
నవతెలంగాణ – మునుగోడు
ప్రజా గాయకులు, ప్రజా యుద్ధనౌక గద్దర్ ను అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ని మంత్రి పదవి నుంచి బర్తరప్ చేయాలని, తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి డిమాండ్ చేశారు. స్థానిక మండల కేంద్రంలో డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాతను నిండు పార్లమెంటులో అవమాన పరుస్తూ మాట్లాడటం మనమందరం చూసాం. ఇప్పుడు మరో కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రజా గాయకుడు, బలహీనవర్గాలను ఏకం చేసి ఎన్నో పోరాటాలు నిర్వహించి ప్రజా యుద్ధనౌకగా పేరు పొందిన గద్దర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. గద్దర్ తన జీవితంలో ఎన్నో నంది అవార్డులను సైతం వదిలేసారని పద్మశ్రీ అవార్డు లాంటివి వారికి అవసరం లేదని గద్దర్ పేరే ఒక అవార్డు లాంటిదని గద్దర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండటమే కాకుండా భారత దేశంలో అట్టడుగు ప్రజల గుండెల్లో దాగి ఉన్న గొప్ప వ్యక్తి అని, మహనీయుడని కొనియాడారు. బిజెపి వాళ్లు దేశంలో దళితుల మీద, అట్టడుగు వర్గాల ప్రజల మీద ప్రత్యక్ష దాడులు చేయడమే కాకుండా ఆ వర్గాలకు చెందిన మహనీయులను మీద కూడా రాజకీయంగా దాడి చేయడం సరైన పద్ధతి కాదని ఇలాంటి వైఖరినీ బిజెపి నాయకులు మానుకోకపోతే ఈ మతతత్వ, మతోన్మాద పార్టీ అయిన బీజేపీ నీ భౌతికంగా ప్రజలకు దూరం చేసి బొంద పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని బిజెపి నాయకులు మహనీయుల పట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు, మరోసారి మహనీయుల పట్ల ఇలాంటి వైఖరి పునరావృతం అయితే ఎక్కడికి అక్కడ అడ్డుకొని బిజెపి వాళ్లను విడదీసే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. ఇప్పటికైనా గద్దర్ మీద అసభ్యకరంగా మాట్లాడిన బండి సంజయ్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కట్ట వెంకన్న, నాయకులు శివ, నరేష్, ప్రేమ్ సాగర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.