యాసంగి సీజన్ రైతులకు అరిగోసను చూపిస్తున్నది. వ్యవసాయం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకటేమిటీ అనేక కష్టాలు రైతన్నలకు సవాల్‌గా నిలుస్తున్నాయి. ఎప్పటిలాగే ప్రయివేటు వడ్డీల బారీన పడుతున్నారు. అప్పుల తిప్పలు తప్పడం లేదు. రైతు సంక్షేమ పథకాల అమలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కిలా ఉంది. ఒక్కో రైతుకు రూ.12 వేలకు లోబడి రుణమాఫీ చేయడానికి రూ.49,500 కోట్లు అవసరం. కేంద్ర సర్కారు సహాయ నిరాకరణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. అలాగే సాగునీటి సమస్యలూ వేధిస్తున్నాయి. లక్షల కోట్లు ఖర్చుపెట్టిన తర్వాత కూడా సాగునీటి ఇబ్బందులు ఇంకా తలెత్తడం, కొనసాగుతుండటం ఆందోళనకరం. భూగర్భజలాలు పడిపోవడం, మోటార్లు కాలిపోవడం సర్వసాధారణమైంది. బోర్లు ఎండిపోయి, మోటార్లు కాలిపోయి పంటలు నీటి ఎద్దడికి గురవుతున్నాయి. సకాలంలో ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతు కాక, లోవోల్టేజీ సమస్యలతో రైతులు కష్టాలకడలిలో ఉండిపోతున్నారు.
యాసంగి నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ముందస్తుగా సాగుచేయడంతో ప్రత్యేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరవరు. ఒకవేళ తెరిచినా పనితీరు అంతంతే. కనీస మద్ధతు ధరల కంటే తక్కువకు ప్రయివేటు మిల్లర్లకు అమ్మి నష్టపోవాల్సి వస్తున్నది.
ఆరుగాలం పడ్డ శ్రమను కోల్పోతారు. దోపిడీకి గురయ్యే పరిస్థితి. కేంద్రాలను కొద్దిరోజులు ఉంచి ఆ తర్వాత మూసేస్తారు. ఆలస్యంగా వచ్చిన పంటలను చచ్చినట్టు బయట అమ్ముకోవాల్సిందే. మరోదారిలేదు. దీంతో కనీస మద్దతు ధరకు ఇరవై శాతం మేర తక్కువకు విక్రయించాల్సి వస్తున్నది.ప్రభుత్వ ప్రణాళిక సరిగ్గా లేకపోవడంతో నష్టం రైతుల నెత్తిమీద పడుతున్నది. వేరుశెనగ రైతులకు కొనుగోలు కేంద్రాలు లేక, మద్దతు ధర అందక అవస్థలు తప్పడం లేదు. సహకరించడంలో సర్కారీ మార్క్‌ఫెడ్ విఫలమవుతున్నది. సాధారణంగా అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు యాసంగి సీజన్ ఉంటుంది. మొత్తం పంటల్లో డెబ్బయి ఎనిమిది శాతం మాత్రమే ఖాస్తులోకి వచ్చింది. వరిసాగు తగ్గింది. ఇతర ఆహార ధాన్యాల సాగు 79 శాతానికి పడిపోయింది. వ్యవసాయానికి గానీ, రైతులకుగానీ సాయం సమయానుకూలంగా చేరడం లేదు. రైతు భరోసా దగ్గర నుంచి రుణమాఫీ వరకు అమల్లో విపరీతమైన జాప్యం చోటుచేసు కుంటున్నది. రుణమాఫీ అరవైశాతం మంది రైతులకే వర్తిస్తుండగా, మిగిలిన వారికి ఉత్తచెయ్యే. అలాగే కొంత మంది రైతులకు రెన్యూవల్ చేయకపోవడంతో కొత్తగా సహకార అప్పులు సైతం పుట్టడం లేదు.
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సైతం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు రుణాలి వ్వడంలో తాత్సారం చేస్తున్నది. 2023 నుంచి ఇప్పటివరకు నాలుగు వందల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు మీడియాలో వార్తలొచ్చాయి. సగటున రోజుకో రైతు తనువు చాలిస్తుండటం ఆందోళనతోపాటు ఆవేదన కలిగించేదే. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రైతన్నలవి ఆత్మహత్యలు కాదనీ, సర్కారీ హత్యలేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మెదక్, ఆదిలాబాద్, హన్మకొండ, మహబూబాబాద్, వరం గల్, జనగామ, నల్లగొండ, సిద్ధిపేట, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో రైతులు విగతజీవులవు తుండటం దురదృష్టకరం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ‘రైతుడిక్లరేషన్’లో రుణమాఫీ, రైతుభరోసా, కౌలురైతులతోపాటు భూమిలేని నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తానంది. కాగా ఈ హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు వెనుకపడిందనే చెప్పొచ్చు.
ఈ పరిస్థితుల్లోనే ప్రతిపక్షాలు అన్నివైపులనుండి ఆరోపణలు, విమర్శలు మూటకట్టుకుంటున్నది.ప్రాజెక్టుల నిర్వహణ లోనూ నిర్లక్ష్యం కనిపిస్తున్నదని సాగునీటిరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు యాసంగినీ ప్రభావితం చేస్తున్నాయి. నియంత్రణలో వ్యవసాయ శాఖ వైఫల్యం కండ్లకు కడుతున్నది.
మార్కెట్‌లో సరైన ధరల్లేక రైతులు నల్లగొండ, యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ రైతులు రోడ్లమీదకొచ్చి ఆందోళనలు, ధర్నాలకు దిగారు. ఎప్పటిలాగే కేంద్రంలోని మోడీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది ఏండ్ల తరబడి చోద్యం చూస్తున్నది. ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అనేలా ప్రవర్తిస్తున్నది. ఫసల్‌బీమా యోజనలో పసలేకుండా పోయింది. ఈ పథకం అక్కరకురాని చుట్టమైంది. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డును మంజూరుచేసినా, పసుపు పంటకు కనీస మద్దతు ధరను కేంద్రం ప్రకటించక పోవడం గమనార్హం.