రాజకీయాల్లో భాష జాగ్రత్తగా వాడాలి

– గుజరాత్‌ హైకోర్టు తీర్పు రాహుల్‌గాంధీకి చెంపపెట్టు : ఎంపీ డాక్టర్‌.లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాజకీయాల్లో నేతలు భాషను జాగ్రత్తగా వాడాలనీ, గుజరాత్‌ హైకోర్టు తీర్పు రాహుల్‌గాంధీకి చెంపపెట్టులాంటిదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌ నుంచి వరంగ ల్‌కు తలపెట్టిన బైకు ర్యాలీని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలిసారి ఓ బీసీ ప్రధాని అయితే రాహుల్‌గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గాంధీ కుటుంబం వారి బానిసలు మాత్రమే ప్రధానులు కావాలని అనుకుంటున్నదని ఆరోపించారు. మౌలిక వసతుల కల్పన కోసం రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోడీ నిధులను ఇస్తున్నారని తెలిపారు. రూ. 6100 కోట్ల పనుల ప్రారంభం కోసం మోడీ వరంగల్‌కు వస్తున్నారని చెప్పారు. మంచిర్యాల-వరంగల్‌ హైవే పూర్తయితే ఆ రెండు జిల్లాల మధ్య 34 కిలోమీటర్ల దూరం, ఎన్‌హెచ్‌ 44, 45ల మీద భారం తగ్గుతాయన్నారు. జగిత్యాల-కరీంనగర్‌ వరంగల్‌ రోడ్‌ అప్‌గ్రేడ్‌ అవ్వనుందని తెలిపారు. మెగా టెక్స్‌టైల్స్‌ దేశ వ్యాప్తంగా ఏడు ఇస్తే ఒకటి తెలంగాణకు ఇచ్చారనీ, వరంగల్‌లో వ్యాగన్‌ తయారీ ఫ్యాక్టరీ భూమిపూజ చేస్తారని చెప్పారు. రోబోటిక్‌ పెయింటింగ్‌తో వ్యాగన్‌ల తయారీ అనేది తెలంగాణకు మోడీ ఇచ్చిన కానుక అన్నారు. తెలంగాణ తమ వంతు వాటా ఇచ్చినా, ఇవ్వకున్నా, నిధులివ్వడం లేదని బురద జల్లుతున్నా మోడీ సర్కారు మాత్రం వివక్ష చూపడం లేదన్నారు. మోడీ అభివృద్ధికి పెద్ద పీట వేస్తుంటే పేరు ఎక్కడ కేంద్రానికి పోతుందో అన్న భయంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారని విమర్శించారు.