కర్తవ్యపథం

Missionఒక పార్టీ మహాసభ, మహా అయితే వారి శ్రేణులకు కర్తవ్య బోధ చేసి, దిశా నిర్దేశం చేయొచ్చు. కాని, ఇక్కడ సీపీఐ(ఎం) శ్రేణులే కాదు, రాష్ట్రంలోని కష్టజీవులు ఆ పార్టీ 4వ మహాసభ ఏమి చెప్తుందోనని, ఏ ఫలితాలు వెలువడతాయోనని శ్రద్ధగా ఎదురుచూశారు. మరీ ముఖ్యంగా మోడీ సర్కార్‌ కార్పొరేట్ల కొమ్ముకాస్తూ బరితెగిస్తున్న వేళ, కార్మిక చట్టాలను చుట్టచుట్టి నాలుగు కోడ్‌లుగా రూపొందిస్తున్న సమయాన ‘కార్మికుల’ జిల్లా సంగారెడ్డి జిల్లా కార్మికవర్గం అక్కడక్కడా మిణుకుమిణుకుమంటున్న బీఎంఎస్‌ యూనియన్ల సభ్యులతో సహా ఏ పోరాటాలకు పిలుపునిస్తుందోనని వొళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూడటంలో ఆశ్చర్యమేముంది? పదులుకాదు, వందలుకాదు, వేలాది మంది కార్మికులు తమకొస్తున్న దాంట్లో కొంత, మరికొందరు తమ జీతమంతా ఈ మహాసభ కోసం విరాళమివ్వడం ప్రస్తుతం వినిమయతత్వం కరాళ నృత్యం చేస్తున్న వేళ సామాన్య విషయం కాదు. ఆ జిల్లా ప్రతినిధి ఈ విషయం చెప్పినపుడు ప్రతినిధుల హర్షధ్వానాలు మిన్నంటాయి. వారిని తన్మయుల్ని చేసిందీ విషయం.
అంతేనా?! ఒకసారి ఢిల్లీని కమ్ముకుని మోడీ మెడలు వంచిన హాలికులు మరోసారి గడ్డకట్టే ఈ హేమంతంలో కార్పొరేట్ల సేవకై తపిస్తున్న మోడీ సామ్రాజ్యంపై ఉద్యమాలను ఎక్కుపెడు తున్నది రైతాంగం. ఆ హాలికుల అనుయాయులు తెలంగాణలో తమ కోసం సీపీఐ(ఎం) నాలుగవ మహాసభ ఏ నిర్ణయాలు చేసిందోనని పరిశీలించి చూస్తున్నారు. ”దళితులు, వ్యవసాయ కార్మికులు, పేద రైతుల సమస్యలపై వర్గపోరాటాల”కు పదును పెట్టాలనే కర్తవ్యం సీపీఐ(ఎం)ను రాష్ట్రంలో అగ్రభాగాన నిలుపుతుందనడంలో సందేహం లేదు.
సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభ గత మూడేండ్ల కాలంలో చేసిన కార్యకలాపాలను సమీక్షించుకుంటుంది. దానిలోని లోటుపాట్లను సరిదిద్దుకుంటుంది. తదుపరి మూడేండ్లకు అవసరమైన ఎత్తుగడలను రూపొందించు కుంటుంది. సీపీఐ(ఎం) అఖిల భారత పార్టీ కావున, అఖిల భారత విధానంలో అంతర్భాగంగానే ఈ ఎత్తుగడలుంటాయి. ఈ విషయాన్ని పొలిట్‌బ్యూరో నేతలంతా స్పష్టం చేశారు. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలపై మొదటి నుండీ పోరాడుతున్న సీపీఐ(ఎం), బీజేపీ వ్యూహాన్ని సరిగానే అర్థం చేసుకుంది. కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏగా గెల్చిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని బీజేపీలో చేర్చుకుని రాజీనామా చేయించి ఉప ఎన్నిక తెచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గనుక గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోయి ఉండేది. అన్నేళ్ల రాజకీయ వైరంతో సంబంధం లేకుండా బీఆర్‌ఎస్‌ను బలపరుస్తామని సీపీఐ(ఎం) ప్రకటించింది. అందుకు సీపీఐ కూడా చేదోడువాదోడుగా నిలిచింది. ఇది రాష్ట్ర రాజకీయ పరిణామాలను ఒక మలుపు తిప్పాయి.
ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం మినహా మిగిలినవి సరిగా అమలుకావడంలేదు. ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తిని పక్కదారులు పట్టించేందుకు రేవంత్‌ సర్కార్‌ ఉధృతమైన ప్రయత్నాలు చేస్తున్నది. ఈ అసంతృప్తిని ఉపయోగించుకునేందుకు మరోపక్క బీజేపీ కేంద్ర మంత్రులతో సహా ఢిల్లీ నుండి గల్లీ నేతల దాకా రంగంలోకి దిగారు. అందుకనే తెలంగాణలో పైన జరిగే ఆర్భాటపు హడావుడేగాక చాపకింద నీరులా విస్తరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని నిలువరించడం కీలక కర్తవ్యంగా మహాసభ భావించింది. బీజేపీకొస్తున్న ఓట్లు, దాని సీట్లకు సంబంధం లేకుండా ఈ భావజాల విస్తరణ కొనసాగుతోంది. దాన్ని ఎదుర్కొనేందుకు సకల సన్నద్ధం కావాలని మహాసభ నిర్ణయించింది. కానీ రాష్ట్రంలో ముంచుకొస్తున్న మతోన్మాద ప్రమాదం గురించి ఇటు కాంగ్రెస్‌ గానీ, అటు బీఆర్‌ఎస్‌కు గానీ అర్థమైనట్లు కన్పడదు. ‘నువ్వు బీజేపీకి చెంచావి’ అని బీఆర్‌ఎస్‌ వారు కాంగ్రెస్‌ని తిడితే, ‘నువ్వే బీజేపీకి బీ టీమ్‌వి’ అని కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ను తిడ్తున్నది. కానీ ఇద్దరూ కలిసి రాష్ట్రంలో బీజేపీకి ఫీల్డు వదిలేస్తున్నామనే ధ్యాసే లేదు.
ఈ నేపథ్యంలో వామపక్ష ప్రజాతంత్ర, సామాజిక శక్తులన్నింటిని కూడగట్టాలని సీపీఐ(ఎం) నాలుగవ మహాసభ పిలుపునిచ్చింది. ఆ దశలో ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలను నిర్మించటానికి నూతనోత్సాహంతో ముందుకు పోతామని కొత్త కమిటీ ప్రకటించడం ఆహ్వానించాల్సిన పరిణామం.