నవతెలంగాణ – సిద్దిపేట
30 సంవత్సరాలు పాఠశాలల్లో, ఎంఈఓగా విద్యారంగానికి సేవలందించాను, ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషిచేసిన, మరో మారు అవకాశం ఇవ్వండి మిగిలిపోయిన ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డి ఉపాధ్యాయులను కోరారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ టి యు, జేఏసీ, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ జేఏసీ, సుమారు 30 ఉపాధ్యాయ సంఘాల సహకారంతో మరోమారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటున్నట్లు తెలిపారు. కరీంనగర్ లో ఒక సెట్ నామినేషన్ వేశానని తెలిపారు. పాఠశాల నుండి అసెంబ్లీ వరకు విద్యారంగంపై పూర్తి అవగాహన ఉందని, ఉపాధ్యాయుల, విద్యారంగా, కేజీబీవీల సమస్యలపై అవగాహన ఉందని తెలిపారు. వాటి పరిష్కారానికి నా 36 సంవత్సరాల అనుభవం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పుడు కొంతమంది కార్పొరేట్ సంస్థల నుండి కుట్రపూరితంగా వచ్చి విద్యారంగంపై, ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలపై ఎలాంటి అవగాహన లేకుండానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలుస్తున్నారని, అలాంటి వారికి అవకాశం ఇస్తే విద్యారంగానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పని చేసినప్పుడు హైదరాబాదు నుండి ఆదిలాబాద్ వరకు ఏ ఉపాధ్యాయునికి సమస్య వచ్చిన అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరించానని అన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం వెంబడి ఉండి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, కానీ ఏ పార్టీ కండువా కప్పుకోలేదని అన్నారు. ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి, రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.