నవతెలంగాణ – కంఠేశ్వర్
రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా యువకులు స్వచ్ఛందంగా ట్రాఫిక్ పోలీసుల యొక్క విధులను అధ్యయనం చేయడం కోసం ముందుకు రావడం రెండు రోజులపాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి వీధిలో వారికి సహకరించటం నిజంగా అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువకుల్లో ఒక నిర్మాణాత్మకమైన మార్పు ఏర్పడుతుందని తద్వారా బాధ్యతాయుతమైన సమాజం నిర్మాణం అవుతుందని నిజామాబాద్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ వ్యాఖ్యానించారు. మేరా యువభారత్ నెహ్రూ యువ కేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేయబడిన 25 మంది యువకులు రెండు రోజులపాటు నగరంలోని వివిధ కోడంలలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ లతో పాటు కలిసి ట్రాఫిక్ నిర్వహణలో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ కార్యక్రమం యొక్క ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎసిపి మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పౌరుల వల్లనే బాధ్యతాయుతమైన సమాజం నిర్మాణం అవుతుందని తద్వారా దేశంలో అందరికీ మంచి జరుగుతుందని ఆయన వెల్లడించారు. శిక్షణ ముగింపు సందర్భంగా జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు నిత్యం చూస్తున్నామని వాటిని కొద్దిపాటి నిర్లక్ష్యము బాధ్యతారాహిత్యమని ఈ విషయాన్ని పౌరులుగా మనమందరం గుర్తించి ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ఎన్నో ప్రాణాలను బలికాకుండా కాపాడవచ్చని, మనందరి ప్రాణాలను కాపాడటానికి తమ యొక్క విధులను ఎండ వాన అనే తేడా లేకుండా ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులు నిజంగా అభినందనీయులని ఈ సందర్భంగా ఆవిడ తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో ఎంతగానో సహకరించిన ఏసిపికి ట్రాఫిక్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా శిక్షణ కోసం విచ్చేసిన యువకులను ఆవిడ ప్రత్యేకంగా అభినందించారు.శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు ప్రశంసా పత్రము మరియు మై భారత్ డైరీ పెన్నును అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్,ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.