ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన పిడిఎస్యూ వీలీనా సభలో ఆదిలాబాద్ నుండి జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్, జిల్లా ఉపాధ్యక్షురాలు దీపలక్ష్మి లను పిడీఎస్ యూ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గణేష్, దీపాలక్ష్మి లు మాట్లాడుతూ.. తమకు పిడీఎస్యూ రాష్ట్ర కమిటి సభ్యులుగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యా రంగ సమస్యల పైన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యపు వైఖరి ప్రదర్శిస్తుందని, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. కార్పోరేట్ విద్యాసంస్థల గుర్తింపు రద్దుచేయాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. రానున్న రోజుల్లో విద్యారంగ సమస్యల పరిష్కారానికై అలుపెరుగని పోరాటం చేస్తామని పేర్కొన్నారు.