నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన ఎండపల్లి నాగరాజుకు( కోకిల) కళా రంగంలో గౌరవ డాక్టరేట్ లభించింది. గాయకుడిగా, నృత్య దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, రచయితగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం కళాకారుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక సంవత్సరాలుగా పల్లెల నుండి అంతర్జాతీయ వేదికల వరకు తన ఆట, పాట మాటలతో అలరించిన నాగరాజుకు కళా రంగంలో ఈ అవార్డు లభించింది. ఫేమ్ అచీవర్స్, సెలబ్రేషన్స్ సెంచరీస్ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన ఆగ్రాలో జరిగే కార్యక్రమంలో జార్జియా డిజిటల్ యూనివర్సిటీ వారు నాగరాజుకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు. ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో తెలంగాణ నుండి ముగ్గురికి ఈ అవార్డు లభించగా అందులో అంకాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు ఒకరు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక మంది ప్రముఖుల సభలకు వ్యాఖ్యాతగా, గాయకుడిగా, నృత్యదర్శకుడుగా నాగరాజు ఎన్నో ఏళ్లుగా కళా పోషణ చేస్తున్నారు. అనేకమంది శిష్యులకు ఈ రంగంలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు. మండలంలోని కోమన్ పల్లి పాఠశాల యందు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతానికి చెందిన కళాకారుడికి గౌరవ డాక్టరేట్ లభించడం పట్ల ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.