చలికాలంలో ఏ ఆహారమైనా వేడివేడిగా తింటే.. ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే చాలా ఇళ్లలో వేడివేడి అన్నంలో రసం తినడానికి ఆసక్తి చూపిస్తారు. రసంతో తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అందుకే.. దాదాపు అందరి ఇళ్లలో టమాటా, మిరియాల రసం చేస్తుంటారు. కానీ ఎప్పుడూ వీటితోనే తినాలంటే బోర్ అనిపిస్తుంది. ఈ సారి ఈ రసాలను ప్రయత్నించండి. చిన్నా పెద్దా లొట్టలేసుకొని మరీ తింటారు.
వెల్లుల్లి రసం
కావాల్సిన పదార్థాలు: జీలకర్ర – టీ స్పూను, మిరియాలు – టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 25, నూనె – ఒకటిన్నర టీ స్పూను, పచ్చిమిర్చి – మూడు, కరివేపాకు రెమ్మలు – రెండు, కొత్తిమీర తరుగు – కొద్దిగా, టమాటా – ఒకటి, చింతపండు – నిమ్మగాయ సైజంతా, పసుపు – అర టీ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – సరిపడా. తాలింపు కోసం: నూనె – టేబుల్ స్పూను, ఆవాలు – టీ స్పూను, జీలకర్ర – అర టీ స్పూను, ఎండుమిర్చి – నాలుగు, కరివేపాకు – రెండు రెబ్బలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు – నాలుగు, ఇంగువ – చిటికెడు
తయారీ విధానం: ముందుగా చింతపండు నీటిలో 10 నిమిషాలు నానబెట్టి రసం సిద్ధం చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి పక్కన ఉంచాలి. టమాటా, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, మిరియాలను రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి. తర్వాత అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి కచ్చాపచ్చగా దంచి ఓ గిన్నెలోకి తీసుకోండి. రసం చేయడం కోసం స్టవ్ గిన్నె పెట్టండి. ఇందులో నూనె పోసి హీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కాడలతో సహా కరివేపాకు వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఆపై దంచిన వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం పోసి ఓ పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించాలి. ఇప్పుడు రసంలో సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఓ 15 నిమిషాలు మరిగించు కోవాలి. అందులో కాస్త కొత్తిమీర తరుగు వేసి గిన్నె పక్కన పెట్టండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. తాలింపు దోరగా వేగిన తర్వాత వేడివేడి రసంలో పోసుకుని కలుపుకోవాలి. అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఘుమఘుమ లాడే ఘాటైన వెల్లుల్లి రసం మీ ముందుంటుంది. ఈ వెల్లుల్లి రసం మీకు నచ్చితే ఓ సారి తప్పక ట్రై చేయండి.
చింతపండు చారు
కావాల్సిన పదార్థాలు : చింతపండు – పెద్ద నిమ్మకాయ సైజంత, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, నూనె – రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డ- రెండు, టమాటా – రెండు, తాలింపు గింజలు – రెండు టీస్పూన్లు, పసుపు – అర టీస్పూను, కారం -టేబుల్ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, వాటర్ – సరిపడా, కరివేపాకు – రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు – కొద్దిగా, పచ్చిమిర్చి – మూడు,
తయారీ విధానం : ముందుగా చింతపండు 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోండి. ఈ టైమ్‌లో చారులోకి కావాల్సిన టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత చింతపండు రసం రెడీ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో చారుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. ఆపై పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు, కరివేపాకు వేయండి. అలాగే ఉప్పు, కారం, పసుపు వేయండి. ఇప్పుడు టమాటా, ఉల్లిగడ్డ ముక్కలను చారులోనే చేతితోనే మెత్తగా చిదుముకోవాలి. తర్వాత ఈ గిన్నెను స్టౌపై పెట్టండి. చారుని పది నిమిషాల సేపు మరిగించుకోండి. అనంతరం చారులో ఉప్పు, కారం రుచికి సరిపోయే విధంగా ఉన్నాయో చెక్ చేసుకోండి. వీలైతే రుచికి సరిపడా వేసుకుని స్టౌ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టౌపై మరో గిన్నె పెట్టండి. ఇందులో ఆయిల్ వేసి వేడి చేయండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయండి. అలాగే తాలింపు గింజలు వేసి దోరగా వేపండి. అలాగే ఎండుమిర్చి, కొత్తిమీర తరుగు వేసి ఫ్రై చేయండి. ఇందులో మరిగించుకున్న రసం వేసి కలపండి. అంతే.. ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో రుచికరమైన చింతపండు రసం రెడీ.
కళ్యాణ రసం
కావాల్సిన పదార్థాలు: కందిపప్పు – కప్పు, ఎండుమిర్చి – నాలుగు, టమాటా – ఒకటి, చింతపండు – పెద్ద నిమ్మకాయ సైజంత, మిరియాలు – టీస్పూను, వెల్లుల్లి రెబ్బలు – ఎనిమిది, నూనె – రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు – టీస్పూన్లు, పసుపు – అర టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, వాటర్ – సరిపడా, కరివేపాకు – నాలుగు రెమ్మలు, కొత్తిమీర తరుగు – కొద్దిగా, ఇంగువు – పావు టీస్పూను.
తయారీ విధానం: ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోండి. ఇందులో రెండు గ్లాసుల నీరు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోండి. పప్పుని మెదుపుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే టమాటా సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత మిరియాలు, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. అలాగే చింతపండు కొద్దిసేపు నీటిలో నానబెట్టి రసం రెడీ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి వేపండి. తర్వాత కొద్దిగా పసుపు, ఎండుమిర్చి ముక్కలు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ సిమ్‌లో పెట్టి ముక్కలు మెత్తగా ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగయ్యాక.. ఉడికించు కున్న పప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు పావు లీటర్ నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఓ పొంగు వచ్చే వరకు మరిగించాలి. రసం మరుగుతున్నప్పుడు చింతపండు రసాన్ని పోసి మిక్స్ చేయాలి. తర్వాత కరివేపాకు, గ్రైండ్ చేసిన మిరియాలు, వెల్లుల్లి మిశ్రమం వేసి కలపండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర తరుగు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఓ పొంగు వచ్చేవరకు మరిగించు కోవాలి. తర్వాత ఇంగువ వేసి మరో నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఘుమఘుమలాడే కళ్యాణ రసం రెడీ.