అతడి ‘అలికిడి’ సమాజంతో అల్లుకున్న భావోద్వేగాల సందడి

His 'alikidi' is a buzz of emotions intertwined with societyభూమి తన చుట్టు తాను తిరుగుకుంట, సూర్యుని చుట్టు తిరుగుతుంటది కదా! కార్తీక రాజు ఒక భూమి లెక్క మారిపోయిండు. అతని మనసెప్పుడూ భ్రమిస్తూనే ఉంటది. సమాజం చుట్టు తిరుగుతనే ఉంటది. తన చుట్టు జరుగుతున్న సంఘటనలను అనేక పరిశీలనలతో.. అనేక కోణాల నుంచి దర్శించి, ‘అలికిడి’గా ఒక మంచి సామాజిక కవిత్వాన్ని మనకు అందించిండు.
ఈ యువ కవి తను రాసింది కవిత్వమో, కాదో అంటడు. కవిత్వానికి రసాయన సమీకరణం లాగనో, గణిత సూత్రం లాగనో ఏదైనా ప్రత్యేక నిర్వచనముంటుందా? అని ప్రశ్నించుకున్నప్పుడు మరెన్నో ప్రశ్నలు పుడుతుంటయి. అంతకుమించి సమాధానాలు కూడా ఎదురు పడుతుంటయి. కవిత్వం రాయడంలో ఒక్కో కవికి ఒక్కో తీరు ఉంటది. ఏ తీరున రాసినా, అది ప్రజలు చదవగలిగే తీరులో ఉంటే సరిపోతది. కార్తీక రాజుది అటువంటి కవిత్వమే అని చెప్పగలను. సామాజిక కవిత్వం అనేది సమాజాన్ని చదివించేదిగా ఉన్నప్పుడే కవి సఫలమైనట్టని నా అభిప్రాయం. కార్తీక రాజు కవిత్వం సమాజాన్ని చదివించేదిగానూ ఉంది. ”కవి అనేవాడు నిరంతర అభ్యాసిగా ఉన్నప్పుడే సమాజానికి కావల్సిన అసలైన కవిత్వాన్ని రాయగల్గుతాడు” అనే మాటలు కార్తీక రాజుకు కూడ వర్తిస్తాయని చెప్పొచ్చు.
ఇక అలికిడి సంపుటిని తెరిచి చూస్తే… ఇందులో ఉన్న మొత్తం 63 కవితలూ 2015 నుండి 2020 మధ్య రాసినవే. అంటే అలికిడి ఒక పంచవర్ష కాలం పాటు కార్తీక రాజు మనసు చూపెట్టిన ఆరాటం, ఆందోళన, ఆవేశం అని చెప్పవచ్చు. ఒక్కో కవిత ఒక్కో వస్తువును గట్టిగ పట్టుకొని కొసమెరుపు లాంటి ముగింపును చూపెడుతుంటది. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అస్తిత్వమిచ్చిన కులవత్తి, ఊళ్ళోని వాగు, ప్రకతి, రైతులు, మహిళలు, వారసత్వ సంపద, మాతభాష, కరోనా కాలపు గడ్డు పరిస్థితులు… ఇలా ఎన్నో అంశాల మీద రాసిన కవితలున్నాయి. ఈ పుస్తకం విభిన్న అంశాలతో గుచ్చిన ఒక మాలగా కనబడుతుంది.
ఇక కొన్ని కవితల్లోకి తొంగి చూద్దాం. ‘నేనేవాదినంటే..’ అనే కవితలో ”మానవశ్రేయోవాదిని/ సమాజ హితం కోరుతూ సాగే/ సాహిత్య కళాకారుణ్ణి” అంటడు. నిజమే కదా! ఒక కవి ఎప్పుడూ ఒక వాదానికే పరిమితమై ఉండకూడదు. కవి సమాజ శ్రేయస్సు కోసం కండ్లు తెరిచి, కలలు కంటూ, తన భావోద్వేగాలను కవిత్వంగా మలిచి, తన గుండెలోని బరువును దించుకొని, అలుకగయ్యేటట్టు జేసుకుంటడు. మరొక కవిత ‘ఋతుచక్రం – మానవ జీవితచక్రం’లో మానవుని శైశవ దశ నుంచి వద్ధాప్య దశ వరకు ఆరు దశలుంటాయని చెప్పి, వాటిని ఆరు ఋతువులతో పోలుస్తూ సంబంధాన్ని సష్టించడం వినూత్నంగా అనిపిస్తుంది. అలాగే అడుగంటిపోయిన కులవత్తులను గుర్తు చేసుకుంట దానికి కారణమైన వ్యవస్థను ‘చాకిరిబండ’ కవితలో హెచ్చరిస్తాడు. అలాగే తను ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తుండటం వల్ల ‘వాళ్ళ నడుమ’ కవితలో ”నేనంటూ నేనులా బతికేది/ వాళ్ళ నడుమ మాత్రమే అనిపిస్తుంటుంది” అంటూ విద్యార్థులు తన చుట్టూతా ఎగురుతూ కనబడే రంగురంగుల సీతాకోకచిలుకలని, తాను ఓ తేనె పువ్వునని చెప్పుకుంటడు. చివరలో అన్నీ అర్థం చేసుకునేంత వయసు వాళ్ళది కాకపోయినప్పటికీ, వారివి ఇరుకు మనసులు, కరకు గుండెలైతే కాదని చెంపపెట్టులాంటి కొసమెరుపునిచ్చిండు.
‘అతీత శక్తి’ అనే కవితలో ”కవిత్వమంటే అంతే/ అది కదలికలోంచి పుట్టి/ కదలికను కలిగించే అతీతశక్తి!” అని పేర్కొంటూనే, ‘అంతులేని ఆరాటం’ కవితలో ”రాసిన ప్రక్రియ కవిత్వమో, కాదో/ భావం శ్రేయోవాదమైనప్పుడు/ కొంతమంది నోట్లో నుండి/ రాళ్ళు పడ్డా, పూలు పడ్డా/ ఆగిపోకుండా సాగిపోతూనే ఉంటా!” అని తన కవిత్వం మీద తన అభిప్రాయాన్ని ప్రకటించుకున్నడు. ఎంత పెద్ద కవైనా తను మొదటగా రాసిన కవిత్వం గురించి సాధారణంగా ఇలాగే చెప్పుకుంటారని తెలిసిన విషయమే. కానీ ఆ తర్వాత వచ్చే కవిత్వం ఎంతో పరిణితితో, లోతుగ, మెత్తగ, బొడ్డుమల్లె పువ్వంత అందంగా కనబడుతుంటది. అలికిడిలో కవి తను 2020 చివరి వరకు రాసిన కవిత్వాన్నే ప్రచురించాడు.
సాహిత్య ప్రపంచంలో నేనొక చిన్న అలికిడి చేస్తున్నానంటూనే, సమాజంతో అల్లుకున్న భావోద్వేగాలతో సందడి చేసాడు కార్తీక రాజు. తను భవిష్యత్తులో తన సాహిత్యంతో డైనమైట్‌ పేలినంతటి శబ్దాన్ని సష్టించాలని కోరుకుంటూ, అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
– గట్టు రాధిక మోహన్‌, 8790186340