గతంలో ఎవరైనా ఒక కోర్కెల పత్రమిస్తే అన్నాదురై (చూద్దాం) అనేవారట! అంటే అంతే సంగతులన్నమాట! జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పటం చూస్తే అలానే ఉంది. ఆ తగిన సమయం ఎప్పుడొస్తుందో అని చొంగకార్చుకుంటూ ఎదురుచూడాలా? ఇటీవల శ్రీనగర్ వెళ్లి జెడ్ సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విజ్ఞాపనను విలేకరులు ప్రస్తావించగా, మోడీ చేసిన ఈ వ్యాఖ్యలో చిత్తశుద్ధి కనపడలేదు. ఆ తగిన సమయమేమిటో, ఎప్పుడొస్తుందో అన్నది పెద్ద ప్రశ్నార్థకం. ‘మోడీ మాట ఇచ్చాడంటే తప్పడు’ అంటూ ఆ సమయంలో తనకు తాను కితాబు ఇచ్చుకున్న ప్రధాని – గతంలో మాట ఇచ్చి తప్పిన వైనాలెన్నో! విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చి, ఒక్కొక్కరి ఖాతాలో రూ. పదిహేను లక్షలు జమ చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఆ మాటను గంగలో కలిపారు. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల్ని పరిష్కరిస్తామని, ఏపీకి ప్రత్యేకప్యాకేజీ కేటాయిస్తామని చెప్పి కొన్నాళ్లకే తుంగలో తొక్కారు. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ విషయంలోనూ మోడీ ఇదే నాటకమాడుతున్నారు.
2019 ఆగస్టు మొదటివారంలో పెద్దఎత్తున సైన్యాన్ని మోహరించి, సమాచార సాంకేతిక వ్యవస్థను స్తంభింపజేసి, జమ్మూకాశ్మీర్ రాష్ట్రహోదాను, రాజ్యాంగంలోని 370, 35 (ఎ) అధికరణాలను ఒక్క కలం పోటుతో రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష చర్య ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కాశ్మీరీ ప్రజలు మొత్తాన్ని గంపగుత్తగా ఉగ్రవాదులన్నట్టుగా చిత్రీకరిస్తూ, నెలల తరబడి తీవ్ర నిర్బంధం విధించిన వైనం సమీప భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరగనిది. బయటికి చెప్పకున్నా మత ప్రాతిపదికన రాష్ట్రాన్ని భౌగోళికంగా విభజించి, తమ రాజకీయ బలాన్ని పెంచుకోవటానికి కాషాయశక్తులు చేసిన నిర్వాకం ప్రపంచ విదితమే! చారిత్రక నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కులను తుత్తునియలు చేసి, కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు నిలువునా పాతరేసిన మోడీ ప్రభుత్వం .. అక్కడ వివిధ పార్టీల నాయకుల పైనా, ప్రజలపైనా నిరంకుశంగా వ్యవహరించింది. ప్రజల భూముల పరిరక్షణకు ఉన్న ప్రత్యేక చట్టాలనూ రద్దు చేసింది. కార్పొరేట్లు, ఇతర సంపన్నులూ కాశ్మీర్ భూభాగంలో సులభంగా పాగా వేసేందుకు వీలు కల్పించింది. ప్రజాస్వామాన్ని ఖూనీ చేసింది. ఆఖరికి సుప్రీంకోర్టు ఆదేశంతో గతేడాది సెప్టెంబర్‌లో శాసనసభకు ఎన్నికలు జరిపారు. ఆ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ఎన్ని పన్నాగాలు పన్నినా నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. లోక్‌సభ ఎన్నికల కన్నా ఐదు శాతం ఎక్కువ పోలింగుతో తమ ఆకాంక్షను, బీజేపీ వ్యతిరేకతనూ బలంగా వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడచిపోయినా, మోడీ ప్రభుత్వం ప్రజాతీర్పు పట్ల పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తోంది.
జమ్మూకాశ్మీర్ ప్రత్యేక రక్షణ చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం – టీ 33 సొరంగమార్గంలో రైల్వేలైను వేయటాన్ని గొప్పగా చెప్పు కుంటోంది. ఇకపై దేశంలోని అన్ని ప్రాంతాల నుంచీ ఢిల్లీ మీదుగా కాశ్మీర్‌కు నేరుగా ప్రయాణం సాగించవచ్చని చెబుతోంది. ఈ రైల్వేలైనుపై జనవరి 26న వందేభారత్ రైలు తొలి ప్రయాణం చేయటానికి సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. రోడ్డు, రైలు రవాణా సదుపాయాలను మెరుగుపర్చటం అభ్యంతరకరం కాదు గానీ, ప్రజల న్యాయబద్ధమైన హక్కులను పునరుద్ధరించకుండా రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఉపన్యాసాలు దంచటం కచ్చితంగా అసమంజసం.
జమ్మూకాశ్మీర్‌లో ప్రజలను అనుమానించే, వేధించే చర్యలు ఇప్పటికీ ముమ్మరంగా సాగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ స్వయంగా చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, శాసనసభకూ ఉన్న అధికారాలు, అవకాశాలూ పరిమితం. పోలీసులను నియంత్రించే, నిర్దేశించే కనీస అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు.
ఈ నేపథ్యంలో అక్కడి బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలూ శాసనసభలో చేసిన రాష్ట్ర హోదా పునరుద్ధరణ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించాలి. కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక గుర్తింపులను పట్టించుకోవాలి. ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ లెఫ్టినెంట్ గవర్నరు రూపంలో సాగుతున్న కేంద్ర ప్రభుత్వ పెత్తనానికి తక్షణం స్వస్తి చెప్పాలి. పొరుగు దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్న సున్నితమైన ప్రాంతంలో రాజకీయ క్రీడలు ప్రమాదకరం. కాబట్టి, వెంటనే జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్రహోదాను పునరుద్ధరించటం ప్రజాస్వామికం.