ఆదిలాబాద్ లో మొబైల్ వ్యాన్ ప్రారంభించిన కలెక్టర్

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పుస్తకాలు చదివితే జ్ఞానంతో పాటు ఆలోచన శక్తి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో  నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఆధ్వర్యంలో మొబైల్ పుస్తక పరిశ్రమ వ్యాన్ ను ఏర్పాటు చేశారు. దీనికి కలెక్టర్ ముఖ్య అథితిగా హాజరై వ్యాన్ ను ప్రారంభించారు. అనంతరం అందులోని పుస్తకాలను పరిశీలించి అభినందించారు. అదే విధంగా ఎన్ఆర్ వాసుల తరపున పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు నిత్యం పుస్తకపఠం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జ్ఞానం, ఆలోచన శక్తి పెరగాలంటే నిత్యం పుస్తకాలు చదవాలన్నారు. మహనీయులు, స్వతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్ర కలిగిన పుస్తకాలు చదివితే ప్రేరణ, గమ్యలను చేరుకునే శక్తి వస్తుందన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా నాలుగు రోజుల పాటు జిల్లాలో పుస్తక ప్రదర్శనతో పాటు అమ్మకాలు చేపడుతుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదే విధంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీని వినియోగించుకుంటు మంచి విషయాలను తెలుసుకోవాలన్నారు. ఆ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తు దిశ నిర్దేశం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రణిత, ఎంఈఓ సోమయ్య, లక్ష్మీపూర్ హెచ్ఎం కోరెడ్డి అశోక్, ప్రధానోపాధ్యాయుడు రమేష్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి సుజాత్ ఖాన్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.