– జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఆడపిల్లలు భారం కాదు భవితకు సోపానం అని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం, అలాగే బేటీ బచావో – బేటీ పడావో పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించారు. అనంతరం అదనపు జిల్లా కలెక్టర్ గంగాధర్ జ్యోతి ప్రజ్వలన గావించి, మిషన్ శక్తి – సామర్థ్య (మహిళా సాధికారత కేంద్రం) పోస్టర్లను ఆవిష్కరించి, జాతీయ బాలికా దినోత్సవ నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రథమంగా జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బాలికలు నిత్యం ఎదుర్కొనే సమస్యలను అధిగమించి, జీవితంలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. భ్రూణ హత్యల నిర్మూలనకు పుట్టిన ఆడబిడ్డకు రక్షణ కల్పించేందుకు పీసీపీఎన్డీటీ యాక్ట్ ఉందని, ఎవరైనా సరే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తూ బాలికల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ఆడపిల్లకు మెరుగైన విద్యను అందించటం కోసం కేజీబీవీలు ఉన్నాయని అన్నారు. అదే విధంగా బాలికల రక్షణార్థం బాల కార్మిక చట్టం, పోక్సో యాక్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టం, వరకట్న నిషేధ చట్టం, గృహ హింస చట్టం ఉందని, ఒకవేళ ఎవరైనా ఈ చట్టాలను అతిక్రమిస్తే జామీను లేకుండా క్రిమినల్ కేసులు నమోదవుతాయని అన్నారు.
పని ప్రదేశంలో మహిళలు లైగింక వేధింపులకు గురికాకుండా మహిళా సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా పనిచేసే చోట మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మహిళలు (లేదా) బాలికలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ఈ సఖి కేంద్రాలు కృషి చేస్తున్నాయని, ఏదైనా సమస్య ఉంటే 1098 సహాయక నంబర్ లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు బాలలను, బాలికలను సమనత్వంతో చూడాలని, ఆడపిల్లల చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ మాన్పించవద్దని, వారికి ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించి, గొప్ప స్థానంలో నిలబెట్టాలని కోరారు. అనంతరం డీసీపీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ఆడపిల్లలు శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహిస్తున్నారని అన్నారు. ఆడపిల్లలు పట్టుదలతో చదువుకొని ఉన్నతంగా ఎదగాలని, ఎవరిపై కూడా ఆధార పడకుండా ఆర్థిక స్వతంత్రత కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం జాతీయ బాలికల దినోత్సవం నేపథ్యంలో వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాస రచన, ఆటల పోటీలు, తదితరాల్లో పాల్గొని, గెలిచిన విద్యార్థినులకు బహుమతులను ప్రదానం చేశారు. అంతకుముందు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శనలు, పాడిన పాటలు, పద్యాలు, ఇచ్చిన సందేశాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె నరసింహారావు మాట్లాడుతూ ఆడపిల్లలని పుట్టనిద్దాం బతకనిద్దాం, ఎదగనిద్దాం అన్నారు. చదువునిద్దాం అనే నినాదంతో పనిచేయాలని సంక్షేమ శాఖ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె నరసింహారావు, జెడ్పి సీఈవో శోభారాణి, డీపీఓ సునంద. జిల్లా ఆశా ప్రోగ్రాం కోఆర్డినేటర్ వీణ. సత్యవతి. సీడీపీఓలు , ఐసీడీఎస్ సూపర్వైజర్ లు, పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థినులు పాల్గొన్నారు.