
ఢిల్లీలో నేడు జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న చక్రాల సంతోష్ కుమార్ కు శనివారం ఆహ్వానం అందింది.జనగామ జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీకి చెందిన సంతోష్ కుమార్ గతంలో వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా 2018 నుండి 2023 వరకు పనిచేశారు. ఆ సమయంలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు వర్షపు నీటిని నిల్వ చేసేందుకు వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. 2022లో ఉపాధి హామీ పథకం కింద అమృత్ సరోవర్ స్కీం ను పర్వతగిరి మండలం మంక్త్య తండా గ్రామపంచాయతీ పరిధి గుట్ట ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతంలో గుట్టల సమీపంలో పదివేల క్యూబిక్ మీటర్ల పరిధిలో నీటి గుంటల ఏర్పాటు పనులు ప్రారంభించి పర్యవేక్షించారు. సుమారు 4171 మంది కూలీలు 5 లక్షల 84 వేల రూపాయల ఖర్చుతో 2023 మే నెలలో పూర్తి చేశారు. ఈ అమృత్ సరోవర్ స్కీం ద్వారా గుట్ట చుట్టూ 70 ఎకరాలకు పైగా భూగర్భ జలాలు పెరిగాయి. దేశంలోనే మొట్టమొదటి అమృత్ సరోవర్ పూర్తి చేసిన పథకంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి దక్కింది. గతంలో 2023 ఢిల్లీలో జరిగిన మన్ కి బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ లో ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్ పాల్గొన్నారు. అక్కడ మన్ కీ బాత్ స్క్రీన్ పై మంక్త్య తండా అమృత్ సరోవర్ ప్రోగ్రాం సంబంధించిన ఫోటో వీడియోలు ప్రదర్శించడంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. చక్రాల సంతోష్ కుమార్ 2018 కంటే ముందే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండగానే గ్రూప్ వన్ లో ఎంపీడీవో గా ఎంపికై వరంగల్ జిల్లాలో పనిచేశారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని చివ్వెంల మండలంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా దేశంలోనే మొట్టమొదటి అమృత్ సరోవర్ పథకాన్ని పూర్తి చేసినందుకుగాను నేడు ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు కేంద్రం నుంచి ఆహ్వానం అందినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ హైదరాబాద్ కు పిలిపించి సన్మానించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు జిల్లా తరఫున ఆహ్వానం అందుకున్న ఎంపీడీవోని పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు సిబ్బంది అభినందించారు.