుద్ది లేదనేందుకు నిదర్శనం. అందుకే కాల్పుల విరమణ ఒప్పందంతో ఎవరూ పండుగ చేసుకోవటం లేదు. పాలస్తీనియన్లకు రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి యూదు మూకల దాడుల్లో ప్రాణాలు అర్పించటం లేదా మాతృభూమి కోసం తెగబడి ప్రతిఘటించటం. ఏడు దశాబ్దాలుగా జరుగుతున్నదిదే. అదే ఇజ్రాయిలీలను చూస్తే వారికి ప్రాణభయం లేకున్నా, ఎటువైపు ఎవరు దాడి చేస్తారో అన్నభయంతో బతుకులీడుస్తున్నారు. సైరన్ల మోతలు వినిపిస్తే చాలు సొరంగాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. గాజాలో 47వేల మందిని చంపివేశారు. వీరిలో 80శాతం మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ఒప్పందం మూడు దశల్లో అమలు జరుగుతుంది.హమాస్‌ వద్ద ఉన్న బందీలు, ఇజ్రాయిల్‌ వద్ద ఉన్న నిర్బంధితుల విడుదల తరువాత గాజా పరిస్థితి అజెండాలోకి రానుంది.రెండవ దశలో ఇజ్రాయిల్‌ సైన్యం పూర్తిగా గాజా నుంచి వైదొలగటం, నిరాశ్రయులైన వారిని స్వస్థలాలకు రప్పించటం, బందీలు-ఖైదీలను పూర్తిగా విడుదల చేయటం, మూడవ దశలో హమాస్‌ చేతుల్లో బందీలుగా ఉండి మరణించిన వారి మృతదేహాల అప్పగింత ఇతర అంశాలు ఉంటాయి. ఈ ఒప్పందం గురించి ఎవరికి ఉండే అనుమానాలు వారికి ఉన్నప్పటికీ అంగీకారం మేరకు ఆదివారం నుంచి అమలు ప్రారంభమైంది.
నిర్ణీత గడువులోగా హమాస్‌ విడుదల చేసే ముగ్గురు బందీల పేర్లు చెప్పలేదంటూ కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటికీ రెండు గంటల వ్యవధిలో ఇజ్రాయిల్‌ మిలిటరీ దాడులు జరిపి 19 మంది ప్రాణాలు తీసి 36 మందిని గాయపరిచిందంటేే ఏ చిన్నసాకు దొరికినా మాట తప్పేందుకు పూనుకుంటుందన్న అనుమానం తలెత్తింది. ఆదివారం నాడు బందీలలోని ముగ్గురు మహిళలను హమాస్‌ రెడ్‌క్రాస్‌ ప్రతినిధులకు అప్పగించింది. దానికి ప్రతిగా ఇజ్రాయిల్‌ తొంభైమంది పాలస్తీనియన్లను వదలిపెట్టింది. తదుపరి 25వ తేదీ(శుక్రవారం నాడు) మరో నలుగురు మహిళలను అప్పగించనుంది. ఒక్కో బందీకి 30 లేదా 50 మంది పాలస్తీనియన్లను విడుదల చేయవచ్చని వార్తలు వచ్చాయి. మొత్తం 33 మంది బందీలు, వెయ్యికిపైగా నిర్బంధితుల విడుదల ఆరువారాల ప్రక్రియ సాఫీగా ముగిసిన తరువాత రెండవ దశ అమల్లోకి వస్తుంది. ఎవరెన్ని భాష్యాలు చెప్పినప్పటికీ కొన్ని వాస్తవాలను ఎవరూ మూసిపెట్టలేరు. ఇజ్రాయిల్‌ డేగకన్ను కప్పి హమాస్‌ సాయుధులు గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయిల్‌ భూభాగంలో ప్రవేశించి 2023 అక్టోబరు ఏడు రాత్రి జరిపిన దాడుల్లో 1,139 మరణించారు, 200 మందిని బందీలుగా పట్టుకున్నారు. దానికి ప్రతీకారం పేరుతో ఇజ్రాయిల్‌ మిలిటరీ మరుక్షణం నుంచి 2025 జనవరి 19వ తేదీ వరకు మారణకాండ జరుపుతూనే ఉంది. హమాస్‌ దాడులను ఎవరూ సమర్ధించలేదు, కానీ ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని మానవహక్కులు, మానవత్వం గురించి నిత్యం పారాయణం చేసే పశ్చిమ దేశాలు నిస్సిగ్గుగా సమర్ధించాయి, అమెరికా అయితే గాజాను ధ్వంసం చేసేందుకు సామూహికంగా జనాన్ని చంపేందుకు రెండువేల పౌండ్ల బరువుండే భారీ బాంబులను కూడా సరఫరా చేస్తామని చెప్పింది.
ప్రపంచంలో అత్యంత ఆధునిక నిఘా, ప్రత్యర్థులను మట్టుబెట్టే పరిజ్ఞానం ఇజ్రాయిల్‌ సొంతమని ఎంతోమంది చెబుతారు. అయితే గాజా, హమాస్‌ విషయంలో అది వాస్తవం కాదని పదిహేను నెలల పరిణామాలు రుజువు చేశాయి. హమాస్‌ వద్ద ఆధునిక ఆయుధాలు లేవన్నది బహిరంగ రహస్యం. వారికి ఉన్నది జనబలం, ఆదరణ మాత్రమే.ఎక్కడ ఉంటారో,ఎవరు సాయుధుడో, ఎవరు సాధారణ పౌరుడో గుర్తించలేనంతగా మమేకమయ్యారు. ప్రతి ఒక్కరూ పౌరుడే, అవసరమైపుడు సాయధుడే. వ్యూహం ఎప్పటికప్పుడు మార్చుకోగలిగిన నేర్పరితనాన్ని బతుకుపోరు నేర్పింది. అందుకే ఇజ్రాయిల్‌ మిలిటరీ సామూహిక మారణకాండ, విధ్వంసకాండకు పాల్పడింది. ఆసుపత్రులు, స్కూళ్ల భవనాలను నేలమట్టం గావించింది. సొరంగాల్లో ఉన్నారంటూ వాటిని ఉప్పునీటితో నింపింది. అమెరికా,బ్రిటన్‌, జర్మనీ వంటి దేశాలిచ్చిన ఆధునిక ఆయుధాలు హమాస్‌ ముందు పనికిరాకుండా పోయాయి. అణుబాంబు వేస్తే పీడాపోతుందని ఇజ్రాయిల్‌ మంత్రి ఎలియాహు అనేవాడు పదే పదే డిమాండ్‌ చేశాడంటే ప్రతిఘటన వారిని ఎంతగా కలవరపెట్టిందో అర్ధం చేసుకోవచ్చు. అదిగో హమాస్‌ను మట్టుపెడతాం ఇదిగో అంటూ కబుర్లు చెప్పారు. బేషరతుగా లొంగిపోతేనే దాడులను విరమిస్తామన్నారు, ఏదీ జరగలేదు. ‘బలవంతుడైన సర్పము చలి చీమల చేత చిక్కి చచ్చిన’ పరిస్థితి వచ్చింది. వివరాలు రాకుండా మూసిపెట్టారు గానీ ఇజ్రాయిల్‌ ఉనికిలోకి వచ్చిన 1948 తరువాత అరబ్బులతో జరిపిన యుద్ధాల్లో దేనిలోనూ చవిచూడని నష్టాలను పదిహేను నెలల గాజా ఊచకోతలో సంభవించినట్లు చెబుతున్నారు. ఒక వైపు హమాస్‌, దానికి మద్దతుగా లెబనాన్‌లో హిజబుల్లా, ఎమెన్‌లో అన్సర్‌ అల్లా సాయుధులు జరిపిన దాడులు ఇజ్రాయిల్‌ మిలిటరీని ఉక్కిరిబిక్కిరి చేశాయి, ఆర్థికంగా ఎంతో నష్టపరిచాయి. అందుకే చివరకు కతార్‌ మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించక తప్పలేదు. అనేక ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ హమాస్‌ రానున్నరోజుల్లో మరింతగా బలపడుతుందని విశ్లేషిస్తున్నారు. నిజానికి ఇప్పుడు కుదిరిన ఒప్పందంలోని అంశాలను గతేడాది మే నెలలోనే ప్రతి పాదించినపుడు హమాస్‌ అంగీకరించినా ఇజ్రాయిల్‌ ముందుకు రాలేదు. అమెరికా కూడా ఒత్తిడి చేసినట్లు నాటకమాడింది తప్ప చేసిందేమీ లేదు. మొత్తంగా చూసినపుడు ఇజ్రాయిల్‌ లొంగుబాటునే ప్రపంచం ఎక్కువగా చూస్తున్నది. తమ మిలిటరీ నాయకత్వం గురించి ఎన్నో భ్రమలు పెట్టుకున్న సాధారణ ఇజ్రాయిలీ పౌరుల్లో తాజా పరిణామాలను చూసిన తరువాత కలచెదిరిందని వేరే చెప్పనవసరం లేదు.
ఒప్పందం గురించి జోబైడెన్‌ మాట్లాడుతూ తాను గతేడాది ప్రతిపాదించిన అంశాలను ఆనాడు భద్రతా మండలి కూడా ఆమోదించిందని, తాజా ఒప్పందం కూడా అదే మాదిరి ఉందని పేర్కొన్నాడు. కానీ ఇదే పెద్ద మనిషి ఐదుసార్లు అదే భద్రతా మండలిలో కాల్పుల విరణమణ ప్రతిపాదనలపై ఒకటి కాదు ఐదుసార్లు వీటో ప్రయోగించిన అంశం దాస్తే దాగేది కాదు. తన కారణంగానే ఒప్పందం జరిగిందని చెప్పుకుంటున్నాడు. అయితే డోనాల్డ్‌ ట్రంప్‌ ఆ ఖ్యాతి పూర్తిగా తనదే అన్నాడు. తాను విజయం సాధించిన తరువాతే ఈ పరిణామాలు జరిగినందున తన ప్రభావమే పని చేసిందని చెప్పుకుంటున్నాడు. ఏడాది పాటు బైడెన్‌ చేయలేని దాన్ని ఒక్క భేటీతో తమ ప్రతినిధి సాధించినట్లు అతగాడి శిబిరం వర్ణించింది. దీన్లో ఎవరి వాటా ఎంత అన్నది పక్కన పెడితే గుణపాఠాలు ఏం తీసుకుంటారన్నది ప్రశ్న.
గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరటాన్ని ఇజ్రాయిల్‌ కమ్యూనిస్టుపార్టీ స్వాగతించింది. ప్రారంభం నుంచి ఖైదీలు, అపహరణకు గురైనవారు, నిర్బంధితులు, బందీలు ప్రతి ఒక్కరినీ వదలిపెట్టే విధంగా ఒప్పందం కుదరాలని తాము కోరుకున్నట్లు తెలిపింది. అలాంటి ఒప్పందంతో వేలాది మంది పాలస్తీనియన్ల, వందలాది మంది ఇజ్రాయిలీల ప్రాణాలు నిలుస్తాయని పేర్కొన్నది.ఈ ఒప్పందంతోనే తాము సంతృప్తి చెందటం లేదని, ఆక్రమణ, దిగ్బంధనాలకు స్వస్తి పలుకుతూ పాలస్తీనియన్ల స్వయం పాలిత హక్కు, ఇజ్రాయిల్‌తో పాటు స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు దిశగా సంప్రదింపులు కొనసాగాలని కోరింది. తక్షణ లక్ష్యంగా గాజా ప్రాంత పునర్‌నిర్మాణం ఉండాలని, యావత్‌ ప్రపంచం ఆ బాధ్యత తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది.ఒప్పందంలో మిగిలిన వ్యవధిలో లేదా ఖైదీల మార్పిడి ముగిసిన తరువాత మారణకాండను ప్రారంభించ కుండా ఇజ్రాయిల్‌లోని మితవాద ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ఇజ్రాయిల్‌లోని పాలస్తీనియన్ల మీద దాడులను తీవ్రం గావించేందుకు, పశ్చిమగట్టు ప్రాంతాన్ని ఆక్రమించే అవకాశం ఉందని కమ్యూనిస్టులు హెచ్చరించారు. శాంతి తప్ప మిలిటరీతో సమస్య పరిష్కారం కాదని భయంకరమైన, దీర్ఘకాలం సాగిన పోరు మరోసారి రుజువు చేసిందని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది.
హమాస్‌తో ఒప్పందానికి అంగీకరించినందుకు పలుకుబడి కలిగిన మద్దతుదార్లను నెతన్యాహు కోల్పోయినప్పటికీ తక్షణమే పదవికి ఎలాంటి ముప్పు ఉండదని చెబుతున్నారు. ఏడాదిపాటు ఒప్పందాన్ని తిరస్కరించి ఇప్పుడు సాధించిందేమిటని ప్రత్యర్ధులు నిలదీస్తున్నారు.హమాస్‌కు నెతన్యాహు ప్రభుత్వం పూర్తిగా దాసోహమన్నదని ఇజ్రాయిల్‌ జాతీయ భద్రతా మంత్రి ఇత్మార్‌ బెన్‌ జివిర్‌ ధ్వజమెత్తాడు. అది లొంగుబాటు ఒప్పందమన్నాడు. ఏడాది పాటు ఈ ప్రతిపాదనలను తాను అడ్డుకున్నట్లు చెప్పాడు, దాన్ని అమలు చేస్తే తమ పార్టీ ప్రభుత్వం నుంచి వైదొలుగుతుందన్నాడు.
మొదటిదశ అమలు తరువాత గాజాపై యుద్ధాన్ని కొనసాగించకపోతే తాము కూడా ప్రభుత్వం నుంచి బయటకు వస్తామని మరో పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి స్మోట్‌ రిచ్‌ చెప్పాడు. వీరు వైదొలిగినప్పటికీ నెతన్యాహు ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తారు గనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. డోనాల్డ్‌ ట్రంప్‌ పాలస్తీనియన్ల వ్యతిరేకి, ఇజ్రాయిల్‌ అనుకూల వాదులను తన యంత్రాంగంలోకి తీసుకున్నాడు. అయినప్పటికీ తన పదవీ స్వీకారానికి ఒకరోజు ముందే కాల్పుల విరమణ అమల్లోకి రావాలని ఆదేశించినట్లు వార్తలు. ఇజ్రాయిల్‌ పాలకులు అమెరికా కనుసన్నల్లో పనిచేస్తారని వేరే చెప్పనవసరం లేదు. హమాస్‌ను లొంగదీసుకోవటం సాధ్యం కాదని నెతన్యాహుకంటే అమెరికన్లకే బాగా తెలుసు గనుక ట్రంప్‌కు ఇష్టం లేకున్నా అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. దీన్నిచూపి ప్రపంచానికి పెద్ద శాంతిదూతగా కనిపించవచ్చు. గాజాలో ఏమైనప్పటికీ పశ్చిమగట్టు ప్రాంతంలో ఆక్రమించుకున్న పాలస్తీనా ప్రాంతాలను స్వాధీనం చేసుకొనేందుకు ట్రంప్‌ మద్దతు పొందాలన్నది ఇజ్రాయిల్‌ ఎత్తుగడ. జెరూసలెంలో తమ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు గతంలో ట్రంప్‌ నిర్ణయించినపుడే అది తేటతెల్లమైంది. ఆమేరకు గతేడాది ఏర్పాటైంది. ఇప్పుడు ట్రంప్‌ ఏం చేస్తాడో తెలిసినప్పటికీ ఎలా చేస్తాడో చూడాల్సి ఉంది.
ఎం.కోటేశ్వరరావు