అమ్మ లేని ఇల్లు

ఎప్పుడూ ఏదో ఒక చోట
ఒక చప్పుడు
చిన్న కదలిక ఉండేది,
ఇప్పుడు ఎంత వెదికినా
ఖాళీ కనబడుతోంది
కారణం…
అది అమ్మ లేని ఇల్లు!

ఇంట్లో ఒక దీపంలా
ఇంటికి ఒక ప్రాణంలా
ఒకే చోట ఉన్నా
గోడలను దాటుకుని వెలుగునిస్తుంది,
ఒక చిన్న పిలుపుతో
ఇంటి గుండెకు స్పందననిస్తుంది!

మంచాన మూలనపడ్డా
మూలమూలనా తానున్నానని
బతుకు మూలాలను గుర్తుచేస్తుంది,
నీకేం తెలియదు
ఊరుకో అన్నా
మాటలు నేర్పింది
నేనే కదా అని
మౌనంగా ఉండిపోతుంది!

పిల్లలకు ఆటబొమ్మలా
విసుగులేని యంత్రమై నడుస్తుంది,
వాళ్ళ చేష్టలతో
తనను తాను నిలబెట్టుకుంటుంది,
గుండె చెరువైనా
కన్నీటి అలల సవ్వడితో
మనసు తీరాలను తాకుతుంది!

అవసరం తీరాక
మనుషులైనా వస్తువులైపోతారని తెలిసినా
ప్రతి వస్తువునూ జాగ్రత్త పరుస్తుంది,
తన ప్రాణం వెళ్లిపోతున్నా
తన వాళ్ళ ప్రాణం కోసం పాకులాడుతుంది!

తన కాలి అడుగులతోనో
తన చేతి గుర్తులతోనో
నిండు కుండలా ఉండే
ఆ ఇల్లు
అమ్మలేని తనంతో నిండిపోయింది!

వెలుగు లేకుంటే
చీకటి కూడా భారంగా ఉంటుంది,
మనుషులు లేకుంటే
కాలం కూడా తనను తాను
లెక్కబెట్టుకుంటుంది,
కన్నీరు కూడా
ఆవిరైపోకుండా గడ్డకట్టుకుపోతుంది!

అమ్మ లేని ఇల్లు
ఊపిరి లేక దిక్కులేనిదయ్యింది,
హదయాన్ని పారేసుకున్న దేహంలా
నిస్తేజమయ్యింది!
– పుట్టి గిరిధర్‌
9494962080