మహావిషాద కారకులెవ్వరు!

Many tragic factors!ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో సామాన్యభక్తులు అంతమంది మరణించడం, క్షతగాత్రులవడం మహా విషాదాన్ని నింపింది. కుంభమేళాలు, జాతరలు, పుణ్యస్నానాలు కొత్తగా జరుగుతున్నవేమీకాదు. కానీ వీటిపైనున్న విశ్వాసాలు మరింత పెంచి మూఢత్వంలోకి తీసుకువెళ్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ఎవరి నమ్మకాలు వారికుంటాయి. అయితే ప్రభుత్వమే ఆ నమ్మకాలను ప్రచారం చేసి ప్రజల్ని పెద్దఎత్తున సమీకరించడం, అలాంటి సమూహ సమ్మర్థంలో తొక్కిసలాటలు చోటుచేసుకుని సామాన్యులు బలి కావటం అత్యంత విషాదకరం. దాదాపు 40కోట్ల మంది ప్రజలు కుంభమేళాకు వస్తారని అంచనావేసిన ప్రభుత్వం దానికి సరిపడ ఏర్పాట్లు, సౌకర్యాలు, జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇలాంటి మతసమీకరణ క్రతువును తమ రాజకీయ స్వార్థానికి వినియోగించుకోవాలని చూస్తున్నవారూ ఈ నష్టానికి బాధ్యులు.
ఒకవైపు అమెరికా ఆర్టిఫిషియల్‌ ఇంటిజెన్స్‌ కనుగొని శాస్త్ర సాంకేతికతతో ముందుకుపోతుంటే, మరోవైపు చైనా ‘డీప్‌సీక్‌’ తయారు చేసి తన విజ్ఞానానికి పదునుపెడుతున్నది. మనం మాత్రం కాలుష్యపు నీటిలో మునగడం కోసంప్రాణాలనూ పణంగా పెట్టడానికి ముందుకురుకుతున్నాం. పతనం అంచున నిలబడ్డాం. మునగడానికి మనకో మతవిశ్వాసం ఉంది. ముంచడానికొక రాజకీయమూ ఉంది. మునిగి చావడానికి జనాలూ ఉన్నారు. దేవుడు అంటే అందరినీ సమంగా చూస్తాడని కదా అనుకునేది! కానీ వ్యవహారం అలా జరగదు. భక్తుల్లోను వి.ఐ.పి భక్తులూ, వి.వి.ఐ.పి భక్తులూ ఉన్నారు. ఏర్పాట్లలోనూ తేడాలు. సన్యాసులకు, దిగంబర సాధువులకు, సెలబ్రెటీలకు ప్రత్యేక సదుపాయాలు, రక్షణలు. కానీ సాధారణ భక్తుల గోడును వినేవాడెవడు! చివరికి ఆ దేవుడూ వినడు! అందుకే అప్పుడెప్పుడో రచయిత చలం ఇలా అంటాడు. ”మీ దేవుడు మీ డబ్బుకి దాసుడు. మీ నంగి పూజలకి, స్వార్థ ప్రార్థనలకీ వశ్యుడు. దొంగభక్త పరాధీనుడు” అని. పాపాలను పోగొట్టే దేవుడు ప్రాణాలను కాపాడలేడా! ఈ సందర్భంగా థేరీగాధల సంకలనంలోని రెండున్నర వేలయేండ్ల క్రితపు బౌద్ధ భిక్షుని పాకృతగాథ గుర్తుకువస్తుంది. ఒకదాసి కూతురు నదిలో నీటి కోసం వెళ్లగా అక్కడ ఓ బ్రాహ్మణుడు నదిలో మునగడం చూసి- మేము యజ మానురాలి తిట్లకు, శిక్షలకు భయపడి నదిలోకి రాక తప్పలేదు. కాళ్లూ చేతులు వణికే చలిలో నీవు దేవునికి భయపడి నీటిలో మునుగుతున్నావెందుకు అని ప్రశ్నిస్తుంది. అప్పుడా బ్రాహ్మణుడు నదీస్నానం వల్ల సర్వపాపాలూ హరిస్తాయి. దుష్కర్మల నుండి విముక్తి లభిస్తుంది అంటాడు. దానికి ఆ దాసీ కూతురు అయితే కప్పలు, మొసళ్లు, నీటిపాములు, జలచరాలన్నీ స్వర్గార్హత పొందిన పుణ్యజీవులా? దొంగలు, దుర్మార్గులు, హంతకులు, ఈ నీరు నెత్తిన చల్లుకుంటే వారి పాపాలు తొలిగి పుణ్యాత్ములవుతారా? నీటికి పాపాలను తొలగించే శక్తుంటే, పుణ్యాలనూ కూడా తొలగిస్తుంది. అన గానే నేను తప్పుచేశాను. నన్ము మీరు ఉత్తమ మార్గంలోకి మళ్లించారని బ్రాహ్మణుడు చెబుతాడు.అంత తార్కికంగా ఆలోచించే ప్రజల వారసులు నేడు పర్వదినాల పేరిట నదుల్లో మునగడానికి వెళ్లి మరణిస్తున్నారు.
1954లో జరిగిన మహాకుంభమేళా తొక్కిసలాటలోనూ వేయిమంది జనులు చనిపోయినప్పుడు అంబేద్కర్‌ అన్నమాటలు నేటికీ వర్తిస్తాయి. ”ప్రపంచంలో ఏ దేశంలో కూడా మతం పట్ల ఇంత అంధభక్తి, వెర్రితనం ఉండదు. పాలకులు ఏం చేస్తున్నారు? పేరు అధికారం కోసం జనాల మూఢ నమ్మకాలని వాడుకుంటున్నారు. మతం కోసం ప్రజలు చనిపోతున్నారు. ఎందుకు? వారు గంగలో స్నానం చేస్తే తమ పాపాలు తొలగిపోతాయని నమ్మేలా చేయబడుతున్నారు.దీనికంటే అజ్ఞానం ఏముంటది?” అని వేలెత్తి చూపాడు. అయినా మనం మారలేదు. ‘భక్తి రసం తెప్పలుగా మారుతోంది. డ్రయినేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది’ కూడా. అంతేకాదు, నేడు భక్తిని, విశ్వాసాన్ని, మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చి, మొత్తం భారతదేశ ఆధునిక స్వభావాన్నే మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ కుంభమేళాలోనే ఫిబ్రవరి2 వసంత పంచమి ఎంతో ప్రాశస్త్యం కలదని, కావున ఆరోజున భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికి అవసరమయిన నూతన మనువాద రాజ్యంగాన్ని ఆవిష్కరించబోతున్నామని, సనాతన ధర్మ పండితులు దీన్ని తయారు చేశారని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ గ్రంథాన్ని అందిస్తామని హిందూ రాష్ట్ర సంవిధాన నిర్మాణ కమిటీ వెల్లడించింది. అంటే లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక రాజ్యాంగాన్నే మార్చే ఆలోచనలు కుంభమేళాలో సామాన్యభక్తుల మృత్యుఘోషతో పాటు దృశ్యమవుతున్నాయి. ఇదీ వీరి భక్తిలోని ఆధిపత్య అధికార అనురక్తి. శాస్త్రీయ ఆలోచనలకు, దేశ ప్రగతికి ఆటంకాలుగా పరిణమిస్తున్న ఈ విషయాల పట్ల ప్రజలు చైతన్య యుతంగా ఆలోచించాలి. జరుగుతున్న విషాదాలకు, రాబోయే ప్రమాదాలకు కారకులను గమనించాలి.