కమ్యూనిస్టులే దేశానికి దిక్సూచి

Communists are the compass of the countryదేశంలో కమ్యూనిస్టు పార్టీల బలాబలాల సమీక్షలో సీట్ల సంఖ్య, ఓట్ల శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని వామపక్ష పార్టీలు బలహీనపడ్డాయని, కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎక్కాల లెక్కలు చెబుతున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, తమ పార్టీకి నాలుగువందల సీట్లు దాటుతాయని మైండ్‌గేమ్‌ ఆడింది. ఈ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఇండియా కూటమికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్ల బీజేపీ కూటమికి వెన్నులో వణుకు పుట్టింది. కమ్యూని స్టులు బలహీనంగా ఉంటే వామపక్ష పార్టీల విధానం మీద వెర్రెత్తినట్టు బీజేపీ ఎందుకు ప్రచారం చేసిందో అర్థం చేసుకోవాలి. హిందూ ప్రజలందరికీ తామే ఏకైక ప్రతినిధుల మన్నట్టు బీజేపీ, సంఫ్‌ు పరివార్‌ శక్తులు ఆధ్యాత్మికతను, పరిపాలనను కలగాపులగం చేసి మతోన్మాద రాజకీయాలతో దేశ సమగ్రతకు తూట్లు పొడుస్తున్న ది. మత మౌఢ్యాన్ని వ్యతిరేకిస్తూనే ఆధ్యాత్మికత అనేది ప్రజల వ్యక్తిగత విశ్వాసమని కమ్యూనిస్టు పార్టీలు భావిస్తు న్నాయి. కానీ, మతోన్మాద రాజకీయాలతో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ దేశ ఆర్థిక స్వావలంబనను గుత్త పెట్టుబడిదారులకు కట్టబెట్టే ఎజెండాతో కమ్యూనిస్టుల మీద విషప్రచారం సాగిస్తున్నది.
పాలకుల దోపిడీపీడనలతో నలిగిపోతున్న ప్రజలు ఆశ్రిత పెట్టుబడిదారీ, నిరంకుశ పాలకవర్గాలను ప్రజలు తిరస్కరిస్తున్న పరిస్థితి నేడు మన కండ్ల ముందు కనిపిస్తున్నది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈమార్పు మొదలైంది. పొరుగున ఉన్న శ్రీలంకలో జనతా విముక్తి పెర ముణ కూటమి అధికారంలోకి వచ్చింది. గతంలో మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన ఆ కూటమి అధ్యక్ష ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా విజయం సాధించింది. కెన్యాలో అభ్యుదయ శక్తులు నిరంకుశ పాలక పార్టీని గద్దెదించాయి. అలాగే పెరూ, వెనిజులా, బ్రెజిల్‌లో వామపక్ష శక్తులు ఎన్నికల్లో విజయం సాధించాయి. నేపాల్‌లో తిరిగి కమ్యూనిస్టు పార్టీల ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పడింది. ఫ్రాన్స్‌ లో వామపక్ష పార్టీలు బలమైన శక్తిగా గెలుపొందాయి. ఈ మార్పును పసిగట్టని బీజేపీ ప్రజల్ని నిరంతరం ఏమార్చే ప్రయత్నమే చేస్తున్నది.
2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అరిచి గీపెట్టినా నాలుగువందల సీట్లు కాదు గదా 2019లో వచ్చిన మూడువందల సీట్లను సమీపించలేకపోయింది. 240 సీట్లు గెలిచి జనతా దళ్‌ (యునైటెడ్‌),టీడీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వామపక్ష పార్టీలు అంకెల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకోలేకపోయినా, బీజేపీ కూటమిని ప్రభావంతంగా వెనక్కికొట్టింది. ఇలాంటి పరిస్థితిని ఊహించే బీజేపీ దాని అనుబంధ సంఘాలు వామపక్ష శక్తుల మీద గోబెల్స్‌ ప్రచారానికి దిగాయి. కుల, మత, ధన ప్రాబల్యం నెలకొన్న ఎన్నికల రాజకీయాల్లో కమ్యూనిస్టుల ప్రభావాన్ని ఓట్లు, సీట్ల సంఖ్యతో మాత్రమే లెక్కించడం సరికాదు. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటం, పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాల్లో జరిగిన రైతాంగ పోరాటాల వల్లనే వెట్టిచాకిరీ నిర్మూలన, భూ సంస్కరణల చట్టం అమల్లోకి వచ్చింది. శ్రామిక ప్రజల మెరుగైన జీవనం కోసం ఏర్పాటైన అనేక చట్టాలకు కమ్యూనిస్టు పార్టీల పోరాటమే కారణమన్నది ప్రజల మనసుల నుంచి ఎవరూ చెరిపేయలేరు. ఎందుకంటే, అధికారం ఉన్నా, లేకున్నా, నిరంతరం ప్రజల మేలు కోసం ఆలోచించేది కమ్యూనిస్టు పార్టీలే కాబట్టి.
నేడు దేశ అభివృద్ధికి స్వయం పోషకానికి కీలకమైన అనేక ప్రభుత్వరంగసంస్థలను బీజేపీ కూటమి తమకు అండగా ఉన్న ప్రయి వేటు పెట్టుబడిదారులకు అప్పగించడంతోపాటు ప్రభుత్వరంగ బ్యాంకులు రుణాలు మంజూరు చేయించింది. ఆయా పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీలతో పాటు, రైటాఫ్‌ (తిరిగిరాని రుణాల) కింద వేల కోట్ల రూపాయల పరోక్ష రుణమాఫీ చేసింది. ప్రభుత్వరంగ సంస్థలను సజావుగా నడిపించడానికి మాత్రం రుణాలు, నిధులందించకుండా ప్రభుత్వం, పెట్టుబడిదారీ అనుకూల విధానాలను కొనసాగి స్తున్నది. ఈ క్రమంలోనే 2014 వరకు అట్టడుగున ఉన్న పారిశ్రామికవేత్త అదానీ ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన పరిస్థితి ఉంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందే విష యంలో అదానీ గ్రూప్‌ వ్యాపార లెక్కల్లో ఎన్నెన్ని అవకతవకలకు పాల్పడిందో దేశ విదేశీ సమాచార సాధనాలు ఇప్పటికే వెల్లడించాయి.
బీజేపీ కూటమి ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకున్నప్పటికీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్తగా ఎలాంటి ఆవిష్కరణలు లేవు. ప్రభుత్వ రంగంలో నూతన సంస్థలను నెలకొల్పలేదు. విద్యా వైద్య, ఆరోగ్య సంక్షేమ రంగాల్లో మాటలకే పరిమితమైంది. రుణభారం గత యాభైఏండ్ల కంటే భారీగా పెరిగిపోయింది. 2014లో మోడీ ప్రధాని కావడానికి ముందు డాలర్‌ రేట్‌ రూపాయి మారకం విలువ 59 రూపాయలుగా ఉంది.2014 పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ రూపాయి విలువ డాలర్‌తో దిగ జారిందని, తాము రూపాయి విలువను బలోపేతం చేస్తామని ఢంకా బజాయించి చెప్పింది. పెట్రోల్‌ ధరను 35 రూపాయలకి దించుతామని చెప్పుకుంది. ఇవాళ డాలర్‌తో రూపాయ మరీ బక్కచిక్కి 86.48 రూపా యలకు పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సంక్షోభం లోకి కూరుకుపోయే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది.
బడా పారిశ్రామిక వేత్తలకు అనుకూల విధానాలు అనుసరించడం ద్వారా దేశంలో సంపద మొత్తం కొద్దిమంది దగ్గర పోగుపడింది. తొంభై శాతం ప్రజల జీవన పరిస్థితి దిగజారిపోయింది. విద్యా, ఆరోగ్య సంక్షేమ కోసం ప్రజల ఆదాయాలు సరిపోని స్థితి ఏర్పడింది.రైతులను అదానీ లాంటి బడా కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు పరాధీనం చేసేందుకు, వెనక్కి తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల రైతాంగం నష్టపోవడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి ప్రమాదంలో పడుతుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు క్షీణిస్తున్నాయి. సాప్ట్‌వేర్‌ రంగంలో ఏర్పడిన మార్పుల వలన లక్షలాది మంది ఉద్యోగాలు పోతున్నాయి. దీనికితోడు కంపెనీలు వారానికి 70, 80 గంటలు పనిచేయాలని యాజమాన్యాలు ప్రకటనలు చేస్తున్నాయి.బీజేపీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పుకుంటున్నప్పటికీ సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామీ (సిఎంఐఇ), నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సర్వే ప్రకారం గత 45 ఏండ్లలో చూడనంత ఎక్కువ నిరుద్యోగం మోడీ ఈ పదేండ్ల పాలనలో పెరిగిందనేది జగమెరిగిన సత్యం.
నల్లధనాన్ని అరికట్టి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని ఇచ్చిన మాట నీటి మూట అయింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఒనగూరిన ప్రయోజనమేమీ లేదు. నవంబర్‌ 2016లో 16.63 లక్షల కోట్ల నుంచి 13.35 లక్షల కోట్లకు తగ్గి వెంటనే అది మార్చి 2024కి 35.15 లక్షల కోట్లకు చేరింది. జీఎస్టీతో అన్ని వస్తువుల మీద విపరీతంగా పన్నుల భారం మోపింది. జీఎస్టీ ద్వారా సమ కూరిన ఆదాయాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడంలో కేంద్రం తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నది. అవినీతిని అరికడతామని పదేపదే ప్రకటనలు చేసిన బీజేపీ కూటమి ఎన్నికల బాండ్లు, రఫెల్‌ డీల్‌తో పీకల్లోతు అవినీతిలో కూరుకపోయింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం చెబితే కానీ ఎన్నికల బాండ్ల అవినీతి గురించి వెల్లడించలేదు. రాజ్యాంగ లౌకికతత్వాన్ని, ఫెడరల్‌ విలువల్ని నాశనం చేసేందుకు మనుస్మృతి పేర తమకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చే ప్రకటనలు చేస్తున్నది. దేశంలో ఉన్న లౌకిక ప్రజాతంత్ర శక్తులను మట్టుపెట్టడానికి జమిలి ఎన్నికలకు బీజేపీ పాలకులు సిద్ధమవుతున్నది.
దేశంలో మత రాజకీయాల్ని ప్రేరేపిస్తూ లబ్ది పొందుతున్న బీజేపీ తెలంగాణలోనూ ఆ ప్రయత్నాల్ని తీవ్రతరం చేస్తున్నది. హిందూత్వ రాజకీయాలతో రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ విద్వేష భావజాలాన్ని చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు అంగీకరించరు. కానీ ‘మనువాద’ ప్రమాదాన్ని అంతా తేలిగ్గా తీసుకోకూడదు. కమ్యూనిస్టు పార్టీలు వ్యక్తి విశ్వా సాలకు వ్యతిరేకం కాదు, దేశ ప్రజల భవిష్యత్తును నష్టం చేసే బీజేపీ-ఆరెస్సెస్‌ పరివార కుతంత్రాలకు వ్యతిరేకం. మత సామరస్యాన్ని దెబ్బతీసే విధానాలకు వ్యతిరేకం. దేశంలోనే కాదు, తెలంగాణలో ఆ పార్టీ విశృంకల పోకడలను మార్కిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఎప్పటికప్పుడూ దాని ద్వంద్వ వైఖరిని బహిర్గత పరుస్తున్నది. ఈ చర్యలను అడ్డుకోవడానికి వామపక్ష పార్టీలతోపాటు కలిసొచ్చే పార్టీలు, ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని పోరాడేందుకు సీపీఐ(ఎం) సదా ప్రజల పక్షమేవహిస్తుంది. సామాజిక అసమానతలు, కుల, మత, వివక్ష, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూనేవుంది. ఫాసిస్టు శక్తులు ప్రజలను ప్రలోభపెడుతూ సాగించే తప్పుడు ప్రచారం వల్ల కమ్యూనిస్టులను తాత్కాలికంగా నిలువరించినప్పటికీ అంతిమంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో శ్రామికవర్గ ప్రజలు ఏకమవ్వక తప్పదు. తప్పుడు ప్రచారాలతో దోపిడీ పాలక పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా కమ్యూనిజం అజేయంగా నిలుస్తుంది.ఈ దేశానికి కమ్యూనిస్టులే దిక్సూచి.
(జనవరి 25-28, సంగారెడ్డిలో సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు)
జూలకంటి రంగారెడ్డి
9490098349