
– ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
– ప్రభుత్వ వైద్యాధికారి కె.వి.సంఘమిత్ర
– మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : యువత మంచి అలవాట్లను అలవర్చుకోవాలని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను సూచించారు. ఈ మేరకు మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన సింగారం గ్రామంలో స్థానిక పోలీస్ శాఖ, వైద్యశాఖ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చుట్టూ కొండలు కోనలు దట్టమైన అడవుల మధ్యలో మండల కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి రవాణా సౌకర్యానికి
అందుబాటులో లేని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన బూసరాయి గ్రామంలో వ్యయ, ప్రయాసలతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సింగారం గ్రామంలోని గుత్తి కోయ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందించడం జరిగిందని ఆళ్ళపల్లి పి.హెచ్.సి. వైద్యాధికారి కె.వి.సంఘమిత్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. దానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం గ్రామంలోని గుత్తికోయ ప్రజలకు డీఎస్పీ ఉచితంగా రగ్గులు, వంట సామాగ్రి, మందులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా యువతకు వాలీబాల్ కిట్ ను డీఎస్పీ అందజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లను వ్యసనంగా మార్చుకొని తమ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సంఘవిద్రోహక శక్తులకు ఎటువంటి సహాయం చేయొద్దన్నారు. ఒకవేళ సహాయం చేసినట్లు తెలిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై ఈ.రతీష్, మొబైల్ టీమ్ డాక్టర్ కె.శరత్, హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి, స్టాఫ్ నర్స్ సరిత, ల్యాబ్ టెక్నీషియన్ పార్వతి, ఏఎన్ఎం వి.సుగుణ, హెల్త్ అసిస్టెంట్లు శ్రీధర్ బాబు, ఎం.నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.