
– ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ కమ్మర్ పల్లి
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలంగాణ పై చిన్న చూపు ఉందని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తా వద్ద 63 నెంబర్ పై జాతీయ రహదారి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పిలుపుమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల చిన్నచూపు ఉందని, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకుండా తెలంగాణ పట్ల ఉన్న తమ వైఖరిని తేటతెల్లం చేశారన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది అన్నారు. తెలంగాణ నుండి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఉన్న రాష్ట్రానికి నిధులు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఇది చాలా సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారు అన్నారు. ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా నిధులను ఇచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, నూకల బుచ్చి మల్లయ్య, ఉట్లూరి ప్రదీప్, దూలూరి కిషన్ గౌడ్, సింగిరెడ్డి శేఖర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.