ఆర్ పి పట్నాయక్ కథ, రచనా దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సతీష్ నిర్మించిన చిత్రం ‘కాఫీ విత్ ఏ కిల్లర్’. ఆహా ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ, ‘రెండు గంటలపాటు మిమ్మల్ని ఎక్కడికి కదలకుండా చేసే ఒక ప్రత్యేకమైన చిత్రంగా ఉండబోతుంది. తిరుమల నాగ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. శ్రీనివాస్ రెడ్డి పాత్ర ఎంతో అద్భుతంగా ఉండబోతుంది’ అని తెలిపారు. ‘హీరో, హీరోయిన్ లేకుండా కథే హీరో అయితే ఎలా ఉంటుందనే కోణంలో ఈ కథ రాశాం. హీరో, హీరోయిన్లు ఉండరు..కానీ విలన్ ఉంటాడు. ఈ సినిమాను మొత్తం దగ్గరుండి చూసుకున్నది మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్. థియేటర్లలో రిలీజ్ చేయమని చాలా మంది అడిగినప్పటికీ కావాలనే ఈ సినిమాని ఆహా ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నాం’ అని దర్శకుడు ఆర్ పి పట్నాయక్ చెప్పారు.