నవతెలంగాణ – ఆర్మూర్
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం నిధులు ఇచ్చేది లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పడం అవివేకమని ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా తదితర పథకాలకు ఇందిరమ్మ పేర్లు పెడితే కేంద్రం నిధులు ఇవ్వదని బండి సంజయ్ చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు.10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుపై అనేక పథకాలు ప్రవేశపెడితే బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.గత పది ఏళ్లలో కేసీఆర్ పై మాట్లాడని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి పదేపదే మాట్లాడడం మానుకోవాలని చెప్పారు.ఇకముందు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై మాట్లాడితే సహించేది లేదన్నారు.ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమని ఆమె సవాల్ చేశారు.ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లావ్యాప్తంగా మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తనకు సంప్రదిస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎర్ర రాకేష్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, నాయకులు అశోక్, లలిత, గంగామణి తదితరులు పాల్గొన్నారు.