డోనాల్డ్‌ ట్రంప్‌ దుష్టాలోచన !

 Sampadakiyamకుదిరిన ఒప్పందాన్ని ఏదో ఒక సాకుతో ఉల్లంఘించేందుకు, ఆ పేరుతో పాలస్తీనియన్లను అన్నివిధాలా ఇబ్బందులకు గురిచేసేందుకు ఇజ్రాయెల్‌ చూస్తున్నది. హమాస్‌, ఇతర సంస్థల వద్ద బందీలుగా ఉన్న తమవారిని విడిపించుకొనేంతవరకు చూసి తరువాత గాజాలోనే తిష్టవేసినా ఆశ్చర్యం లేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అది సాగించిన మారణకాండలో వేలాది ప్రాణాలు పోగా గాజా సర్వనాశనమైంది. ఆ ప్రాంతాన్ని ”శుభ్రం చేసే” పేరుతో మిగిలి ఉన్న లక్షలాది మందిని అక్కడి నుంచి బయటకు పంపే దుష్ట ఆలోచనను డోనాల్డ్‌ ట్రంప్‌ ముందుకు తెచ్చాడు. ఏనాడూ అక్కడ జరిగిన దుర్మార్గాన్ని తప్పు పట్టని ఆ పెద్దమనిషి నోటి నుంచి ఇలాంటి ప్రతిపాదన వచ్చిందంటే కచ్చితంగా అనుమానించాల్సిందే. అమెరికా నేతల మాటలకు అర్థాలే వేరులే అని వేరే చెప్పనవసరం లేదు. మాతృభూమి కోసం దశాబ్దాలుగా ప్రాణాలను తృణ ప్రాయంగా పరిగణిస్తున్న పాలస్తీనియన్లు సహజంగానే ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. శుభ్రం అంటే మొత్తంగా వారిని ఆ ప్రాంతం నుంచి తొలగించటం తప్ప వేరు కాదు. పక్కనే ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌కు జనాన్ని శాశ్వతంగా పంపివేయాలన్న దుష్ట ఆలోచన దీని వెనుక ఉంది. తరువాత ఏదో ఒక సాకుతో ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌లో విలీనం చేయాలన్న ఎత్తుగడ ఉందని వేరే చెప్పనవసరం లేదు. గాజాలో జనవరి 18వ తేదీ అర్ధరాత్రి నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది, దాని ప్రకారం రెండు దఫాలుగా బందీలు-ఖైదీల విడుదల జరిగింది. అయినప్పటికీ ఉత్తర గాజాలో తమ నివాస ప్రాంతాలకు తిరిగి వచ్చేందుకు పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ మిలిటరీ జనవరి 27వ తేదీ వరకు అనుమతించలేదు. ఒక బందీని విడుదల చేయలేదంటూ సాకు చెప్పింది. నిజానికి ఆ బందీ హమాస్‌ వద్దలేడు, వేరే సంస్థ అధీనంలో ఉన్నాడు. తమకు సరైన సంకేతాలు అందని కారణంగా వదలి పెట్టలేదని వారు చెప్పారు. తరువాత వదలివేశారు. దాంతో విధిలేని స్థితిలో గేట్లు తెరవటంతో బుధవారం నాటికి మూడులక్షల మంది తిరిగి వచ్చారు. వారికి అక్కడ శిధిలాలు తప్ప మరొకటి కనిపించలేదు. ఒప్పందం ప్రకారం గాజాలో పాలస్తీనా ఖైదీలను వదలి పెడుతున్నప్పటికీ మరో ప్రాంతమైన పశ్చిమగట్టులో దాడులు జరిపి అంతకంటే ఎక్కువ సంఖ్యలో అరెస్టులు చేసి జైళ్లలో పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ రెచ్చగొట్టే చర్యలు తప్ప మరొకటి కాదు. వీటిని సహించలేక ఎక్కడైనా ప్రతిదాడులకు దిగితే వాటిని సాకుగా చూపి ఒప్పందాన్ని నీరుగార్చే దుర్మార్గం వీటి వెనుక దాగుంది.
ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత కూడా మరణించిన వారిని కలుపుకొంటే 47,317 మందిని ఇజ్రాయెల్‌ మిలిటరీ చంపివేసింది, 1,11,494 మందిని గాయపరచింది. మా జనం ఎట్టి పరిస్థితుల్లోనూ మా ప్రాంతాలను లేదా పవిత్ర స్థలాలను వదలి పెట్టరు. గతంలో జరిగిన ఘోరాలను పునరావృతం కానివ్వం అని పాలస్తీనా అధారిటీ వ్యాఖ్యానించింది. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్‌ మిలిటరీని గాజా నుంచి ఖాళీ చేయించాలని ట్రంప్‌ను డిమాండ్‌ చేసింది. ఇజ్రాయెల్‌ పథకాలు, కుట్రలకు అనుగుణంగా చేసిన ఈ ప్రతిపాదనను అమెరికా వెనక్కు తీసుకోవాలని, మారణకాండనే ప్రతిఘటించిన తాము బలవంతంగా ఇరుగు పొరుగుదేశాలకు తరలిస్తామంటే ఎలా సహిస్తామని గాజాలో అధికారంలో ఉన్న హమాస్‌ స్పందించింది. హమాస్‌తో పాటు సాయుధ పోరాటం చేస్తున్న పాలస్తీనియన్‌ ఇస్లామిక్‌ జీహాద్‌ సంస్థ కూడా ట్రంప్‌ ప్రతిపాదనను ఖండించింది. యుద్ధ నేరాలను సమర్ధించటం తప్ప వేరు కాదని పేర్కొన్నది. గాజన్లను వారి ప్రాంతాల నుంచి తొలగించకూడదన్న తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని, సర్వసత్తాక పాలస్తీనా ఏర్పాటు దిశగా ట్రంప్‌ యంత్రాంగంతో కలసి తాము పని చేస్తామని జోర్డాన్‌ ప్రకటించింది. ట్రంప్‌ ప్రతిపాదన ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాదని, అరబ్‌ దేశాలు తిరస్కరిస్తాయని రిపబ్లికన్‌పార్టీ సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ అన్నాడు. ఎన్ని ప్రాణాలు తీసినా, ఎంత విధ్వంసం జరిపినా తమ మాతృభూమిలోనే తమ బతుకు, ఉన్నదే తింటాం, ఇళ్లు లేకపోతే గుడారాల్లోనే పడుంటాం తప్ప మరొక మాటలేదంటూ తిరిగి వచ్చిన వారు చెబుతున్నారు. పరాయి పంచలకు పోయి ప్రాణాలు కాపాడుకోవాలి, బతుకీడ్వాలంటే ఎప్పుడో వెళ్లిపోయి ఉండేవారం.. అలాంటి బతుకు మాకు వద్దు అంటున్నారంటే కనీవినీ ఎరుగని మారణకాండ జరిగినా అదరలేదు, బెదరలేదు, వారి స్థైర్యం చెక్కుచెదరలేదంటే వారికి వందనాలు చెప్పాల్సిందే !