నవతెలంగాణ – పటాన్ చెరు
పరిశ్రమ 5.0 దిశగా పయనిస్తున్న ఈ తరుణంలో వ్యాపార ప్రక్రియల డిజిటలైజేషన్ అపారమైన మార్పులకు గురైందని, ఆ మార్పును అందిపుచ్చుకుని విజయ తీరాలను చేరుకోవాలని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్బీ) సెంటర్ ఫర్ కేస్ స్టడీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి సూచించారు. జీఎస్బీలోని మార్కెటింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘వ్యాపార వృద్ధి కోసం సామాజిక-వాణిజ్యంలో కత్రిమ మేధస్సును ప్రభావంతంగా వినియోగించడం’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల యాజమాన్య వికాస కార్యక్రమం (ఎండీపీ)ని గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ సహా ఆటోమేషన్, రోబోటిక్స్ సాంప్రదాయ వ్యాపార నమూనాలను సమూలంగా మారుస్తున్నాయన్నారు. ఆయా అంశాలపై మంచి అవగాహన కల్సించేందుకు ఏర్పాటుచేసిన ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.వ్యవస్థాపకులు, వ్యాపార నాయకులు, మార్కెటర్లు, మేనేజర్లు, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా, అనధికారిక రంగాలలో పనిచేస్తున్న వారితో సహా విభిన్న వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ యాజమాన్య వికాస కార్యక్రమాన్ని రూపొందించారు. ఏఐ వారి సామాజిక-వాణిజ్య వ్యూహాలను ఎలా విప్లవాత్మకంగా మార్చగలదో, సంబంధిత సంస్థలలో స్థిరమైన వృద్ధిని వారు ఎలా సాధించగలరో ఈ కార్యక్రమంలో వివరిస్తారు. వ్యాపార కార్యకలాపాలను వృద్ధి చేయడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్జానాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగనున్నది. ఇందులో పాల్గొన్న వారికి ఆయా అంశాలపై విస్తృత అవగాహన ఏర్పరచడమే గాక, ఇతర సంస్థల ప్రతినిధులతో పరిచయాలు పెంచుకోవడానికి కూడా ఉపకరిస్తోంది.ఈ ప్రారంభోత్సవంలో ఎండీపీ నిర్వాహకుడు ప్రొఫెసర్ యు.దేవీప్రసాద్, మార్కెటింగ్ చైర్ డాక్టర్ దేవిక రాణి శర్మ, పలువురు అధ్యాపకులు, దాదాపు 40 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.