ఒకటో తేదీనే వేతనాలివ్వాలి

– యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విద్యుత్‌ రంగంలో పనిచేస్తున్న ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఈశ్వర్‌రావు, వి.గోవర్ధన్‌ డిమాండ్‌ చేశారు. ప్రజావసరాలకు, కర్మాగారాలకు, రైతులకు నాణ్యమైన కరెంట్‌ను అందించడంలో ఉద్యోగులు, కార్మికుల పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో తెలంగాణ విద్యుత్‌ సంస్థకు దేశంలోనే మంచి పేరు ఉందని తెలిపారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు పదో తేదీన, ఇంజినీర్లకు 15వ తేదీన వేతనాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు, ఇంజినీర్లకు వేర్వేరు తేదీల్లో వేతనాలు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. ఈఎంఐలు, బ్యాంక్‌ లోన్స్‌, కిరాణం, చెక్‌ బౌన్స్‌లు వంటి అనేక సమస్యలను వారు ఎదుర్కొంటున్నారని వాపోయారు.