రైతులను అయోమయానికి గురి చేయొద్దు..

Don't confuse the farmers..– అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సారా సురేష్ 
– ప్రభుత్వం ఇచ్చిన భూములకు రైతు భరోసా ఇవ్వాలి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
రైతు భరోసా విషయంలో ప్రభుత్వం రైతులను అయోమయానికి గురి చేయడం తగదని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సారా సురేష్ అన్నారు. శనివారం మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో భూ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సారా సురేష్ మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా 2006-07 సంవత్సరాలలో నాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే నెంబర్ 574లో భూమిలేని నిరుపేదలు భూములను చదును చేసి, భూమిని అక్రమించిన తర్వాత ప్రభుత్వం దిగివచ్చిందన్నారు.113మందికి 113 ఎకరాల భూమిని పంపిణీ చేసిందని గుర్తు చేశారు. లబ్ధిదారులందరూ ఉమ్మడిగా వ్యవసాయం చేసేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా భూమిని చదును చేసి జట్రోపా సాగు చేసిన నీటి సౌకర్యం లేక  సాగు కాలేదన్నారు.  ఆ తర్వాత రెండు సంవత్సరాలకు ఆముదం, సోయా, ఉలువలు పంటలు వేసి పది సంవత్సరాలుగా సాగు చేసి అనేక రకాలుగా నష్టపోయి 2022 నుండి అట్టి భూములలో పంటలు వేయడం మానేశారన్నారు. 9 సంవత్సరాల కాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు పేరుతో ప్రతి రైతుకు రూ.పదివేలు రైతుల ఖాతాలో పడేవి అన్నారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంగా రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చి నేటి వరకు ఇయ్యకపోగా, ప్రస్తుతం ఆ పంటలకు రాదని చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఒక దిక్కు పంట పండే భూములు అన్నిటికీ రైతు భరోసా ఇస్తామని మంత్రులు ప్రకటిస్తుంటే, అధికారులు వచ్చి మీరు పంటలు పెట్టలేదు.. మీకు రైతు భరోసా ఇవ్వము అని రైతులను అయోమయానికి గురి చేయడము ప్రభుత్వానికి తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వరద కాలువ నుండి రెండు కిలోమీటర్ల దూరం నీళ్లు తీసుకువచ్చినట్టయితే రెండు పంటలు పండే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఇంజనీర్లను పంపించి వరద కాలువ లబ్ధిదారుల భూముల సమీపంలోని చెరువు వరకు పైపులైన్ల ద్వారా నీటిని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం అందించిన భూములక తప్పనిసరిగా రైతు భరోసా ఇవ్వాలని, లేనిపక్షంలో  చలో కలెక్టరేట్ కార్యక్రమంతో ముట్టడిస్తామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ కమ్మర్ పల్లి మండల కార్యదర్శి బి.అశోక్, ఉట్నూర్ బాలయ్య, టి. బాలకిషన్, పెద్ది రాజేశ్వర్, డి.రాజేశ్వర్, అశోక్, రాజన్న, రమేష్, భూ లబ్ధిదారులు 70 మంది పాల్గొన్నారు.