రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో వేణుమాధవ్, తహశీల్దార్ వీరగంటి మహేందర్, మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పాషా అన్నారు. బుధవారం మండలంలోని చిట్యాల, వడ్డెకొత్తపల్లి, గంట్లకుంట, ఉప్పెరగూడెం, బొత్తల తండా, రాజమాన్ సింగ్ తండా, రామోజీ తండాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ కోసం సర్వే చేపడుతుందన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. లిస్ట్ లో అర్హుల పేర్లు రాకున్నా, మళ్ళీ అప్లై చేసుకోవాలన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపచేస్తామని తెలిపారు. కాగా మండలంలోని చిట్యాల గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ప్రజలు జాబితాలో తమ పేర్లు లేవని, అనర్హులను ఎంపిక చేశారని అధికారులను నిలదీశారు. దీనిపై ఏఈ పాషా వారితో మాట్లాడి, అర్హులైన పేదలకు తప్పనిసరిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.