– జిల్లా జడ్జి సునీత కుంచాల
– ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ర్యాలీ
– ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ర్యాలీ
నవతెలంగాణ – కంఠేశ్వర్
బాలికలు ధైర్యంగా ఉండాలని,ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులతో కలిసి జిల్లా కోర్టు నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించగా న్యాయమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ధర్నా చౌక్ లో విద్యార్థులు ఉపాధ్యాయులు న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యంతోపాటు ఇతర సమస్యలు ఏవి ఎదురైనా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు చెప్పాలని, నెలసరి సమస్యలపై చర్చించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. డీసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ.. బాలికలు ఇందిరాగాంధీ ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. ఎలాంటి సమస్యలున్నా 1098 కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలిక ల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. న్యాయమూర్తి పద్మావతి మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుండే పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నత స్థాయి లో ఉండడానికి ప్రయత్నం చేయాలన్నారు. బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా జడ్జి కుంచాల సునీతను ఆదర్శంగా తీసుకోవాలని, అభివృద్ధి పథాన అడుగులు వేస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం అర్సపల్లి, గుండారం, మల్లారం, సిర్నాపల్లి పాఠశాలల విద్యార్థినులకు దాతల సహకారంతో సానిటరీ నాప్కిన్ లు అందజేశారు. కార్యక్రమంలో బీసీటీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టాల రామకృష్ణ, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, గౌరవ సలహాదారు రమణస్వామి, సత్యనారాయణ, విజయ్ కుమార్, రాజ్ కుమార్ సుబేదార్, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.