కోయి కోటేశ్వరరావు ‘నాగస్వరం’నదుల్లోకి కొత్త నీరు వచ్చి పాత నీరు పోయినట్లుగానే, కవిత్వంలో కొత్త కలాలు తమ గళాలెత్తి నినదించాయి. కవిత్వమైమనోమైదానాలపై ప్రవహించాయి. కొత్త వస్తువులను నిర్దేశించాయి. కొత్త భావాలను వాగ్దానం చేశాయి. మూస ఆలోచనల నుండిమూగ సైగల నుండి సరికొత్త భాషకు అంకురార్పణ చేశాయి. ఇదీ కవిత్వమేనా? అని సనాతన ఛాందసులు వెక్కిరించినా ‘ఇదే కవిత్వమంటూ’ డప్పుకొట్టి దండోరా వేశాయి. నిర్భీతి, నిజాయితీ ఎజెండాగా నిప్పులాంటి నిజాలను ఎలుగెత్తి చాటాయి. తరతరాలకైఫీయతుల నుండి, దస్తావేజుల నుండి, దోపిడీ నుండి సామాజిక సత్యాలను వెలికితీసి కవిత్వానికి దిశా నిర్దేశం చేశాయి. ఈవిధమైన ఎరుకతో వర్తమాన తెలుగు కవిత్వంలో వివిధ సామాజిక సమస్యలపై, సంఘటనలపై కలం కదిలించిన కవిడాక్టర్ కోయి కోటేశ్వరరావు.
చారిత్రాత్మకమైన సంకలనం ‘కావడి కుండలు’ వంటి అనేక పుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. తెలుగు ఆచార్యుడై తరగతి గదిలో చైతన్యం రగిలించాడు. నడిచిన దారి కంటే నడవ వలసిన మార్గాన్ని నిర్దేశించాడు. అలుపెరుగని ఈ ప్రయాణంలో తననుతాను కవిగా ఆవిష్కరించు కున్నాడు. సామాజిక అసమానతలపై జాషువాలా ధిక్కార స్వరాన్ని వినిపించాడు. వస్తువైవిధ్యంతో మెరిసే బహుళ కవితల సమాహారం కోయి ‘నాగస్వరం’.
ఈ నాగస్వరంతో కులం మత్తుతో హాలాహలం చిమ్మే విషనాగుల ఆట కట్టించవచ్చు. వాటి కోరలు పీకి నేర్పుగా బుట్టలో పెట్టనూవచ్చు. మన కోయి పలికించే నాగస్వరం అతడి అనుభవాల అంతరంగ స్వరం. కణకణ మండే భావాలను కాంతివంతం చేసే అక్షర భాస్వరం. ప్రాణాధికంగా ప్రేమించే కవిత్వ ప్రాణ వాయువుతో సమకాలీన సాహిత్యాన్ని కాంతివంతం చేసిన సుస్వరం ఈ ‘నాగస్వరం’. చాలా వరకు వచన కవిత్వంలో కవిత్వం కనుమరుగై, వచనం రాజ్య మేలుతున్న తరుణంలో కోయి వంటి కవులు కవిత్వానికి సరికొత్త రంగు, రుచిని తీసుకు వచ్చారు. దళితోద్యమం వాహికగా సాగిన వీరి కవిత్వం పాయలు పాయలుగా చీలి, నదికి కొత్త నడక నేర్పింది. సరికొత్త గమనాన్ని, గమ్యాన్ని నిర్దేశించింది. ‘వేదంలో ఏముందో తెలియదు గాని/ మా అయ్య స్వేదంలోనే సష్టి జీవం వుంది/ రాతిని నాతిగా మార్చిన రామ పాదం కంటే/మట్టిని పరమాన్నంగా మార్చిన మా అయ్య పాదమే నాకు ఆరాధ్యం’ పాఠకులు రసస్ఫూర్తితో తలలూపే కవిత్వ పాదాలివి. అంతేకాదు అతడి గుండె నాదాలు కూడ. చాలామంది సీనియర్ కవుల్లో సైతం కన్పించని వస్తు నిర్మాణ దక్షత, కవితా శిల్ప నైపుణ్యం ఇతడిలో కనిపిస్తుంది. అందుకు వారి పద్యాత్మకమైన భాష, వచనాత్మకమైన కవిత్వంలో ఒదిగి రసాత్మకంగా మారింది. ”కల్లానికి ఆకలికి నడుమ ముసురుకున్న పెనుచీకటిలో/ ఆసామి భూస్వామి అవతారం ఎత్తితే/ మా అయ్య పొలంలోని ఎరువు గుట్టలా కరిగిపోయాడు” ఈ వాక్యాలు చదివి మనమూ నిలువునా కరిగిపోతాం. పౌరాణిక ప్రతీకలను నిర్దేశిత భావానికి అనుగుణంగా మార్చుకోవడంలో ఈనాటి కవులు ఎంతో నేర్పును ప్రదర్శిస్తున్నారు. ”బలి చక్రవర్తినేరాన్ని గురించి కాదు/ వామనుడు చేసిన సవాలక్ష ఘోరాల్ని గురించి/ నిర్భయంగా పంచాయితీ పెట్టాలి” అంటాడు కవి. ఇక్కడ కవి చిత్రించింది ఆధునిక వామనుడి ఆధిపత్య వాదాన్ని. ఇవాళ మనిషి ఆకాశ మంత ఎదిగిన వామనుడే కావచ్చు. కానీ దోపిడీతో దుర్మార్గంతో తడిగుడ్డలతో గొంతులుకోసే హింసో న్మాదంతో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు. ఈరకమైన ఆధిపత్యాన్ని మట్టు పెట్టాలని కవి ప్రబోధం.
కవిత్వం ఎత్తుగడ, నిర్వహణ, ముగింపులో కోటేశ్వరరావు వినూత్న శైలికి శ్రీకారం చుట్టాడు. కవిత తొలిపాదంతోనే ఉత్కంఠ కల్గించే మంచి ఎత్తుగడతో ఉంటుంది, ‘పత్తి పూవు’ శీర్షికన అమ్మను గురించి రాసిన కవితలో ”ఊరందరికీ మా అయ్య బానిసైతే/ పాపం మా అమ్మ మా అయ్యక్కూడ బానిస” అంటాడు. ఒకానొక కులదురహంకారం అయ్యను బానిసను చేస్తే, అది మరో రూపంలో అమ్మను కూడా బానిసగా మార్చింది. కవి ఇక్కడ కుల ప్రస్తావన తేలేదు. బానిస అనే చిన్న మాట ద్వారా నాటి సామాజిక దశ్యాన్ని కండ్ల ముందు ఆవిష్కరించాడు. కవితలోని భావారోహణ, పద చిత్రణ, వస్తుదశ్యీకరణ పాఠకుణ్ణి వేలు పట్టి నడిపించుకు పోతాయి. ఉత్తమ కవిత లక్షణం ఇదే. ‘ఆడతనం అంటరానితనం నడుమ అమ్మ రోకలి బండ కింద చితికిన దోస బద్దలా రోదిస్తుంది’ అంటాడు. రోకలిబండ, దోసబద్ద పట్టణ కవులకు తెలియవు. పేదరికం విత్తును చీల్చుక వచ్చిన కోటేశ్వరరావుకు తెలుసు. కవిత్వంలో స్థానీయత భావాన్ని, భాషను కాంతి వంతం చేస్తుంది. మహాకవి జాషువ రచనల్లో రసాత్మకతకు అదే కారణం! పూరి గుడిసె, ముదుక పంచె, గంజిబువ్వ, కుక్కిపడక ఇవన్నీ జాషువా పదాలు. గొడ్డు కారం, కళ్ళాపి, సొంటిముక్క, పున్నీళ్ళు, మాడు చెక్కలు, మసిబొగ్గు, నిప్పుల కుంపటి, వరదగుడి, గొడ్డుచాకిరి, కూటికుండ, వంటి గ్రామీణ పదబంధాలు ‘కోయి’ కవిత్వాన్ని కాంతివంతం చేశాయి. వస్తుతా దాత్మ్యంతో మనల్ని పలకరిస్తాయి. ”చిరిగి పోయిన అమ్మ రవికను చూసి గుడ్లగూబలన్నీ గుటకలు దిగమింగి నపుడు /ఆకాశాన్ని చించి అమ్మ ఒంటినిండా కప్పాలనిపిస్తుంది” ఇక్కడ కవి ఊహ భూమ్యాకాశా లను కలుపుతుంది. ఆకాశాన్ని చించి అమ్మ ఒంటినిండా కప్పడం సరికొత్త భావుకత. ఇక్కడ కోయి ”నేలను నింగియున్ తాళములుగ చేసి, వేపున రేగి వాయించి యాడ” అనే తిక్కన భావుకతకు దగ్గరగా కనిపిస్తాడు.
శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిభా వంతంగా ‘కొత్త చెప్పులు’ కవితలో కోయి అద్భుతంగా చిత్రించాడు. ”వడ్ల గింజలో ఇంకిపోయిన మా అయ్య ఒంటి సత్తువ/ కూటి కుండలో తుకతుక ఉడక్కపోతే ఊరికి కూడెట్టా దొరికేది?” అంటాడు. శ్రమ దీపాలైన లోకంలోని అయ్యలందరికీ వర్తించే సజీవ పాదాలివి. సరికొత్త జీవన వేదాలివి. కోయి కవిత్వంలోని సరికొత్త అభివ్యక్తులు ఈతరం కవుల కలాలకు కొత్త ఊహల్ని తొడిగుతాయి. తాపీ పని చేసే తన తమ్ముణ్ణి గురించి చెబుతూ – ”తాపీ పెన్నుతో నగరం ఎదపై/మహా సౌధకావ్యాలను రచించే భవనఋషి మా తమ్ముడు” అంటాడు. సమకాలీన ఉద్యమాలకు, సామాజిక సంఘటన లకు తక్షణం స్పందించిన కవుల్లో ‘కోయి’ కూడా ఒకరు. ముఖ్యంగా మాదిగ దండోరా, మాల మహానాడుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని నిర్మొహ మాటంగా నిష్పాక్షికంగా కవిత్వీకరించిన సమతావాది కోటేశ్వర రావు. ”మన మధ్య మిగిలింది పంచుకోవాల్సిన వాటాలే గాదు/ ఇద్దరం కలిసి పూడ్చుకోవాల్సిన గాయాల లోయలు కూడా ఉన్నాయి” అంటూనే అంతిమంగా సామాజిక న్యాయం వైపు నిలబడ్డాడు. అలాగే సామాజిక వాస్తవ దశ్యాల్ని కళ్ళకు కట్టినట్లు చెప్పడం కోయి కలానికీ బాగా తెలుసు. ”శవాల మీద చిల్లరను మూటగట్టు కోవడం సులభం/ మూటగట్టిన శవాల్లోకి నిర్భయంగా తొంగి చూడటమే కష్టం” అంటాడు మార్చురీ ఉద్యోగి సలీం గురించి రాస్తూ.. కుల దురహంకారపు దాడులకు బలైన నెత్తుటి గొంతులు పెట్టే పొలికేకను కవితాత్మకంగా చెప్పి, ఇకనైనా మనుషులుగా బతకమని నాగస్వరం కవిత్వంలో మనల్ని హెచ్చరిస్తాడు కవి. కోయి మనుషుల్ని ప్రేమిస్తాడు. సమాజాన్ని గౌరవిస్తాడు. ఎదుటి వాళ్ళ కష్టాలతో మమేకమై కన్నీళ్ళు తుడుస్తాడు. కనుకనే కోయి కవితల్లో పొడి మాటలుండవు. గుండెతడి మాటలుంటాయి. ”నా కవిత్వాన్ని మెదడుతో కాదు. ఆర్ధ్ర హదయంతో పఠించాలం”టాడు నవయుగకవి చక్రవర్తి జాషువా. కోయి కోటేశ్వరరావు కూడ దళిత కవితా దీపధారులైన జాషువా, భీమన్న, శిఖామణి, మద్దూరి, ఎండ్లూరి, కలేకూరి, పైడి తెరేష్ బాబుల మార్గంలో అక్షరసేద్యం చేస్తూ, దారికిరువైపులా కవిత్వ దీపాలను వెలిగించి కొత్త దారిలో సాగి పొమ్మంటాడు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రాల్నీ, హక్కుల్నీ కంటికి రెప్పలా కాపాడాలని, ఈ కాలానికి అవసరమైన తాత్త్విక స్ఫూర్తిని కోయి తన కవిత్వం ద్వారా అందిస్తున్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల వెలుగుల్లో శక్తివంతమైన కవిత్వాన్ని కోయి నాగస్వరం కవితా సంపుటిలో ఆవిష్కరించాడు. సామాజిక ప్రగతికి అవరోధంగా నిలిచిన కుల, మత, వర్గ సరిహద్దు రేఖల్ని చెరిపేసి, సర్వ మానవ సమతా రాగాన్ని సరికొత్త ‘నాగస్వరం’గా కోయి వినిపించాడు. జీవన తాత్త్వికతను కళా తత్త్వంతో రంగరించి, వినూత్న వస్తు వైవిధ్యంతో కవిత్వంలో రసాత్మక కళకు నిర్వచనమై నిలిచిన కోయి కోటేశ్వరరావుకు ఆత్మీయ అభినందనలు.
డా. బీరం సుందరరావు
6303443302