ఫోన్ మన జీవితంలో ఓ భాగమైపోయంది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ ఫోన్ చేతిలోనే ఉంటున్నది. ఇక పడుకునే ముందు కచ్చితంగా మొబైల్ చూస్తూ పడుకుంటున్నారు. ఇది సర్వసాధారణమైన ప్రక్రియగా మారిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు పడుకునే ముందు కూడా ఫోన్ చేతిలో ఉండాల్సిందే. కొంతమంది మొబైల్ ఫోన్ పట్టుకుని అలానే నిద్రపోతారు. కొంతమంది అయితే తెల్లారేవరకు మొబైల్ చూసి తెల్లారిన తరువాత పడుకునే వారూ ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కరలేదు. పడుకునే ముందు ఎక్కువ సేపు ఫోన్ చూస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇటీవల ఓ సర్వేలో తేలింది.
అధిక రక్తపోటు
చైనాలోని హెబీ మెడికల్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ టీమ్ జరిపిన ఈ స్టడీలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా, పగటిపూట కంప్యూటర్ ముందు, టీవీ ముందు లేదా వీడియో గేమ్‌లు ఆడటం కంటే రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తున్నప్పుడు రక్తపోటు ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. నిద్రపోతున్నప్పుడు రీల్స్ చూడటం యువకులలో హై బీపీకి కారణమవుతుందని పేర్కొన్నారు.
నిద్ర పట్టదు
రాత్రిపూట కళ్లపై ఎక్కువ నీలిరంగు లైట్లు పడటం వల్ల నిద్ర పట్టదు. దీనివల్ల శరీర బరువు పెరగడం, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరగడం, యూరిక్ యాసిడ్ పెరగడం వంటి సమస్యలు వస్తాయని తెలిసింది.
అలాగే చిన్న పిల్లలు కూడా రాత్రి పడుకునే ముందు మొబైల్ చూడడం వల్ల వారి మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని, నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అందుకే రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందే మొబైల్స్ బంద్ చేయడం మంచిది.