గిరిజ‌న మ‌హిళలకు అండ‌గా

For tribal womenకరోనా కష్టాల్లో జనం అల్లాడుతున్న రోజులవి… చేయడానికి పనుల్లేక.. తినడానికి తిండిలేక వ్యవసాయ కార్మిక కుటుంబాలు మలమలలాడుతున్న సమయం.. అటువంటి పరిస్థితుల్లో డ్వాక్రా రుణాల వడ్డీలు చెల్లించాలని నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గిరిజన మహిళలపై జులూం చెలాయించింది. 2020లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా ఉన్న రజత్‌కుమార్‌ సైనీ ఆదేశాలతో బ్యాంకర్లు ఇండ్ల మీద దాడికి తెగబడ్డారు. రాత్రిళ్లు పురుషులు లేని సమయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) బ్యాంకు సిబ్బంది ఇండ్ల మీదకు వచ్చేవారు. ఇంట్లో ఉన్న సామాగ్రిని బయటపడేసి నానా రభసా చేసేవారు. వేలాది మంది గిరిజన మహిళలు ఈ వేధింపులను భరించలేక గుండెలు బాదుకున్నారు. అటువంటి సమయంలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) బాధిత మహిళలు ఆశ్రయించారు. వీరి ఉద్యమానికి సీపీఐ(ఎం) అండగా నిలబడింది. 15 రోజుల పాటు వివిధ రూపాల్లో పోరాటం సాగించి డ్వాక్రా మహిళలను రుణ ఒత్తిడి నుంచి విముక్తులను చేసింది.
వేలాది మందితో రాస్తారోకో…
ములకలపల్లి మండలంలో బ్యాంకుల వేధింపులు అధికంగా ఉండేవి. ఐద్వా రాష్ట్ర నాయకులు బుగ్గవీటి సరళ నేతృత్వంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మందడపు జ్యోతి తదితరులు బాధిత మహిళలను స్వయంగా కలిసి మాట్లాడారు. బ్యాంకు సిబ్బంది వారిని పెడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. వారికి అండగా నిలబడి ఉద్యమాన్ని ప్రారంభించారు. సంతకాల సేకరణతో మొదలైన వీరి పోరాటం రాస్తారోకోలు, ధర్నాల వరకు సాగింది. మొత్తమ్మీద 15 రోజుల పాటు ఈ ఆందోళనలు కొనసాగాయి. ములకలపల్లి బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. అక్కడితో ఆగకుండా అశ్వారావుపేట- పాల్వంచ రోడ్డుపై రాత్రిపూట మహిళలంతా రెండు, మూడు గంటల పాటు రాస్తారోకో చేశారు. ప్రభుత్వం దృష్టికి సమస్య వెళ్లేలా పోరాటం సాగించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి లేకుండా పూటకెళ్లక పస్తులుంటుంటే ఇలా వేధించటం ఏంటని బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని బ్యాంకు మేనేజర్‌, మిగతా సిబ్బందిని తీసుకొచ్చి చర్చించారు. ప్రభుత్వం వైపు నుంచి డ్వాక్రా రుణాల చెల్లింపుపై ఒత్తిడి ఉండదని స్పష్టమైన హామీ వచ్చే వరకు పోరాటం సాగించారు. అలుపెరుగ సాగింగిచిన వీరి పోరాటం ఫలితంగా సమస్య పరిష్కారం అయింది. నాటి నుంచి నేటి వరకు ఇక్కడే కాదు రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా రుణాల ఒత్తిళ్లు నుంచి మహిళలకు విముక్తి లభించేందుకు ఈ పోరాటం స్ఫూర్తిగా నిలిచింది.
– కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి
వారిలో సంతోషం వెల్లివిరిసింది
మేము చేసిన పోరాటాల ఫలితంగా డ్వాక్రా రుణాల చెల్లింపు ఒత్తిళ్ల నుంచి గిరిజన మహిళలకు విముక్తి లభించింది. మేము చేస్తున్న ఈ పోరాటానికి సీపీఐ(ఎం) పూర్తి మద్దతు ఇచ్చింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు లోన్‌లు ఇవ్వకపోగా వడ్డీ చెల్లింపుల కోసం వేధింపులకు పాల్ప డింది. పనుల్లేక పస్తులుం టున్న కరోనా లాక్‌డౌన్‌ సమయంలో రుణ చెల్లిం పుల కోసం మహిళలపై తీవ్ర ఒత్తిడి చేసింది. 5వ తేదీలోపు కడితే సరేసరి. లేదంటే వడ్డీల మీద వడ్డీ వేస్తూ ఇబ్బందులకు గురిచేసింది. 60 ఏండ్ల పైబడిన మహిళలకు అభయ హస్తం రుణాలు ఇవ్వలేదు. బీమా సౌకర్యాన్ని కూడా తీసివేసింది. చివరకు మా పోరాటం ఫలించింది. నేటికీ రుణాలపై ఒత్తిళ్లు లేకుండా పోయాయి.
– మందడపు జ్యోతి, ఐద్వా జిల్లా కార్యదర్శి