మేడారంలో ఘనంగా గుడి మెలిగే పండుగ..

– మినీ జాతర పూజా కార్యక్రమాలు ప్రారంభం
– మేడారంలో సమ్మక్క, కన్నెపెళ్లిలో సారలమ్మ ఆలయాలు శుద్ధి
– ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు
నవతెలంగాణ- తాడ్వాయి
మేడారం, కన్నెపల్లి గ్రామాలలో పూజారులు బుధవారం గుడి మెలిగే పండుగ ఘనంగా నిర్వహించారు. మినీ జాతరకు వారం ముందు, ఈ గుడి మెలిగే పండుగ ను చేస్తారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు మేడారంలో, కన్నెపల్లిలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో పూజారులు అత్యంత నియమ నిష్ఠలతో వారి ఇండ్లను, దేవాలయాలను(గుడి లను) శుద్ధి చేసుకుని, అటవీ ప్రాంతానికి వెళ్లి గుట్ట గడ్డిని సేకరించి గుడిపై కప్పారు. అనంతరం గుళ్ళల్లో మహిళలు రంగురంగుల ముగ్గులను వేసి అలంకరించారు. గుడి ప్రాంగణం మొత్తం రంగురంగుల ముగ్గులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. గుడి మెలిగే పండగతో వనదేవతల మినీ జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. ఇప్పటినుంచి పూజారులు అత్యంత నియమనిష్టలు పాటిస్తారు. మల్లి వచ్చే 12 తారీకు బుధవారం రోజున మినీ జాతర (మండే మెలిగే పండుగను) నిర్వహిస్తారు. మేడారం మినీ జాతర ఉత్సవాలు ఊపందుకున్నాయి. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునేందర్, కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, బొక్కెన్న, మహేష్, సిద్ధబోయిన అరుణ్, సిద్దబోయిన పాపారావు, సిద్ధబోయిన నితిన్, అభ్యుదయ సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన బోజారావు, రానా రమేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.