– తెలంగాణ ఊసే లేని బడ్జెట్
– ఇబ్రహీంపట్నంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రతినిధి
కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భడ్జెట్ పై సీపీఐ(ఎం) శ్రేణులు భగ్గుమన్నాయి. కార్పొరేట్ల బడ్జెట్ గా అభివర్ణించాయి. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ జంగయ్య మాట్లాడుతూ… కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ బడా కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడే బడ్జెట్ గా ఉందన్నారు. సామాన్య ప్రజలకు నేరుగా లబ్ది కల్పించేందుకు ఎటువంటి ప్రసంగమూ, పథకం లేదని విమర్శించారు. వేతన జీవులను పెద్దఎత్తున సంతృప్తి పరుస్తామని చెప్పి ముష్టి వేసినట్లు ఊరట కల్పించారన్నారు. దేశ ప్రజల బడ్జెట్ అని ప్రధాని మోడీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా వ్యతిరేకంగా బడ్జెట్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐఏం ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నామన్నారు. వ్యవసాయ ఎరువులపై సబ్సిడీలో కోత విధించడం సిగ్గుచేటన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టు 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చిన ద్రవ్యోల్బణం, పెరిగిన ధరలతో పోలిస్తే ఇది తక్కువేనన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపు లేదన్నారు. ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ ఎన్నికలలో లబ్ధి పొందడానికి ఈ బడ్జెట్ ను పెట్టారు. రాష్ట్రంలో ఇద్దరు బిజేపి మంత్రులు, 8మంది పార్లమెంట్ సభ్యులు వున్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టలేకపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన హామీలు గాలికొదిలేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి సీ హెచ్ బుగ్గరాములు, మున్సిపల్ కార్యదర్శి ఎల్లేశ, మండల నాయకులు టీ నర్సింహ, పురుషోత్తం, వీరేశం, స్వప్న, యాదగిరి, వంశీ, తరంగ్, చరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.