మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న నేటి దేశ పాలకులకు శ్రమన్నా, శ్రమ చేసే మహిళన్నా గౌరవం లేదు. మహిళా హక్కులు మానవ హక్కుల్లో భాగమనే విషయం మర్చిపోతున్నారు. కాదు మర్చిపోయినట్టు నటిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మహిళల హక్కులను హరిస్తుంది. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు, హింస బాగా పెరిగిపోయింది. మహిళలకు సమాన హక్కులు, శ్రమకు తగ్గ గుర్తింపు, సమాన పనికి సమాన వేతనం, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు… ఇవేవీ ప్రభుత్వాలకు పట్టడం లేదు. మహిళా కార్మికులు ఇటువంటి ఎన్నో సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. సీఐటీయూ జెండా నీడలో అనేక ఉద్యమాలు చేస్తున్నారు. వీరు చేస్తున్న పోరాటాలన్నింటికీ సీపీఐ(ఎం) అండగా నిలబడుతోంది. సంగారెడ్డిలో సీపీఐ(ఎం) నాల్గవ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో మహిళా కార్మికులు చేస్తున్న పోరాటాల గురించి శ్రామిక మహిళా కన్వీనర్ రమ మానవితో పంచుకున్నారు.
మన దేశ జనాభాలో సగం మంది మహిళలలో అత్యధిక మంది సంరక్షణ, సేవా పనులు చేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారాన్ని అందించే అంగన్వాడీ, ఆషా, మధ్యాహ్న భోజన కార్మికులుగా సేవలు అందిస్తున్నారు. వీరంతా స్కీం వర్కర్లుగా ఉన్నారు. అయితే వీరందరినీ ప్రభుత్వం కార్మికులుగా గుర్తించడం లేదు. ఈ పథకాలను వ్యవస్థీకృతం చేసి విస్తృత అసంఘటిత రంగ మహిళలు, పిల్లలకు ఆరోగ్య, శిశు రక్షణా సౌక ర్యాలు కల్పించాల్సిందిపోయి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీంలకు నిధులను తగ్గించి, ప్రైవేటు వారికి అప్ప గించి క్రమంగా మూసేయాలని చూస్తోంది. ప్రస్తు తం కార్మిక వర్గం పరిస్థితే ఆధ్వాన్నంగా ఉంది. ఇక మహిళల స్థితి మరింత దారుణంగా వుంది.
హక్కులను హరిస్తున్నారు..
వేతనాలు, ప్రమోషన్లు, మెటర్నటీ బెన్ఫిట్స్ మొదలైన వాటిల్లో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇలా వాళ్ళకు రావల్సిన చట్టపరమైన హక్కులు ఏవీ అమలు కావడం లేదు. ఈ సమాజం ఎలాగైతే మహిళలను రెండవ తరగతి పౌరురాలిగా చూస్తుందో, ఎలాంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నారో అవి పని చేసే చోట కూడా భరించాల్సి వస్తుంది. లైంగిక వేధింపులు, మౌళిక వసతుల లేమీతో ఇబ్బందులు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా అనేక కుటుంబాలు మహిళలపై ఆధారపడి ఉన్నట్టు అనేక లెక్కలు చెబుతున్నాయి. అంటే మహిళలు ఒంటరిగా కుటుంబాల భారాన్ని మోయాల్సి వస్తుంది. గతంలోనూ మహిళా కార్మికులకు ఒరింగిందేమీ లేదు. అయితే మొన్నటి వరకు గుడ్డికంటే మెల్ల నయం అన్నట్టు ఉండేది. అయితే ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ ఉన్నపాటి హక్కులు కూడా లేకుండా చేస్తోంది. దీని ప్రభావం మహిళా కార్మికులపై తీవ్రంగా పడుతుంది.
నిరంతర పోరాటాలు
కేంద్రం 29 కార్మిక చట్టాలను మార్పులు చేసి 4 లేబర్ కోడ్లుగా తెస్తామంటుంది. వీటిని రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగు తున్నాయి. గత పదేండ్లుగా స్కీం వర్కర్లుగా ఉన్న శ్రామిక మహిళలను ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అలాగే పని ప్రదేశాల్లో అంతర్గ త ఫిర్యాదు కమిటీలు వేయాలని అడుగుతు న్నారు. వీటన్నింటిపై మహిళా కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉన్నారు. కలకత్తాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన ఘటనపై ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. అలాగే కులదురహంకార హత్యలు, సామాజికంగా మహిళలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
సీపీఐ(ఎం) అండతో…
కాంట్రాక్ట్ కార్మికుల్లో కూడా ప్రస్తుతం మహిళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. స్థిరంగా ఒక దగ్గర ఉంటారు, పని బాగా చేస్తారు, తక్కువ వేతనం ఇచ్చినా సరిపోతుంది అనే ఉద్దేశంతో మహిళలను ఎక్కువగా నియమించుకుంటున్నారు. దీని వల్ల మహిళలు తీవ్రమైన శ్రమదోపిడికి గురవుతున్నారు. వీరిని పర్మినెంట్ చేయాలని కూడా నిరంతరం ఉద్యమాలు చేస్తున్నారు. భవననిర్మాణ కార్మికుల్లో మగవారికి ఒక కూలీ, ఆడవాళ్లకు ఒక కూలీ ఉంటుంది. చివరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్ల విషయంలో మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఆశాలు, అంగన్వాడీలు ఇలా అందరూ తమ సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారు. వీటన్నింటిలో సీపీఐ(ఎం) అండగా నిలబడుతోంది. ఐకేపీ వీఏఓలు 84 రోజులు సమ్మె చేస్తే పార్టీ అండగా నిలబడి ఉద్యోగాలు వచ్చేలా చేసింది. రిటైర్మెంట్ బెన్ఫిట్స్ కోసం అంగన్వాడీ 20 రోజులు సమ్మె చేశారు, మధ్యాహ్న భోజన పథకం వారు 15 రోజులు సమ్మె చేశారు. దాదాపు అందరూ విజయం సాధించారు.ప్రభుత్వ నిర్భందాలు వచ్చినప్పుడు, సామాజిక అణచివేత జరిగినప్పుడు, ఆర్థిక ఉద్యమాలు జరిగినప్పుడు కార్మికులకు పార్టీ అండగా నిలబడింది.
మా శ్రమను గౌరవించాలి
12 ఏండ్ల నుండి నేను ఆషా వర్కర్‌గా చేస్తున్నా. మాకు టార్గెట్లు ఉంటాయి. అవి చేస్తేనే పారితోషికం ఇస్తారు. నెలకు ఐదుగురు గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావాలి. ముగ్గు రిని తెచ్చినా డబ్బులు ఇవ్వారు. ముగ్గురు ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీ అవ్వాలి. ఇలా కేసును బట్టి మాకు డబ్బులు ఇస్తారు. కానీ నర్సుల మాదిరిగానే మేమూ ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు డ్యూటీ చేయాలి. ఉదయం ఏరియాలకు వెళ్ళాలి. మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్ళాలి. వారాంతపు సెలవులు ఉండవు. పండగలైనా పనిలో ఉండాల్సిందే. అంతేకాదు ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు పెట్టినా మాకు ప్రత్యేక డ్యూటీలు వేస్తారు. ఇలా మా శ్రమను దోచుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా చార్జీలు మావే. మా శ్రమను గౌరవించాలి. ఫిక్స్డ్ జీతం ఇవ్వాలి. దీనికి ఓ జీఓ ఇవ్వాలి.
– టి.యాదమ్మ, దోమలగూడ
శ్రమకు తగ్గ ఫలితం లేదు
గత 20 ఏండ్ల నుండి పేద, నిరుపేద మహిళలను సంఘటితం చేసి వాళ్ళను పొదుపు చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నాము. ఒక్కో గ్రూపులో పది నుండి 15 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళకు నెలకు రెండు సమావేశాలు పెడతాము. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని తిరిగి కట్టే విధంగా అవగాహన కల్పిస్తాం. ఇటీవల గ్రూపుల వివరాలన్నీ ఆన్లైన్లో జత చేయాలని చెప్పారు. కానీ దానికి సంబంధించిన సౌకర్యాలు మాత్రం ఇవ్వడం లేదు. ట్యాబ్ కొనే పరిస్థితి లేక చిన్న మొబైల్లోనే ఈ పనులన్నీ చేసుకుంటున్నాం. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తు న్నాయి. ఇంత శ్రమ చేస్తున్నా వీఓఏలు చనిపోతే ఎలాంటి నష్టపరిహారం లేదు. ఈ మధ్య గ్రూపు పెట్టుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు అన్నీ లెక్కలు ఇవ్వమంటున్నారు. అది కరెక్టుగా ఇవ్వక పోతే జీతం ఇవ్వరు. వాళ్ల టార్గెట్ల కోసం రాత్రీ పగలు లేకుండా ఫోన్లు చేసి పై అధికా రలు ఒత్తిడి చేస్తున్నారు. నోటికొచ్చిన బూతులు తిడుతుంటారు. ఇవన్నీ భరిస్తూ పని చేయాల్సి వస్తుంది.
– సుమలత, నాగర్‌కర్నూల్ అధ్యక్షురాలు, ఐకేపీ వీఓఏ
మహిళా కార్మికుల డిమాండ్స్
– మహిళల శ్రమకు తగిన గుర్తింపునివ్వాలి.
– మహిళలందరికీ పురుషులతో సమానంగా కనీస వేతనం చెల్లించాలి.
– మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హింసను అరికట్టాలి.
– చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అసెంబ్లీ, పార్లమెంట్లో తక్షణమే అమలుచేయాలి.
– మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
– పనిప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేయాలి.
– గృహహింస, కులదురంహాకర హత్యలకు వ్యతిరేకంగా చట్టం చేయాలి.
– 4 లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ చట్టం- 2022ను వెంటనే ఉపసంహరించాలి.