న్యూఢిల్లీ: గౌతం అదానీకి చెందిన కీలక కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభాలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఏకంగా 97 శాతం పతనమై రూ.58 కోట్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.1,888 కోట్ల నికర లాభాలు సాధించింది. డాలర్‌తో ఆస్ట్రేలియం మారకం విలువ పడిపోవడంతో అక్కడి మైనింగ్‌లో రాబడులు తగ్గినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ పేర్కొంది. క్రితం క్యూ3లో కంపెనీ రెవెన్యూ 9 శాతం తగ్గి రూ.22,848 కోట్లుగా చోటు చేసుకుంది. పేలవ ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఓ దశలో ఆ కంపెనీ షేర్ 9 శాతం మేర పతనమయ్యింది. తుదకు 2.85 శాతం తగ్గి రూ.2,252.65 వద్ద ముగిసింది.