
నవతెలంగాణ – కంఠేశ్వర్
జైలులో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీలు జైలు శిక్ష పడిన వారిలో మార్పు తీసుకురావడానికి జైళ్ళలో సంస్కరణలు చేస్తున్నామని అందులో భాగంగా వారిలో ఉన్న మేళకువలను వెలికి తీయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని జైళ్ళ శాఖ డీజీ డా. సౌమ్యమిశ్రా అన్నారు. నిజామాబాద్ నగర శివారులోని జిల్లా జైలును డీజీ సౌమ్యమిశ్రా, ఐజి సంపత్, జిల్లా ఇంచార్జి పోలీసు కమిషనర్ సింధూశర్మలు సందర్శించారు.ఈ సందర్భంగా వరంగల్ కేంద్ర కారాగారంలో ఉన్న వివింగ్ యూనిట్ ను జిల్లా జైలుకు తరలించగా దానిని డీజీ సౌమ్యమిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జైలులో ఖైదీలు తయారు చేసిన బట్టలు, టవల్స్, న్యాపికిన్, బెడ్ షీట్స్ లాంటివి ఉత్పత్తికి కావాల్సిన 13 మిషన్లు ఉన్నాయని తెలిపారు. గతంలో వరంగల్ లో ఖైదీలు విజయవంతంగా తయారు చేసి అమ్మకాలు చేశారని గుర్తు చేశారు. ఖైదీలలో మార్పు తేవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సాయికిరణ్, సూపరింటెండెంట్ ఆనంద్ రావులు ఉన్నారు.