థ్రెడ్స్‌పై కేసు వేస్తాం : ట్విట్టర్‌

వాషింగ్టన్‌ : మెటా ఆవిష్కరించిన థ్రెడ్స్‌ తమను కాపీ చేసిందని ట్విట్టర్‌ ఆరోపించింది. చట్టవిరుద్ధంగా తమ సమాచారాన్ని వినియోగించుకుని నకలు యాప్‌ను తయారు చేసిందని పేర్కొంది. దీనిపై తాము కేసు వేయనున్నామని ట్విట్టర్‌ హెచ్చరించింది. ఈ మేరకు ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ న్యాయవాది అలెక్స్‌ స్పిరో మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు లేఖ రాశారు. ”మేధోపరమైన అంశాల్లో ట్విటర్‌ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ట్విటర్‌ వాణిజ్య రహస్యాలను, ఇతర రహస్య సమాచారాన్ని ఉపయోగించకుండా మెటా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం. లేదంటే దీనిపై న్యాయపరంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ట్విట్టర్‌ మాజీ ఉద్యోగులను మెటా నియమించుకుంది. ఆ ఉద్యోగులంతా ట్విట్టర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలు, ఇతర అత్యంత గోప్యమైన సమాచారన్ని కలిగి ఉన్నారు” అని స్పిరో పేర్కొన్నారు. ఆరోపించారు. ఈ పరిణామాలపై ట్విట్టర్‌ బాస్‌ ఎలన్‌ మస్క్‌ స్పందిస్తూ.. ‘పోటీ మంచిదే.. మోసం కాదు’ అని అన్నారు. థ్రెడ్స్‌ వచ్చిన 24 గంటల్లోనే దాదాపు 5 కోట్లకు పైగా డౌన్‌లోడులు నమోదయ్యాయి.