అడవులను రక్షించుకోవడం మనందరి బాధ్యత

– వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవు
– డీ.ఎఫ్.ఓ కృష్ణ గౌడ్
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : అడవులను రక్షించుకోవడం  మనందరి బాధ్యతని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ అధికారి (డీ.ఎఫ్.ఓ) కృష్ణ గౌడ్ అన్నారు. ఈ మేరకు యానంబైల్, రేగళ్ల, చాతకొండ, ఆళ్ళపల్లిలకు సంబంధించి అటవీశాఖ నాలుగు రేంజ్ ల పరిధిలోని ఫారెస్ట్ అధికారులతో డి.ఎఫ్.ఓ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, అడవుల పునరుద్ధరణ కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వేసవి సమీపిస్తున్నందున అడవుల్లో ఎరుగళ్లు పడే అవకాశం ఉందని, ఎటువంటి మంటలు చెలరేగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. మంటల వల్ల చెట్లకు, అడవి జంతువులకు హాని కలగకుండా చూడాలని అధికారులను సూచించారు. అదేవిధంగా వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆటవీశాఖ అధికారులు, సిబ్బంది అడవుల నరికివేతపై నిఘా ఉంచాలని, అడవి జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, కలప అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం సమీపంలోని అడవులను సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఎఫ్.డీ.ఓ బాబు నాయక్, రేగళ్ల ఫారెస్ట్ రేంజర్ వి.జశ్వంత్, ఆళ్ళపల్లి ఫారెస్ట్ రేంజర్ కిరణ్, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.